రేషన్‌.. గందరగోళం

ABN , First Publish Date - 2020-03-30T10:08:38+05:30 IST

కరోనా కలకలం నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రారంభమైన రేషన్‌ సరుకుల పంపిణీలో తీవ్ర గందరగోళం నెలకుంది.

రేషన్‌.. గందరగోళం

పలుచోట్ల అస్తవ్యస్తంగా పంపిణీ

పోర్టబిలిటీని అనుమతించని రేషన్‌ డీలర్లు

పలుమార్లు మొరాయించిన ఈ పోస్‌ సర్వర్‌

జిల్లాలో అనేక దుకాణాలకు చేరని సరుకులు

పాలు ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించని వైనం


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌):కరోనా కలకలం నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రారంభమైన రేషన్‌ సరుకుల పంపిణీలో తీవ్ర గందరగోళం నెలకుంది. బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో పంచదార ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అనేక దుకాణాలకు రేషన్‌ సరుకు అందలేదు. దీంతో ఆయా డీలర్లు దుకాణాలు తెరవలేదు. దుకాణాలు తెరిచిన చోట  సచివాలయ అడ్మిన్‌లు ఆలస్యంగా రావడంతో పంపిణీ ప్రక్రియలో జాప్యం  చోటు చేసుకుంది. మరోవైపు ఈ-పోస్‌ సర్వర్‌ రెండు సార్లు మొరాయించడంతో రేషన్‌ సరుకుల పంపిణీ మందకొడిగా జరిగింది. తొలి రోజున పంపిణీ శాతం కేవలం 10.50గానే జిల్లాలో నమోదైంది. 20 మండలాల్లో అయితే పంపిణీ శాతం 10 లోపే ఉన్నది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ఆయా రేషన్‌ దుకాణాల వద్ద ఒక్కొక్కరికి మీటర్‌ దూరం ఉండేలా ముగ్గుతో బాక్సులు వేసి సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు.


అయితే కందిపప్పు అయిపోతుందని   కార్డుదారులు పెద్ద సంఖ్యలో భారీగా బారులు తీరారు. కొన్ని చోట్ల ముగ్గులు వేసినప్పటికీ జనం రద్దీగా ఉండడంతో ఆయా నిబంధనలు పాటించలేదు. మరికొన్ని చోట్ల ముగ్గులు కూడా వేయలేదు. దీంతో ఎవరికైనా కరోనా వైరస్‌ ఉంటే అందరికీ సోకుతుందేమోనని కార్డుదారులు భయాందోళనలు చెందారు.  సచివాలయ ఉద్యోగులు రేషన్‌ తీసుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకుని ఫోన్‌ నెంబర్‌, వారి వివరాలు నమోదు చేసుకుంటుండడంతో జాప్యం జరిగింది. ఈ లెక్కన రోజుకు 40 నుంచి 50 మందికి కూడా ఇవ్వలేకపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. పంపిణీకి సంబంధించి చివరి నిమిషంలో తీసుకొన్న పలు నిర్ణయాలు కిందిస్థాయికి చేరలేదు. అధికారులు కేవలం డీలర్ల వాట్సాప్‌ నెంబర్లకు ఆదేశాలు పంపి మిన్నకుండిపోయారు. దీంతో డీలర్లకు స్పష్టమైన అవగాహన లేకపోవడంతో రెండు రోజుల క్రితం జారీ అయిన ఆదేశాలనే అమలు చేశారు. జిల్లాలోని 2802 రేషన్‌ దుకాణాలకు కీ రిజిష్టర్లను పంపించారు. వాటిని వీఆర్‌వోలు/సెక్రెటరీలు ముందు పెట్టుకొని అందులో పేరు ఉంటేనే వారు ఈ-పోస్‌లో వేలిముద్ర వేసి వారికి బియ్యం, కేజీ కందిపప్పు, అర కేజీ చక్కెర సరుకులు ఇచ్చారు. ఎండ కారణంగా ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల తమ వంతు కోసం పాదరక్షలు, బియ్యం కవర్లు పెట్టి నిరీక్షించారు. 


ఎండ.. నిరీక్షణలతో కార్డుదారుల అవస్థలు

రేపల్లె నియోజకవర్గంలో రేషన్‌ సరుకులు ఎన్ని రోజులు ఇస్తారో ప్రజలకు అవగాహన లేకపోవటంతో కార్డుదారులంతా ఒక్కసారిగా రేషన్‌ షాపుల వద్ద చేరారు. దీంతో ఆయా దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించలేదు. మాచర్లలో పలు రేషన్‌ దుకాణాలు అసలు తెరుచుకోలేదు. లబ్ధిదారులు గుంపులు, గుంపులుగా దుకాణాల వద్దే ఎదురుచూస్తూ నిరీక్షించాల్సి వచ్చింది. చిలకలూరిపేట ప్రాంతంలో చాలా వరకు దుకాణాల వద్ద కార్డుదారులు గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వచ్చింది. సర్వర్‌ కూడా నెమ్మదించడంతో సరుకుల పంపిణీ ప్రక్రియ నత్తనడకన కొనసాగింది. యడ్లపాడులో ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ అందక ఈ-పోస్‌ యంత్రాలు నెమ్మదించి 15శాతం కార్డులకు కూడా సరుకులు పంపిణీ జరగలేదు. బాపట్ల నియోజకవర్గంలోని రేషన్‌దుకాణాలు కార్డుదారులతో కిటకిటలాడాయి.  


టైంస్లాట్‌ సమాచారం ఇవ్వని వలంటీర్లు

రేషన్‌ షాపుల వద్ద రద్దీని నియంత్రించేందుకు వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు వలంటీర్లు తమ పరిధిలోని 50 గృహాల్లోని తెల్లకార్డుదారులు ఏ రోజున, ఏ సమయానికి రేషన్‌ షాపునకు వెళ్లాలో కచ్యితంగా తెలియజేయాలి. అలానే ఆ రోజున ఆ సమయానికి వారు రేషన్‌ షాపు వద్ద అందుబాటులో ఉండాలి. అయితే అసలు వలంటీర్లు తమ ఇంటికి వచ్చి టైం స్లాట్‌ గురించి చెప్పలేదని పలువురు కార్డుదారులు తెలిపారు. 


రెడ్‌జోన్‌లో వారికి పాత గుంటూరులో రేషన్‌

కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూసిన మంగళదాస్‌నగర్‌ పరిధిలోని రెడ్‌జోన్‌ కాలనీవాసులకు పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని రేషన్‌ దుకాణానికి పంపారు. అయితే ఆ ప్రాంతానికి చెందిన వారంతా పాత గుంటూరులోనే దుకాణానికి రావడానికి ఇబ్బంది పడ్డారు. మరో వైపు రెడ్‌జోన్‌లో వారిని ఇతర ప్రాంతాలకు ఎలా తీసుకొస్తారని ప్రజలు నిలదీసినా సంబంధిత సచివాలయ అడ్మిన్లు లెక్క చేయలేదు. మరో వైపు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్న డీలర్లు తమ వద్దకు రాకుంటే సరుకు మిగిలిపోతుందని, వేరే ప్రాంతాలకు వెళితే స్థానికులకు సరుకు లభించక ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు.

Updated Date - 2020-03-30T10:08:38+05:30 IST