బండెడు చాకిరీ చేయలేం..

ABN , First Publish Date - 2021-02-25T05:38:49+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన పథకం మొబైల్‌ డిసి్ట్రబ్యూషన యూనిట్‌ (ఎండీయూ) నిర్వాహకులు బండెడు చాకిరీ చేయలేమంటూ చేతులెత్తేశారు. వాహనాలను జిల్లావ్యాప్తంగా 90 శాతానికి పైగా ఆపివేసి తమ భవిష్యత్తు ఏమిటో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

బండెడు చాకిరీ చేయలేం..
కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ఇంటింటికీ రేషన పంపిణీ వాహనదారులు

డ్రైవర్‌గా అయితే సరే.. లేదంటే రాజీనామాలు

జిల్లాలో ఆగిపోయిన రేషన బండ్లు

జేసీకి ఫిర్యాదు చేసిన ఇంటింటికీ రేషన పంపిణీ ఎండీయూలు

కడప (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన పథకం మొబైల్‌ డిసి్ట్రబ్యూషన యూనిట్‌ (ఎండీయూ) నిర్వాహకులు బండెడు చాకిరీ చేయలేమంటూ చేతులెత్తేశారు. వాహనాలను జిల్లావ్యాప్తంగా 90 శాతానికి పైగా ఆపివేసి తమ భవిష్యత్తు ఏమిటో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.  ఈనెల ఆరంభం నుంచే రేషన పంపిణీ విషయంలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను తప్పుపడుతూ వారంతా రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో ప్రభుత్వం దిగొచ్చి వారందరికీ కొంత ఆర్థిక భరోసా కల్పించింది. అయితే ఆర్థిక భరోసా మాట దేవుడెరుగు హమాలీలు దొరకడం లేదని, అన్నీ తామై వెట్టిచాకిరీ చేయలేమంటూ బుధవారం ఎండీయులు జాయింట్‌ కలెక్టర్‌ గౌతమిని కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఈ పథకం అమలుకు మండల స్థాయి తహసీల్దార్లు మొదలు వీఆర్వోలు, ఆర్‌ఐలు తెల్లవారుజాము 5 గంటల నుంచే తమను నిద్రమేల్కొనేలా చేస్తూ ఉదయం 6 గంటలకే రేషన పంచినట్లు గ్రూప్‌లో పెట్టాల్సి రావడంతో కంటి మీద కునుకులేకుండా పోతోందని వాపోయారు. తమను నియమించుకునే  సమయంలో నోటిఫికేషనలో డ్రైవర్లుగా పేర్కొన్నారని. తీరా అంగీకారపత్రంలో సంతకాలు తీసుకుని హెల్పర్లను నియమించుకోవాలని హుకుం జారీ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక్కో హెల్పర్‌కు రూ.5 వేలు ప్రకటించినప్పటికీ అంత తక్కువ కూలీకి రాలేమంటున్నారని, ఒకరోజు వచ్చిన వారు మరోరోజు రావడం లేదని, సరుకులు పంచకుంటే అధికారుల ఒత్తిడి భరించలేకున్నామన్నారు. ఒక్కో డీలరు షాపులో డీలరుతో పాటు ఒక హెల్పర్‌ పనిచేస్తారని, అదే మూడు డీలర్‌ షాపుల పరిధిలోని 1500 నుంచి 2 వేల రేషనకార్డులకు సరుకులు పంచేందుకు కేవలం డ్రైవర్‌, హెల్పర్‌తో ఎలా సాధ్యమౌతుందో అధికారులే చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే తాము వాహనాలను నడపలేమంటూ జాయింట్‌ కలెక్టర్‌కు విన్నవించారు.  ప్రభుత్వ పాలసీ ప్రకారం పనిచేయాలని జేసీ వారికి చెప్పినట్లు తెలిసింది. 


హెల్పర్‌కే రూ.12 వేలు ఇచ్చాను..

- నవాజ్‌, రాయచోటి 

మాకు ప్రభుత్వం ఉపాధి కల్పించిందనే సంబరంలో 3 రేషన షాపులకు చెందిన సరుకులు పంపిణీ చేసినందుకు ఇప్పటి వరకు రూ.12 వేల రూపాయలు హెల్పర్‌కు ఇచ్చాను. సరుకులు ఇచ్చేటపుడు డీలర్ల నుంచి తూకాలు వేయకపోవడం వల్ల ప్రతిరోజు షార్టేజ్‌ వస్తోంది. డ్రైవర్‌ పని అయితేనే చేస్తాను. ఇతర పనులైతే రాజీనామా చేయడానికి సిద్ధం.


చేతి నుంచి డబ్బులు కడుతున్నాం..

- మహేశ, నందలూరు 

మాకు డ్రైవర్‌గా వాహనాలు ఇచ్చి ఈ-పోస్‌ యంత్రాల ఆపరేట్‌, రేషన సరుకుల పంపిణీ, తిరిగి సరుకు డీలరుకు అప్పగించడం, డబ్బులు చెల్లించే సరికి రాత్రి 10 గంటలు అవుతోంది. డ్రైవర్లుగా పనిచేసే మాకు ఈ-పోస్‌ యంత్రాల ఆపరేట్‌ తెలియకపోవడంతో బియ్యం తూకాల్లో వ్యత్యాసాలు, మరోపక్క అవగాహనా రాహిత్యంతో రోజూ 300 నుంచి 400 వందల రూపాయల వరకు షార్టేజ్‌ భరించక తప్పడం లేదు. డ్రైవర్లుగా అయితే పని చేస్తాము. లేకుంటే రాజీనామాలే శరణ్యం.


Updated Date - 2021-02-25T05:38:49+05:30 IST