మేమేమి చేశాం పాపం?

ABN , First Publish Date - 2020-04-01T19:36:13+05:30 IST

కరోనా విపత్తు వేళ అందరికీ రేషన్‌ సరుకులు..

మేమేమి చేశాం పాపం?

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అర్హులకు అందని రేషన్‌ సరుకులు

టీడీపీ సానూభూతిపరులకు నిలిపివేత

వైసీపీ నాయకుల ఆదేశాల మేరకేనంటున్న వలంటీర్లు

ఆందోళనకు దిగిన బాధితులు


పలాస, మార్చి 31: కరోనా విపత్తు వేళ అందరికీ రేషన్‌ సరుకులు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలో టీడీపీ సానుభూతిపరులన్న నెపంతో తొమ్మిది మంది రేషన్‌కార్డుదారులకు సరుకులు అందించలేదు. ఇదేమని వలంటీర్లను ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు ఇవ్వొద్దన్నారని చెప్పడంతో బాధిత కుటుంబాలు మంగళవారం ఆందోళనకు దిగాయి. దీంతో కొద్దిపాటి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.


లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలో రేషన్‌ సరుకుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగా పురుషోత్తపురం కాలనీలో రేషన్‌ సరుకులు అందించారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న తొమ్మిది మంది లబ్ధిదారులకు సరుకులు అందించలేదు. జాబితాలో వారి పేర్లు ఉన్నచోట రౌండప్‌ చేసి ఉంచారు. ఇదేమని ప్రశ్నిస్తే వలంటీరు నుంచి మౌనమే సమధానమైంది. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. వలంటీరును నిలదీశారు. వైసీపీ నాయకుల ఆదేశాల మేరకే రేషన్‌ పంపిణీని నిలిపివేసినట్టు చెప్పడంతో వివాదం పెద్దదైంది. 


ఇంతలో ఓ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన సోదరుడు వచ్చి టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. అకారణంగా రేషన్‌ నిలిపివేశారని పొందర పద్మ, పొందర సరస్వతి, పార్వతి, చంద్రశేఖర్‌, మల్లేశ్వరరావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వార్డు వలంటీరు శంకర్‌ను విలేకరులు వివరణ కోరితే వైసీపీ నాయకులు జాబితాలో పేర్లను రౌండప్‌ చేశారని.. వారికి సరుకులు ఇవ్వొద్దన్నారని చెప్పారు. మరో వలంటీరు యశోద మాట్లాడుతూ తనకు అసలు వివరాలే రాలేదని, గతంతో ఉన్న వివరాల మేరకు సరుకులు అందిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై సీఎస్‌డీటీ భాగ్యలక్ష్మిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా అందరికీ రేషన్‌ సరుకులు అందుతాయని.. ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.


అడ్డుకోవడం అన్యాయం

నిరుపేదలకు రేషన్‌ సరుకులు అందకుండా వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం అన్యాయమని టీడీపీ నాయకులు అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు లొడగల కామేశ్వరరావుయాదవ్‌, గాలి కృష్ణారావు, మాజీ ఎంపీపీ బత్తిన హేమేశ్వరరావు, నాయకులు గురిటి సూర్యనారాయణ, బద్రి గోపాల్‌, గోళ్ల చంద్రరావు, అంబటి కృష్ణమూర్తిలు మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-04-01T19:36:13+05:30 IST