ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది

ABN , First Publish Date - 2021-03-02T06:38:02+05:30 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జొహరాపురంలో మున్సిపల్‌ సోమవారం ఆయన రోడ్‌ షో నిర్వహించారు.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది
మాట్లాడుతున్న రామకృష్ణ

  1. పోలీసులు రాజకీయం చేస్తున్నారు
  2. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ


కర్నూలు (కలెక్టరేట్‌) మార్చి 1: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జొహరాపురంలో మున్సిపల్‌ సోమవారం ఆయన రోడ్‌ షో నిర్వహించారు. కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో ఏకగ్రీవాల కోసం జగన్మోహన్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులతో రాజకీయాలు చేయిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళితే రేణిగుంట విమానాశ్రయంలోనే నిర్బంధించడం దారుణమని అన్నారు. ‘రాష్ట్రం ఏమైనా మీ అబ్బ జాగీరా..? లేక మీ తాత ఏమన్నా రాసిచ్చాడా..?’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డిపై ఆయన మండిపడ్డారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. విశాఖపట్నం కార్పొరేషన్‌లో పాగా వేయడానికి ఒక కార్పొరేటర్‌ అభ్యర్థికి అధికార పార్టీ రూ.కోటి రూపాయలు ఇచ్చి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. విశాఖలోని ఉక్కు కర్మాగారాన్ని పోస్కో కంపెనీకి అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి ప్రజలను శాంతింపజేసేందుకు కర్నూలులో పెట్టాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డును విశాఖకు తరలిస్తున్నారని అన్నారు. డోన్‌ డీఎస్పీ రాజకీయాలు చేస్తున్నారని, డోన్‌లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాజకీయం చేయడం మానేశారని అన్నారు. ఎవరు నామినేషన్‌ వేయాలో అని అభ్యర్థులను కూడా డీఎస్పీనే వెతుకుతున్నారని అన్నారు. విపక్ష అభ్యర్థులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విత్‌డ్రాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజా స్వామ్యాన్ని పోలీసుల ద్వారా పాతరేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బదులుగా ఎన్నికలను రద్దు చేసి, జగన్‌ తన పార్టీ అభ్యర్థులతో కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పాలన చేసుకుంటే బాగుంటుందని అన్నారు. గత ప్రభుత్వంలో రూ.1500 ఉన్న ట్రాక్టర్‌ ఇసుక ప్రస్తుతం రూ.6 వేలకు చేరిందని అన్నారు. టిప్పర్‌ ఇసుక రూ.40 వేలు పలుకుతోందని అన్నారు. జిల్లాలో సీపీఐ, తెలుగుదేశం పార్టీలు కలిసి కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను చూసి, టీడీపీ, సీపీఐ కూటమికి ఓటు వేయాలని కోరారు. 

Updated Date - 2021-03-02T06:38:02+05:30 IST