విజయవాడ: సినిమా టిక్కెట్ల రేట్లపై ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి అసోసియేషన్ల వారితో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు, సినిమా వాళ్ళు పరస్పర దూషణలు చేసుకోవడం సరికాదన్నారు. వ్యక్తులతో విడివిడిగా కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ డైరెక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లు, థియేటర్ల యాజమాన్య సంఘాలతో చర్చలు జరిపితేనే ఫలితం ఉంటుందన్నారు. సినిమా టికెట్ల ధరలు తగ్గింపుపై దృష్టి పెట్టిన విధంగానే సిమెంటు, ఇసుక, స్టీల్, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాలని రామకృష్ణ సూచించారు.