రామయ్యశాట్‌ పేరిట నానో ఉపగ్రహం

ABN , First Publish Date - 2022-07-21T18:21:36+05:30 IST

నగరంలోని ఎంఎస్‌ రామయ్య అప్లైడ్‌ సైన్స్‌ యూనివర్సిటీ ‘రామయ్య శాట్‌’ పేరిట ప్రత్యేక నానో ఉపగ్రహ తయారీ చేపట్టనుంది. గోకుల

రామయ్యశాట్‌ పేరిట నానో ఉపగ్రహం

                                 - Bengaluruలో కీలక ఒప్పందం 


బెంగళూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఎంఎస్‌ రామయ్య అప్లైడ్‌ సైన్స్‌ యూనివర్సిటీ ‘రామయ్య శాట్‌’ పేరిట ప్రత్యేక నానో ఉపగ్రహ తయారీ చేపట్టనుంది. గోకుల ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ నిర్వహణలోని రామయ్య అప్లైడ్‌ సైన్స్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ ఈ మేరకు నగరంలో మంగళవారం కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ సహకారంతో 75 మంది విద్యార్థులతో కూడిన శాటిలైట్‌ మిషన్‌ బృందం ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్య సమితి 76వ సదస్సులో ప్రపంచ నేతలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నానో శాటిలైట్‌ ప్రస్తావన ఉందని, ఈ కలను సాకారం చేసేందుకు తమ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని రామయ్య అప్లైడ్‌ సైన్స్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎంఆర్‌ జయరాం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కోటి రూపాయలు ఖర్చు కాగలవని అంచనా వేస్తున్నామన్నారు. ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎల్‌వీ మురళికృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు భారతీయ అంతరిక్ష కార్యక్రమాలలో ఓ మైలురాయి కానుందని అభివర్ణించారు. ప్రైవేట్‌ రంగంలో రామయ్య ఉపగ్రహ తయారీ ఓ కీలక పరిణామమన్నారు. 1.6 కిలోల బరువైన ఈ ఉపగ్రహం బెంగళూరులోని పీణ్యా క్యాంప్‌సలోనే తయారు కానుందని తమ సాంకేతిక నిపుణులు పర్యవేక్షణ జరుపుతారన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కులదీప్‌ రైనా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-21T18:21:36+05:30 IST