అయోధ్య రామాల‌య భూమిపూజ ఆహ్వాన ప‌త్రిక చూశారా?

ABN , First Publish Date - 2020-08-02T12:19:58+05:30 IST

యూపీలోని అయోధ్య‌లో రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5 న జరగబోయే భూమి పూజను తిల‌కించేందుకు దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌ధ్యంలో అయోధ్యలో ఉత్సాహ‌పూరిత వాతావ‌ర‌ణం...

అయోధ్య రామాల‌య భూమిపూజ ఆహ్వాన ప‌త్రిక చూశారా?

అయోధ్య: యూపీలోని అయోధ్య‌లో రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5 న జరగబోయే భూమి పూజను తిల‌కించేందుకు దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌ధ్యంలో అయోధ్యలో ఉత్సాహ‌పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. భూమిపూజ‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు వస్తున్నారు. భూమిపూజ‌ కోసం అతిథులకు పంపిన ఆహ్వాన లేఖ ఇప్ప‌డు ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ కార్య‌క్ర‌మానికి 200 మంది అతిథులను ఆహ్వానిస్తున్నారు. రామ‌జన్మభూమి తీర్థ‌క్షేత్ర ట్రస్ట్ అతిథులకు ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను పంపుతోంది. దీనిలో ప్రధాని మోదీ రాక గురించిన‌ సమాచారం కూడా ఉంది. ఇంతేకాకుండా అతిథులు ఆగస్టు 4 న సాయంత్రానికే అయోధ్యకు చేరుకోవాలని అభ్యర్థించారు. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, బీజేపీ నేత ఉమా భారతి, రామాలయ ఉద్యమంతో సంబంధం క‌లిగిన‌ సాధ్వీ రితాంభర, ఇక్బాల్ అన్సారీ త‌దిత‌రుల‌ను ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆగస్టు 5 న ప్ర‌ధాని మోదీ ఉదయం 11.15 గంటలకు సాకేత్ కాలేజీకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హనుమాన్ గ‌డి ఆలయానికి వెళతారు. తరువాత రామాల‌య‌ భూమి పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఇది ముగిసిన అనంత‌రం ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయోధ్యలో దాదాపు 2 గంటలు గడిపిన తరువాత ప్రధాని మోదీ ఢిల్లీకి బయలుదేరుతారు.

Updated Date - 2020-08-02T12:19:58+05:30 IST