చైనా ఏం చెప్పినా రాహుల్ గాంధీ నమ్ముతారు : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2022-02-05T22:46:15+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా చెప్పినవాటిని చదివి, నమ్మేస్తారని

చైనా ఏం చెప్పినా రాహుల్ గాంధీ నమ్ముతారు : రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా చెప్పినవాటిని చదివి, నమ్మేస్తారని, వాస్తవాలను పరిశీలించరని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బల్‌దేవ్‌లో జరిగిన బీజేపీ ప్రచార సభలో మాట్లాడుతూ, పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావించారు. 


గాల్వన్‌ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కేవలం ఇద్దరు, ముగ్గురు చైనా సైనికులు మాత్రమే మరణించినట్లు రాహుల్ గాంధీ చెప్పారని రాజ్‌నాథ్ అన్నారు. ఆయన ఏం చదివితే దానినే నమ్ముతారన్నారు. ఈ ఘర్షణలో 38 నుంచి 50 మంది వరకు చైనా జవాన్లు మరణించారని ఇటీవల ఓ ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించిందన్నారు. భారత దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయన్నారు. 


ప్రపంచ దేశాలు గతంలో భారత దేశాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకునేవి కాదన్నారు. ఇప్పుడు యావత్తు ప్రపంచం మనం చెప్తున్నదానిని వింటోందన్నారు. ఉరి, పుల్వామాలలో ఉగ్రవాద దాడుల అనంతరం మన సైన్యం పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టిందన్నారు. మనం ఓ గట్టి సందేశాన్ని పంపించామన్నారు. 


రాహుల్ గాంధీ ఏమన్నారంటే...

రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విదేశీ నేతలను ఎందుకు తీసుకురాలేకపోయారో ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. నేడు మన దేశం ఏకాకిగా మారిందన్నారు. మన దేశాన్ని శత్రువులు చుట్టుముట్టారని తెలిపారు. తామేం చేయాలనుకుంటున్నదీ చైనీయులకు స్పష్టత ఉందని చెప్పారు. నరేంద్ర మోదీ విధానాల వల్ల చైనా, పాకిస్థాన్ సన్నిహితంగా మారాయన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడారు. 


Updated Date - 2022-02-05T22:46:15+05:30 IST