మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం... మీ జోక్యం అనవసరం : అమెరికాకు తేల్చి చెప్పిన రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2020-05-30T20:46:19+05:30 IST

ప్రపంచ దేశాలన్నింటితోనూ భారత్ సత్సంబంధాలనే కోరుకుంటోందని, అది తమ ప్రభుత్వ విధానమని ఆయన తేల్చి చెప్పారు. ఇందు

మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం... మీ జోక్యం అనవసరం : అమెరికాకు తేల్చి చెప్పిన రాజ్‌నాథ్

న్యూఢిల్లీ : లడఖ్‌లో నెలకొన్న వివాదంపై చైనాతో చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ప్రకటించారు. భారత్, చైనాకు చెందిన సైనిక, దౌత్య స్థాయిలోని అధికారులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారని ఆయన తెలిపారు. రెండు దేశాలు కూడా ఈ వివాదాన్ని పరిష్కరించుకోడం వైపే మొగ్గు చూపుతున్నాయని, తొందర్లోనే సమస్య పరిష్కారమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన ఓ జాతీయ ఛానల్‌తో అభిప్రాయాలను పంచుకున్నారు.


ఈ విషయంపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతూనే ఉన్నారని, అమెరికా జోక్యం అనవసరమని, ఓ పద్ధతి ప్రకారం పరిష్కారమవుతాయని ఆయన తేల్చి చెప్పారు. అయితే శుక్రవారం సాయంత్రం రాజ్‌నాథ్ సింగ్ అమెరికా ప్రతినిధి మార్క్ ఎస్పేర్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కూడా మళ్లీ మధ్యవర్తిత్వం అన్న ప్రతిపాదన వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.


‘‘భారత్, చైనాలు ఈ విషయంపై మాట్లాడుకుంటున్నాయి. ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే తామిద్దరమే పరిష్కరించుకుంటాం. మిలటరీ స్థాయి అధికారులు, దౌత్యవేత్తలతో పరిష్కారం చేసుకుంటాం. ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయని నేను ఆ అధికారికి తేల్చి చెప్పాను’’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు.


ప్రపంచ దేశాలన్నింటితోనూ భారత్ సత్సంబంధాలనే కోరుకుంటోందని, అది తమ ప్రభుత్వ విధానమని ఆయన తేల్చి చెప్పారు. ఇందు కోసం తాము శతధా ప్రయత్నిస్తామని, అయితే కొన్ని సందర్భాలు మాత్రం తద్భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. చైనాతో సరిహద్దు వివాదంలో గతంలో కూడా జరిగాయని, వాటిని పరిష్కరించుకుంటామని రాజ్‌నాథ్‌ తేల్చి చెప్పారు. 

Updated Date - 2020-05-30T20:46:19+05:30 IST