Abn logo
Sep 17 2020 @ 09:15AM

రజనీ రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధం.. సర్వే!

  • పోటీకి నాలుగు నియోజకవర్గాల్లో సర్వే 
  • ఎన్నికలకు ముందు రెండు మహానాడులు

చెన్నై : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఓ వైపు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతూ మరో వైపు రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు రజనీ చర్యలు చేపడుతున్నారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తప్పకుండా పోటీ చేయాలని నిర్ణయించారు. ఆ లోగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ నిర్వాహకుల ద్వారా సర్వే చేయించే ప్రయత్నాల్లో  ఉన్నారు. ఆ నాలుగు నియోజకవర్గాలలో రజనీ అభిమానులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, రజనీ మక్కల్‌ మండ్రం నేతలకు ప్రజలలో పలుకుబడి అధికంగా వుందని తెలుస్తోంది. ఈ యేడాది ఫిబ్రవరిలో చెన్నై స్టార్‌ హోటల్‌లో రజనీ మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి తాను పోటీ చేయనని, పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని, ఐపీఎస్‌, ఐఏఎస్‌ వంటి విద్యావంతులైన యువకుడిని సీఎం సీటులో కూర్చోబెడతానని ప్రకటించారు.


ఆ తర్వాత ఐదు నెలలకు పైగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న అన్నాత్తే సినిమా షూటింగ్‌ మళ్ళీ ఎప్పుడు ప్రారంభిద్దామా? సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న షూటింగ్‌కు ఎన్ని నెలలు కాల్షీట్లు  ఇవ్వాలనే అంశంపై సమాలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో  రజనీ పార్టీని ప్రారంభించాలని, ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయాలని రాష్ట్రంలోని పలు నగరాల్లో ఆయన అభిమానులు, రజనీ మక్కల్‌ మండ్రం నేతలు పోస్టర్లు అతికించి సంచలనం కలిగిస్తున్నారు. దీంతో తన అభిమానులు, మండ్రం నేతలు ఎవరూ అలాంటి పోస్టర్లు వేయకూడదంటూ కట్టడి చేశారు. అదే సమయంలో తాను రాజకీయప్రవేశం చేయనున్న శుభముహూర్తం గురించి మండ్రం నేతలకు సూచాయిగా రజనీ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రజనీ అభిమానుల సంతోషానికి పట్టపగ్గాలు లేకపోయింది.


నవంబర్‌లో పార్టీ?

రజనీ మక్కల్‌ మండ్రం నాయకులు సమాచారం ప్రకారం రజనీ నవంబర్‌లో రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ పేరును ప్రకటించి, పార్టీ లక్ష్యాలపై సుదీర్ఘ ప్రకటన చేస్తారు. రాజకీయప్రవేశంపై మదురై లేదా వేలూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రకటించాలని రజనీ భావిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయనని ప్రకటించడంతో నిరుత్సాహంతో ఉన్న అభిమానులకు సంతోషం కలిగించే విధంగా అక్టోబర్‌లో పార్టీ ప్రారంభం గురించి రజనీ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. అదే సమయంలో పార్టీ తొలి మహానాడు జరుగనున్న నగరం పేరు కూడా ప్రకటించనున్నారు. అక్టోబర్‌లో పూర్తిగా మహానాడు ఏర్పాట్లపై ఆయన మండ్రం నేతలు, అభిమాన సంఘాల నాయకులతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతారు.

నాలుగు నియోజకవర్గాలు

అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పోటీ చేయడం ఖాయం కనుక గెలిచే అవకాశాలున్న నాలుగు నియోజక వర్గాల్లో మండ్రం నేతలు, అభిమాన సంఘాల నాయకులు ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వేలూరు, షోళింగర్‌, తిరువణ్ణామలై, మదురై నియోజకవర్గాల్లో  ఏదైనా ఒక నియోజకవర్గంలో రజనీ పోటీ చేస్తారు. ఈ నాలుగు నియోజకవర్గాలను రజనీ ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. ఒక వేళ ఊహించని విధంగా ఈ నాలుగు నియోజకవర్గాలను విడిచిపెట్టి చివరిక్షణంలో చెన్నై నగరంలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం లేకపోలేదని మండ్రం నేతలు తెలిపారు.


మహానాడు ఏర్పాట్లు

అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ తరఫున రెండు చోట్ల భారీ స్థాయిలో మహానాడు జరపాలని రజనీ నిర్ణయించారు. ఆ మేరకు మదురై, వేలూరు నగరాల్లో పార్టీ మహానాడును పెద్ద యెత్తున జరిపి అభిమానులను, మండ్రం నేతల్లో ఉత్సాహం నింపాలనే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? లేక ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని పోటీ చేయాలా? అనే విషయంపై కూడా మండ్రంంలోని సీనియర్‌ నేతలతో రజనీ చర్చలు కూడా జరుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు పొందిన ఓట్ల శాతాలు, తదితర వివరాలను కూడా సేకరించి రజనీ పరిశీలిన్నారు. ఏది ఏమైనప్పటికీ అక్టోబర్‌ తర్వాత తమిళ రాజకీయాల్లో తమిళ సూపర్‌స్టార్‌ కీలక పాత్రను పోషించడం ఖాయమని తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement