రజనీతో బీజేపీ, కాంగ్రెస్‌ రహస్యమంతనాలు!

ABN , First Publish Date - 2020-09-29T17:29:19+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభించక ముందే ఆయనతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీలు రహస్యంగా మంతనాలు

రజనీతో బీజేపీ, కాంగ్రెస్‌ రహస్యమంతనాలు!

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభించక ముందే ఆయనతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీలు రహస్యంగా మంతనాలు చేస్తున్నాయి. రెండేళ్ళకు మునుపు రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించిన రజనీకాంత్‌ ఇంకా పార్టీని ప్రారంభించలేదు. ఈ డిసెంబర్‌లోగా ఆయన పార్టీ ప్రారంభించి వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాల్సి వుంది. గత ఫిబ్రవరిలో చెన్నైలో  మీడియా ప్రతినిధుల సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని, తాను సీఎం పదవికి దూరంగా ఉండి పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగిస్తానని రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు మిత్రపక్షాలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలను మాత్రమే కేటాయించాలని భావించాయి. ఈ కారణంగా ఆ పార్టీలకు మిత్రపక్షాలైన బీజేపీ, పీఎంకే, డీఎండీకే పార్టీలు రజనీ పెట్టబోయే పార్టీవైపు దృష్టిసారిస్తున్నాయి. ఆ దిశగా డీఎంకే కూటమిలో ఉన్న వామపక్షాలు, డీపీఐ, ఎండీఎంకే ప్రముఖులు కొందరు రజనీకాంత్‌తో రహస్యంగా ఫోన్‌లో చర్చిస్తున్నారు. పార్టీ ప్రారంభించక ముందే పొత్తులపై చర్చలెందుకని రజనీ వారిని ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. రజనీ పార్టీ ప్రారంభిస్తే తన సినీరంగ చిరకాలపు మిత్రుడు కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం పార్టీని కూటమిలో చేర్చుకునే అవకాశం ఉంది. గతంలో కమల్‌హాసన్‌ ఏర్పాటు చేసిన సభలో రజనీ మాట్లాడుతూ భవిష్యత్‌ రాజకీయ అవసరాల కోసం ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కమల్‌ పార్టీతో చేతులు కలుపుతానని ప్రకటించారు. మక్కల్‌ నీది మయ్యం తర్వాత రజనీ జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమని చెబుతున్నారు. తరచూ ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ప్రకటనలు కూడా చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు రజనీతో పొత్తుల దిశగా చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ కూడా రజనీ పార్టీతో పొత్తుపెట్టుకోవాలని పావులు కదుపుతోంది. రజనీకాంత్‌తో చిరకాల మిత్రులుగా ఉన్న కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ నేతలు ఇప్పటికే ఆయనతో ఎన్నికల పొత్తుపై రెండు మూడుసార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక దినకరన్‌ నాయకత్వంలోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం కూడా రజనీ పార్టీ దిశగానే అడుగులు వేస్తోంది. రాందాస్‌ నాయకత్వంలోని పీఎంకే కూడా ఈ సారి కొత్త పార్టీలతో పొత్తుపెట్టుకోవాలనే భావిస్తోంది. పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్‌కు రజనీకాంత్‌కు మొదటినుండి సన్నిహిత సంబంధాలున్నాయి. అన్నాడీఎంకే గనుక అడిగినంత సీట్లు ఇవ్వకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతోనో, రజనీ పెట్టబోయే పార్టీతోనూ పొత్తుకుదుర్చుకుని బరిలోకి దిగాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది ఇప్పటికే పీఎంకే సీనియర్‌ నేతలు కొందరు రజనీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రజనీ కొత్త పార్టీ పెడితే అన్నాడీఎంకే, డీఎంకే కూటమిలో కొనసాగుతున్న మిత్రపక్షాల్లో కొన్ని కూటమికి గుడ్‌బై చెప్పి ఆ పార్టీలో చేరిపోవడానికి సిద్ధంగా వున్నాయి. రజనీ ఈ పార్టీలను కలుపుకుని మోగా కూటమిని ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారా? లేక కమల్‌పార్టీతో మాత్రమే పొత్తుపెట్టుకుని పోటీకి దిగుతారా? అనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Updated Date - 2020-09-29T17:29:19+05:30 IST