రాజస్థాన్ బీజేపీ చీఫ్‌పై కత్తితో దాడి

ABN , First Publish Date - 2022-07-06T23:38:40+05:30 IST

రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పూనియాపై బుధవారంనాడు కత్తితో దాడి..

రాజస్థాన్ బీజేపీ చీఫ్‌పై కత్తితో దాడి

జైపూర్: రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పూనియాపై బుధవారంనాడు కత్తితో దాడి జరిగింది. పార్టీ కార్యకర్తలు సకాలంలో రక్షణగా నిలవడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన అనంతరం ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్‌సమంద్ వెళ్లిపోయారు.


ఆసక్తికరంగా, ఉదయ్‌పూర్, అమ్రావతి హత్యలపై ఎన్‌ఐ దర్యాప్తు జరుపుతుండగా, ఈ రెండు విద్వేషపూరిత హత్యల వెనుక ''అంతర్గత కుట్ర'' (Internal conspiracy) ఉందని పూనియా వ్యాఖ్యలు చేశారు. ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్య విషయంలో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. బుజ్జగింపు విధానాల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. కన్హయ్యలాల్‌ను హత్య చేసిన వ్యక్తులే జూన్ 17వ తేదీన కన్హయ్యలాల్‌ను బెదరించారని అన్నారు.


''మృతుడు (కన్హయ్య లాల్) గతంలోనే భద్రత కావాలని అడిగాడు. కానీ పోలీసులు ఆయనకు భద్రత ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం'' అని సతీష్ పూనియా ఆరోపించారు. రాజస్థాన్‌లో పరిస్థితిని వివరిస్తూ, పలుచోట్ల హిందువులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అనుసరిస్తున్న బుజ్జగింపు విధానాలే ఇందుకు కారణమని అన్నారు.

Updated Date - 2022-07-06T23:38:40+05:30 IST