అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటాం: గెహ్లాట్

ABN , First Publish Date - 2020-08-09T21:22:27+05:30 IST

అసెంబ్లీలో తమ మెజారిటీ నిరూపించుకుంటామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ..

అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటాం: గెహ్లాట్

జైసల్మేర్: అసెంబ్లీలో తమ మెజారిటీ నిరూపించుకుంటామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదివారంనాడు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కోరుకోవడం లేదని తెలిపారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో గెహ్లాట్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ సమవేశాల ప్రారంభమయ్యే ఆగస్టు 14 తర్వాత కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.


'మేము గెలుస్తాం. ప్రభుత్వాన్ని అస్థిరపరచరాదని కోరుకుంటున్న అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా ఇందులో గెలుస్తారు. ఎమ్మెల్యేల మనోభావాలను తెలుసుకునేందుకు అందరికీ లేఖలు రాశాను. ప్రజలందరూ మాతోనే ఉన్నందున మేము గెలుస్తాం' అని గెహ్లాట్ పేర్కొన్నారు.


కాంగ్రెస్ అసమ్మతివాదుల (రెబల్స్)పై అడిగిన ప్రశ్నకు గెహ్లాట్ స్పందిస్తూ, బీజేపీ నేతలు, పార్టీని వదిలిపెట్టిన నాయకులపై ఇంటింటా ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. దీనిని వారు కూడా గ్రహించి ఎక్కువ మంది వెనక్కి తిరిగి వస్తారని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. హర్యానాలోని హోటళ్లలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ఎవరినీ అనుమతించడం లేదని, వందలాది బౌన్సర్ల పర్యవేక్షణలో వారిని ఉంచారని గెహ్లాట్ పేర్కొన్నారు.


రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మరోసారి గెహ్లాట్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుంటే, ఇదే అదనుగా తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే పనిలో బీజేపీ బిజీగా ఉందని అన్నారు. ఏడెనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను వాళ్లు (బీజేపీ) కుప్పకూల్చారని, కోవిడ్-19ను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తాము బిజీగా ఉన్న తరుణంలో బీజేపీ తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.


రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఈనెల 14న ప్రారంభం కానున్నారు. గెహ్లాట్-పైలట్ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన గెహ్లాట్...కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైపూర్‌లోని ఫెయి‌ర్‌మాంట్ హోటల్‌లో ఉంచారు. పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలను హర్యానాకు తరలించారు.

Updated Date - 2020-08-09T21:22:27+05:30 IST