Abn logo
Oct 25 2020 @ 01:35AM

మహాగౌరీ అలంకారంలో అమ్మవారి దర్శనం

మహిషాసుర మర్ధిని అమ్మవారికి మహాపూజ

ఘనంగా తెప్పోతవ్సం


వేములవాడ, అక్టోబరు 24 : వేములవాడ  రాజరాజేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో  రాజరాజేశ్వరి అమ్మవారు శనివారం మహాగౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గాష్టమి సందర్భంగా ఉదయం అమ్మవారికి అర్చక సువాసినీలతో మహా అభ్యంగన స్నానం, మహాభిషేకం, లలితా సహస్రనామ సహిత చతుష్షష్య్టోపచార పూజ, నాగిరెడ్డి మండపంలో హవనము నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భాగవత పురాణ ప్రవచనం, అనంతరం కన్యకాసువాసినీ పూజలు చేశారు. రాత్రి 8 గంటలకు మహిషాసుర మర్ధిని అమ్మవారికి అర్చకులు మహాపూజ నిర్వహించారు. 


వైభవంగా అమ్మవారి తెప్పోత్సవం 

 శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య  రాజరాజేశ్వరిదేవి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ధర్మగుండం వరకు  ఊరేగింపుగా తీసుకెళ్లారు.  విద్యుద్దీపాలతో హంస ఆకారంలో రూపొందించిన ప్రత్యేక తెప్పపై ఉంచి తెప్పోత్సవం నిర్వహించారు.  

Advertisement
Advertisement