రజనీకాంత్ ఎప్పుడు పార్టీ ప్రారంభించినా..!?

ABN , First Publish Date - 2020-08-31T14:37:05+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించి అప్పుడే పొత్తులపై వ్యూహరచనలు చేస్తున్నాయి.

రజనీకాంత్ ఎప్పుడు పార్టీ ప్రారంభించినా..!?

  • కూటమిలో కొనసాగాలా..వద్దా!? 
  • డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలా?  
  • పీఎంకే ఊగిసలాట
  • 6న సర్వసభ్య సమావేశంలో నిర్ణయం


చెన్నై : అసెంబ్లీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించి అప్పుడే పొత్తులపై వ్యూహరచనలు చేస్తున్నాయి. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ సీట్ల కోసం మంతనాలు సాగిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ నాయకత్వంలోనే కూటమి ఏర్పడుతుందని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. దాని ని ఖండిస్తూ అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి తమ పార్టీ నాయకత్వంలోనే కూటమి ఏర్పాట వుతుందని కౌంటర్‌ ఇచ్చారు. ఇలా ప్రధాన పార్టీలూ రెండూ ఎన్నికల వేడిని పెంచుతుంటే వన్నియార్ల ఓటు బ్యాంకు కలిగిన పీఎంకేలో ఎలాంటి సందడి కనిపించడంలేదే అంటూ అందరూ భావిస్తున్న సమయంలో ఆ పార్టీ సర్వసభ్య మండలి సమావేశం సెప్టెంబరు ఆరున జరుగుతుందంటూ పీఎంకే అధ్యక్షుడు జీకే మణి హఠాత్తుగా ప్రకటించారు. 


ఈ మేరకు సర్వసభ్య మండలి సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా జరుగుతుందని ఆయన తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌, యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ సమక్షంలో ఈ ప్రత్యేక సమావేశం జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. సాధారణంగా ఏ ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీల కంటే పీఎంకే చాలా బిజీగా మారిపోవటం ఆనవాయితీ. పార్టీ వ్యవ స్థాప కుడు రాందాస్‌ ఒక్కో ఎన్నికలకు ఒక్కో తీరుగా వ్యవహరి స్తుం టారు. ఒకసారి అన్నాడీఎంకేతో మరోసారి డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం, రెండు పార్టీలు అడిగినంత సీట్లు ఇవ్వక పోతే ఒంటరిగా పోటీ చేయడం వంటి నిర్ణయాలు తీసుకుం టారు. ఏ పార్టీ అధికంగా సీట్లు ఇస్తే ఆ కూటమి లో పీఎంకే చేరటం ఆనవాయితీగా వుంటోంది.


వెరైటీగా అసెంబ్లీ ఎన్నికలు

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అన్నాడీఎంకే అధి నేత్రి జయలలిత, డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి మరణం తర్వాత తొలిసారిగా అసెంబ్లీకి జరిగే ఎన్నికలివే.  దీనికితోడు కరోనా నిబంధనల నడుమ ఆ ఎన్నికలు జరుగనున్నాయి. అదే సమ యంలో అటు అన్నాడీ ఎంకే, ఇటు డీఎంకే కూటమి లో కొత్త పార్టీలు చేరే అవకాశాలున్నాయి. నిన్నమొన్నటి దాకా కత్తులు దూసుకున్న పార్టీలన్నీ శత్రుత్వాన్ని మరచి స్నేహ హస్తం అందించనున్నాయి. ప్రస్తుతానికి అన్నాడీఎంకేలోనే పీఎంకే కొనసాగు తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో తనకంటూ ఓటు బ్యాంక్‌ను పెంచుకుంది. తన ఓటు బ్యాంకు తగ్గకుండా జాగ్రత్త పడుతోంది. పీఎంకేకు సైనికు ల్లాంటా పార్టీ శ్రేణులు ఉండటం ప్లస్‌ పాయింట్‌. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఓ ప్రకటన చేస్తుంది. తమ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టు కుంటుందో ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంద న్నదే ఆ ప్రకటన సారాంశం. గత లోక్‌సభ ఎన్నికల్లో పీఎంకే ప్రధాన ప్రతిపక్ష మైన డీఎంకేతో పొత్తు పెట్టుకునేం దుకు ప్రయ త్నించింది కానీ సరైన వ్యూహరచన చేయకపోవ డంతో ఆఖరి క్షణంలో అన్నాడీ ఎంకే కూటమిలో చేరాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఒక్క చోట కూడా గెలువకపోయినా తమ పార్టీ కంటూ ఓటు బ్యాంక్‌ను పెంచుకోగలిగింది.


రేసులో డీఎంకే

గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూతవేటు దూరంలో అధి కారం కోల్పోయింది. స్వల్ప మెజారిటీతో అన్నాడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి అన్నాడీఎంకేలో ఇమేజ్‌ కలిగిన నాయ కులెవరూ లేకపోవడంతో బలమైన కూటమితో గెలవా లని డీఎంకే తహతహలాడుతోంది. ఇప్పటికే విజయకాంత్‌ నాయకత్వంలోని డీఎండీకేపై వల విసిరింది. ఇదే రీతిలో వన్ని యార్ల ఓటు బ్యాంకు కలిగిన పీఎంకేను తన కూటమిలోకి చేర్చేందుకు పావులు కదుపుతోంది. ఇటీవల రాందాస్‌ పుట్టిన రోజు సందర్భంగా స్టాలిన్‌ అరగంటసేపు ఆయనతో సంభాషిం చడం రాజకీయ సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిలోకి రమ్మంటూ స్టాలిన్‌ రహస్యంగా రాందాస్‌ను ఆహ్వానించారని చెబుతున్నారు.


అన్నాడీఎంకేపై అన్బుమణి విమర్శలు 

పీఎంకే యువజన విభాగం నాయకుడు డాక్టర్‌ అన్బుమణి అన్నాడీఎంకే కూటమిలో కొనసాగు తూనే తరచూ చెణకులు విసురుతూ వింత వైఖరిని ప్రదర్శిస్తు న్నారు. జనవరిలో ఓ సభలో ఆయన మాట్లా డుతూ పీఎంకేతో పొత్తు పెట్టుకున్నందువల్లే అన్నాడీఎంకే అధి కారం లోకి రాగలిగిందని ప్రక టించి సంచలనం రేపారు. అంతటితో ఆగకుండా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్ల లో అన్నాడీఎంకే పోటీ చేయ డానికి పీఎంకే సహకరించిందన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగాలనే సదుద్దేశంతోనే పీఎంకే అధిక సీట్ల కోసం పట్టుబట్టలే దంటూ ఓ వివరణ కూడా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్ష మైన తమ పార్టీకి అన్నాడీఎంకే మొండిచేయి చూపించిందని అన్బుమణి ఆరోపించారు. కనీసం అడిగినంత కౌన్సిలర్ల సీట్లు కూడా కేటా యించలేదని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఇలాంటి ధోరణి ప్రదర్శించకూడదంటూ అన్నాడీఎంకేకు హితవు చెప్పారు. అన్బు మణి చేసిన ఈ వ్యాఖ్యలు అన్నా డీఎంకే నాయ కులకు ఆగ్రహం తెప్పించాయి. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య రాజీ కుదిర్చేందుకు రెండు పార్టీల నాయకులు ప్రయత్నించారు.


రజనీకాంత్‌ వైపు...

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆయన అభిమాన సంఘాల కంటే పీఎంకే నాయకులు రాందాస్‌, అన్బుమణి, జీకేమణి ఆసక్తిగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రజనీ పార్టీని ప్రారంభిస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా..? అన్న ప్రశ్నకు రాందాస్‌ ఇప్పటి దాకా సమాధానమే చెప్పలేదు. రాందాస్‌ మౌనం అంగీకారంగా భావించాల్సివుంది. రజనీ ఎప్పుడు పార్టీని ప్రారంభించినా ఆ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు పీఎంకే నాయకులు ప్రయత్నిస్తారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పీఎంకే ఇలా అన్నాడీఎంకే కూటమిలో వుంటూనే డీఎంకే, రజనీకాంత్‌ ప్రారంభించబోయే కొత్త పార్టీ వైపు దృష్టి సారించనుండటం వెనుక బలమైన కారణాలున్నాయి. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, తన తనయుడు అన్బుమణిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో బెట్టాలని రాందాస్‌ ఎప్పటి నుంచో కలలకంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్బుమణి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే విధంగా పోస్టర్లు ముద్రించారు. ‘అన్బుమణి అనే నేను....’ అనే నినాదంతో ఉన్న పోస్టర్లు అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ప్రస్తుతం అన్బుమణిని ముఖ్యమంత్రిగా చేయడానికి అనువుగానే రాందాస్‌ పావులు కదలిస్తున్నారు. 


వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలనాటికి తన చిరకాల వాంఛ నెరవేరకపోయినా, ఆ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో పోటీ చేసి గెలవాలని భావిస్తు న్నారు. పార్టీకంటూ ఎమ్మేల్యేలుంటే ప్రజలకు సేవ చేసి మంచి పేరుతెచ్చుకోవచ్చునని, ఆ ఇమేజ్‌తో తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చునని రాందాస్‌ ప్రణాళిక వేసుకున్నారు. తమిళభాషపై డీఎంకే తర్వాత వీరాభిమానాన్ని ప్రదర్శించే పార్టీగా పీఎంకే పేరు తెచ్చుకుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో హిందీ భాషను నిర్బంధంగా అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా డీఎంకేతోపాటు పీఎంకే కూడా నిరసన ప్రకటిస్తుంది. ఈ కారణాలతో రాష్ట్ర ప్రజలు  డీఎంకే తర్వాత పీఎంకేని తమిళులకు అండగా నిలిచే పార్టీ అని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే సెప్టెంబర్‌ ఆరున పీఎంకే సర్వసభ్య మండలి సమావేశం జరుగనుంది. అందులో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు గురించే అధికంగా చర్చలు జరుపనున్నారు.

Updated Date - 2020-08-31T14:37:05+05:30 IST