నిధులున్నా విదిల్చరు

ABN , First Publish Date - 2021-10-14T06:53:57+05:30 IST

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్‌లో జనరల్‌ ఫండ్స్‌, ఫైనాన్స్‌ నిధులు బాగానే ఉన్నాయి.

నిధులున్నా విదిల్చరు

  రాజమహేంద్రవరం నగరంలో అభివృద్ధి పనులకు సీఎఫ్‌ఎంఎస్‌ కష్టాలు
  నిధులున్నా అనుమతి లేక సతమతం
 టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు
 నగర పాలక సంస్థలో ఆగిన పనులు

 
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్‌లో జనరల్‌ ఫండ్స్‌, ఫైనాన్స్‌ నిధులు బాగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సీఎఫ్‌ఎంఎస్‌లో అనుమతి రాకపోవడంతో గతంలో పనిచేసిన వారికి బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్తగా పనులు చేద్దామన్నా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో నగరంలో అనేక ప్రధాన రోడ్లతోపాటు అంత ర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. అటు వివిధ శాఖల్లో నిధుల కొరత ఇబ్బంది పెడుతుంటే రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జనరల్‌ ఫండ్స్‌ బాగానే ఉన్నాయి. పైగా ఇంతవరకూ సుందరీకరణ తదితర పనులకు 15వ ఆర్థిక సంఘం నిధులే ఉపయోగించారు. ఇవన్నీ గతంలో మంజూరైన నిధులు. ఈ నిధులు చూపి కొందరి కాంట్రాక్టర్లతో పనులు చేయించినా ఇవాళ బిల్లులు చెల్లించలేని పరిస్థితి. సీఎఫ్‌ఎంస్‌ ఎప్పుడో ఓపెన్‌ అవుతుందో, ఎప్పుడు క్లోజ్‌ అవుతుందో ఎవరికీ అర్థంకావడం లేదు. ఈ నిధులే కాదు జనరల్‌ నిధులతో కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంది. సుమారు ఏడాది నుంచి వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.35 కోట్ల మేర బకాయిలు పేరుకున్నాయి. దీంతో ఇటీవల కొన్ని పనులకు టెండర్లు పిలిచినా ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 100 మందికి పైగా చిన్నాపెద్దా కాంట్రాక్టర్లు ఉన్నారు. అందులో 15 మంది వర కూ పెద్ద కాంట్రాక్టర్లు. కానీ ఇవాళ పనులు చేయడానికి వీరిలో ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఉంటాయి. గతంలో ఈ నిధులు మురిగిపోయే పరిస్థితి ఏర్పడడంతో రెండేళ్ల కిందట హడావుడిగా కాంట్రాక్టర్ల చేసి పనులు చేయించారు. రూ.4.5 కోట్లతో ఈ పను లు చేశారు. ఇంతవరకూ ఒక పైసా ఇవ్వలేదు. దీంతో ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అందులో నలుగురు మానసిక ఒత్తిడి, అనారోగ్యం వల్ల మృతి చెందినట్టు చెబుతున్నారు.

20 పనులకు రెండు సార్లు టెండర్లు

సుమారు 20 పనుల కోసం గత నెల 14, 29వ తేదీల్లో అధికారులు టెండర్లు పిలిచారు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీంతో ఏంచేయాలో తెలియని స్థితిలో అధికారులు తలపట్టుకున్నారు. ఇందులో వివిధ డివిజన్లలో రోడ్ల నిర్మా ణం, సీసీ డ్రైనేజీ, టైల్స్‌, గ్రానైట్‌ పనులతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు ఉన్నాయి. ప్రధానంగా శ్రీనగర్‌కాలనీలో బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.64,55,697తో టెండర్లు పిలిచారు. ఈ పని 2019-20లో మంజూరైంది. జే ఎన్‌ రోడ్డులోని రామాలయం సెంటర్‌ నుంచి హైవే వరకూ రహదారి నిర్వహణకు రూ.69,65,701తో టెండర్లు రెండుసార్లు పిలిచినా ఫలితం శూన్యం. ఆవ చానల్‌ వద్ద మేజర్‌ డ్రెయిన్‌ నిర్మాణానికి రూ.66,24,715, మోరంపూడి జంక్షన్‌ నుంచి ఎల్‌ఐసీ ఆఫీసు వరకూ రోడ్డు విస్తరణకు రూ.82,39, 727తో టెండర్లు పిలిచారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. కొందరు లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం కొన్ని పనులు చేస్తున్నారు.

Updated Date - 2021-10-14T06:53:57+05:30 IST