అమరావతి మహిళలు ఇబ్బందులు కనిపించవా?

ABN , First Publish Date - 2021-04-17T05:58:38+05:30 IST

‘తెలంగాణలో ఆందోళన చేస్తున్న కుమార్తె షర్మిలకు స్వల్పగాయమైందని అల్లాడి పోయిన విజయమ్మకు.. ఏపీలో కుమారుడైన జగన్‌రెడ్డి అమరావతి మహిళలను, రైతులను పోలీసుల సహకారంతో ఎన్నో ఇబ్బందులు పెడుతుంటే ఎందుకు స్పందించరు..’ అని అమరావతి మహిళలు, రైతులు ప్రశ్నించారు.

అమరావతి మహిళలు ఇబ్బందులు కనిపించవా?
మందడం శిబిరంలో జై అమరావతి అంటూ ఆందోళనలు చేస్తున్న మహిళలు

486వ రోజు దీక్షల్లో విజయమ్మకు రాజధాని రైతుల ప్రశ్న


తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, ఏప్రిల్‌ 16: ‘తెలంగాణలో ఆందోళన చేస్తున్న కుమార్తె షర్మిలకు స్వల్పగాయమైందని అల్లాడి పోయిన విజయమ్మకు.. ఏపీలో కుమారుడైన జగన్‌రెడ్డి అమరావతి మహిళలను, రైతులను పోలీసుల సహకారంతో ఎన్నో ఇబ్బందులు పెడుతుంటే ఎందుకు స్పందించరు..’ అని అమరావతి మహిళలు, రైతులు ప్రశ్నించారు. ఇంటింటికి తిరిగి కొడుకును గెలిపించండి అంటూ ప్రచారం చేసిన విజయమ్మకు అమరావతి మహిళలు పడుతున్న బాధలు తెలిసి కూడా పట్టించుకోవడంలేదన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన పాపానికి 486 రోజుల నుంచి రోడ్ల మీద కొచ్చి ధర్నాలు చేయాల్సి దుస్థితి ప్రస్తుత ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, మహిళలు చేస్తోన్న దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానికి ఇచ్చిన 33 వేల ఎకరాలతో అభివృద్ధిని కొనసాగించమని అడుగుతున్నామే కాని పాలకుల ఆస్తులు అడగడం లేదన్నారు. అమరావతిని నాశనం చేయాలనే అధికారం చేపట్టిన ఆరు నెలల తర్వాత మూడు ముక్కల ఆట మొదలు పెట్టి రైతుల్ని మోసం చేశారన్నారు. అహింసా మార్గంలో ఉద్యమం చేస్తున్న తమపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. అధికారం ఇస్తే మాట తప్పుతారా అని ప్రశ్నించారు. పాలకులు మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే ఆంధ్రులకు ఎక్కడ విలువ ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం నెక్కల్లు, ఐనవోలు, రాయపూడి, లింగాయపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, ఐనవోలు, మందడం, తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల దీక్షలు శుక్రవారంతో 486వరోజుకు చేరుకున్నాయి.  రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక, ముక్కామల గ్రామాల్లో రైతులు, మహిళలు శుక్రవారం నిరసనలు తెలిపారు. 

Updated Date - 2021-04-17T05:58:38+05:30 IST