Bike రైడింగ్‌కు రండి.. Minister KTR కు రాజాసింగ్ సవాల్..
ABN , First Publish Date - 2021-10-17T12:17:54+05:30 IST
తనతో పాటు బైక్ రైడింగ్‌కు రావాలని.. మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే...
హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్ : తనతో పాటు బైక్ రైడింగ్‌కు రావాలని.. మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. నగరంలో వర్షం పడుతున్న సమయంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో లైవ్‌గా చూపిస్తానని అని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అసెంబ్లీలో మాటలకే పరిమితమని.. వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయని ఆయన మంత్రికి సెల్ఫీ వీడియో ద్వారా ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం... ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రమే ధనిక రాష్ట్రమని ప్రజలకు కాదని అన్నారు. ఏడేళ్లుగా మాటల్లో మాత్రం పాతనగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. వర్షం పడిన ప్రతిసారి నగరంలో దారుణమైన పరిస్థితి ఉంటుందని... తనతో గోషామహల్ నియోజకవర్గం నుంచి బైక్‌పై తిరగాలన్నారు. వాస్తవంగా కనీసం సైకిల్ వెళ్లేందుకు కూడా అస్కారం లేని విధంగా రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న మంత్రికి తాను వ్యక్తి గతంగా విజ్ఞప్తి చేస్తున్నాని, వెంటనే తనతో పాటు పాతబస్తీలో పర్యటించేందుకు రావాలని, సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.