ఏమిటి ఈ ధరలు? అధికారులు స్పందించకపోతే..

ABN , First Publish Date - 2020-03-29T10:13:32+05:30 IST

ఒక్కసారిగా ఆంక్షలు...

ఏమిటి ఈ ధరలు? అధికారులు స్పందించకపోతే..

ధరలకు రెక్కలు

కందిపప్పుపై కిలోకు రూ.10, మినపపప్పుపై రూ.15-20 పెంపు

ఆయిల్‌ ప్యాకెట్‌ రూ.90 నుంచి 110కి..!

గోధుమపిండి, ఉప్మా రవ్వ ధరలు కూడా పెరుగుదల

ఉల్లికి కొరత... ప్రస్తుతం రూ.30కు విక్రయం

టోకుబజారులో పెరిగిన కొనుగోళ్లు

రైతులకు అందని సరకు

బయట నుంచి తగ్గిన దిగుమతులు

అధికారులు తక్షణం చర్యలు తీసుకోకపోతే ఇబ్బందే


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): ఒక్కసారిగా ఆంక్షలు... ఎక్కడికక్కడ సరకు వాహనాల నిలిపివేతతో నిత్యావసర సరకులు, ఉల్లిపాయలు, కొన్నిరకాల కూరగాయలకు గిరాకీ ఏర్పడింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు రేటు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. 


నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు

గత రెండు రోజులతో పోల్చితే నగరంలోని మార్కెట్లలో డబుల్‌హార్స్‌ మినుపగుళ్లు కిలోపై రూ.15 నుంచి రూ.20 పెంచేశారు. వార్దా కందిపప్పు అధికశాతం దుకాణాల్లో దొరకడం లేదు. రెండో రకం కందిపప్పు వున్నా కిలోపై రూ.10, ఫ్రీడమ్‌ ఆయుల్‌ లీటర్‌ ప్యాకెట్‌ రూ.90 నుంచి రూ.110కు పెంచారు. ఈ ఆయిల్‌ కోసం రిటైలర్లు పూర్ణామార్కెట్‌లో హోల్‌సేల్‌ డీలర్‌ వద్ద ఉదయం ఆరు గంటలకే క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉంది. పది బాక్సులు అడిగితే కేవలం ఐదు బాక్సులు, అది కూడా నిత్యం వచ్చే వారికే ఇస్తున్నారు.


బ్రాండెడ్‌ గోధుమపిండి ఐదారు దుకాణాలకు వెళితే తప్ప లభ్యం కావడంలేదు. అది కూడా కిలోకు రూ.10 పెంచేశారు. ఉప్మా రవ్వపై కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు పెంచినా అన్ని దుకాణాల్లో దొరకడం లేదు. బియ్యానికి కొరత లేకపోయినా 25 కిలోల బస్తాపై రూ.50 పెంచారు. విజయవాడ నుంచి సరుకు రవాణాకు ఇబ్బందులు లేవని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నగరానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారికి చెందిన సరుకు లారీ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో చిక్కుకుపోయింది. విజయవాడ, రాజమండ్రి, విజయనగరం నుంచి సరుకు రవాణాకు ఆంక్షలు ఎత్తివేస్తే నగరానికి ఇబ్బంది రాదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. 


ఉల్లి రూ.30

ఉల్లిపాయల ధర మూడు రోజుల్లో రోజుకు రూ.2 చొప్పున పెరిగి కిలో రూ.30కి చేరింది. జనతా కర్ఫ్యూ అంటే గత ఆదివారం కిలో ఉల్లి ధర రైతుబజార్‌లో రూ.24. ఇప్పుడు అదే ఉల్లి ధర రూ.30. అదే ఉల్లి బయట మార్కెట్‌లో కిలో రూ.35. విశాఖపట్నానికి అవసరమైన ఉల్లి, బంగాళాదుంపలు, క్యారెట్‌, మిర్చి, బీట్‌రూట్‌, క్యాబేజీ, బరబాటి, బీన్స్‌, చిక్కుళ్లు, దొండ వంటి కూరగాయలను జ్ఞానాపురం హోల్‌సేల్‌ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తారు. వారి దగ్గర  రైతులు కొనుగోలు చేసి రైతుబజార్లలో అమ్ముతారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.


దాంతో నగరంలో టోకువర్తకులు వారి దగ్గర వున్న నిల్వలనే విక్రయించాల్సి వస్తోంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వారు రోజూ ధరలు పెంచుకుంటూ వెళుతున్నారు. గత మూడు రోజుల్లో ఉల్లి రూ.2 చొప్పున పెరిగింది. పోనీ ఆ ధరకు(కిలో రూ.30) సరకు దొరుకుతున్నదా? అంటే అదీ లేదు. ఉల్లి నిల్వలు అయిపోయాయి. దాంతో రైతుబజార్లలో శనివారం ఉదయం 9 గంటల తరువాత ఉల్లిపాయలు లభించలేదు. 


మారు వ్యాపారులకే సరకు

ఇక రైతుబజార్లలో కిలో టమాటా రూ.16 కాగా ప్రైవేటు వ్యాపారులు రెండు కిలోలు రూ.50 అని అమ్ముకున్నారు. అలాగే ఉల్లిపాయలు కిలో రూ.35 చొప్పున విక్రయించారు. ఇదిలావుంటే జ్ఞానాపురం మార్కెట్‌లో నిత్యం సరకులు కొనేది రైతుబజార్లకు చెందినవారే. ఇప్పుడు లాక్‌డౌన్‌ సమయంలో నిత్యవసర సరకులకు డిమాండ్‌ ఉండడంతో ప్రైవేటు వ్యాపారులు భారీగా వచ్చి సరకు తీసుకుపోయారు. దాంతో రైతులు, డ్వాక్రా గ్రూపులకు సరకు లభించలేదు. దాంతో రైతుబజార్లలో శనివారం సరకులు కూడా తగ్గిపోయాయి.


ఆదివారం జ్ఞానాపురం మార్కెట్‌కు సెలవు. మళ్లీ సోమవారమే తెరుచుకుంటుంది. ప్రస్తుతం ఉల్లి నిల్వలు పెద్దగా లేవు. ఆదివారం రైతుబజార్లలో ఉల్లి లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో బయట రేటు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని లారీలతో సరకు తెప్పిస్తే తప్ప ఉల్లి ధర నియంత్రణలోకి రాదు. బెండకాయలు రూ.24 నుంచి ఇప్పుడు రూ.32కి చేరింది. బీరకాయల ధర కిలో రూ.34 నుంచి రూ.42కి చేరింది. మూడు రోజుల్లోనే ఈ మార్పు. 


పండ్లకు గిరాకీ

నగరానికి అవసరమైన అన్నిరకాల పండ్లు పూర్ణామార్కెట్‌ హోల్‌సేల్‌ వ్యాపారులు సరఫరా చేస్తారు. మొన్నటివరకు కిలో కమలా రూ.40 నుంచి రూ.50 చొప్పున రోడ్డు పక్కన ఆటోల్లో అమ్మేవారు. రైతుబజార్ల దగ్గర కూడా అదే ధర. వాటి రేటు శనివారం ఒక్కసారిగా పెరిగిపోయింది. మార్కెట్‌కు సరకు తగ్గిపోవడంతో వ్యాపారులు రేటు పెంచేశారు. వంద రూపాయలకు ఆరు కమలాలు చొప్పున అమ్మారు. అరటి పండ్ల ధరలు కూడా పెరిగిపోయాయి. డజను రూ.50కి ఇచ్చేవారు. ఇపుడు రూ.60 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. బొప్పాయి కిలో రైతుబజారులో రూ.24 ఉండేది. ఇపుడు రైతుబజార్లలో అమ్మడం లేదు.


బయట మార్కెట్‌లో కిలో రూ.40 చొప్పున అమ్ముతున్నారు. ఈ ధరలకు వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. జామకాయలు కిలో రూ.40 చొప్పున రైతుబజార్లలో అమ్మేవారు. డీఎల్‌బీ మైదానం బయట కొందరు వ్యాపారలు కిలోన్నర జామకాయలు రూ.100 చొప్పున అమ్ముతున్నారు. మరికొందరు హెచ్‌బీ కాలనీకి ఆటోలలో తెచ్చి కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. 

Updated Date - 2020-03-29T10:13:32+05:30 IST