రైతుబజార్లు వెలవెల

ABN , First Publish Date - 2021-05-05T05:14:20+05:30 IST

రైతుబజార్లపై కరోనా ప్రభావం పడింది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో జనం రైతుబజార్‌లకు రావడం తగ్గించేశారు.

రైతుబజార్లు వెలవెల
రైతులులేక ఖాళీగా ఉన్న ఎంవీపీ కాలనీ రైతుబజారు దృశ్యం

తగ్గిన వినియోగదారులు, రైతులు

నేటి నుంచి ఉదయం 6 నుంచి 12 గంటల వరకే విక్రయాలు

నగరవ్యాప్తంగా 33 మినీ రైతుబజార్లు

మాస్కు లేకుంటే ప్రవేశం లేదు

కొవిడ్‌ నిబంధనలను పాటించాలి


విశాఖపట్నం/ఎంవీపీ కాలనీ, మే 4: రైతుబజార్లపై కరోనా ప్రభావం పడింది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో జనం రైతుబజార్‌లకు రావడం తగ్గించేశారు. అలాగే కూరగాయలు విక్రయించే రైతులు కూడా పెద్దగా రావడం లేదు. ఇటు వినియోగదారులు, అటు రైతులు లేక బజార్లు వెలవెలబోతున్నాయి. ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో గత పది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మంగళవారం ఉదయం రైతుబజార్‌కు 120 మంది రైతులు రావాల్సి ఉండగా, కేవలం 35 మంది మాత్రమే వచ్చారు. సాయంత్రం 40 మందికిగాను 10 మంది మాత్రమే రావడం గమనార్హం. సోమవారం ఉదయం 74 మంది, సాయంత్రం 15 మంది రైతులు మాత్రమే వచ్చారు. డ్వాక్రా దుకాణాలను కూడా సరిగా తెరవడం లేదు.

నేడు తెరుచుకోనున్న బజారు

ఎంవీపీ  రైతుబజార్‌కు ప్రతి బుధవారం గతంలో సెలవు ప్రకటించారు. కరోనా ప్రభావంతో తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో వారాంతపు సెలవును రద్దు చేసి బుధవారం కూడా రైతుబజార్‌ను తెరుస్తున్నామని ఎస్టేట్‌ ఆఫీసర్‌ జగదీశ్వరరావు తెలిపారు. అయితే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బజార్‌ తెరుస్తామన్నారు. 


నేటి నుంచి 33 మినీ రైతుబజార్లు

మాస్కు లేకుంటే ప్రవేశం లేదు

కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో నగరంలోని 13 రైతుబజార్లకు అనుబంధంగా అన్ని ప్రాంతాల్లో 33 మినీ రైతుబజార్లు ఏర్పాటు చేయనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇవన్నీ బుధవారం నుంచే అందుబాటులోకి వస్తాయన్నారు. వీటికి అవసరమైన టెంట్లు, తాగునీరు వంటి సదుపాయాలు జీవీఎంసీ కల్పిస్తుందన్నారు. ఆ బజార్లకు వెళ్లేవారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని, లేదంటే ప్రవేశఽం ఉండదన్నారు. రైతులు కూడా మాస్కులు ధరించి, తరచూ చేతులు శానిటైజ్‌ చేసుకొని కూరగాయాలు విక్రయించాలని సూచించారు. అన్నీ రైతుబజార్ల ధరలే ఉంటాయన్నారు. 


ఎక్కడెక్కడంటే..?

అబ్దుల్‌ కలామ్‌ పార్కు, బుల్లయ్య కాలేజీ, వీఎస్‌ కృష్ణా కాలేజీ, ఏఎస్‌ రాజా గ్రౌండ్స్‌, ఆరిలోవ దుర్గా ఆలయం, విశాలాక్షి నగర్‌, ఆరిలోవ లాస్ట్‌ బస్టాప్‌, తోటగురువు జెడ్పీ స్కూల్‌, డీఎల్‌బీ స్కూల్‌ మైదానం, ఎన్‌జీవో కాలనీ ప్రాథమిక పాఠశాల, ఏయూ మైదానం, కోటక్‌ ప్రీ ప్రైమరీ స్కూల్‌, రామ్‌నగర్‌ విశాఖ సేవ సదన్‌ స్కూల్‌, గోపాలపట్నం జెడ్పీ స్కూల్‌, స్టెల్లా మేరీస్‌ స్కూల్‌, మురళీ నగర్‌ జెడ్పీ స్కూల్‌, జ్యోతినగర్‌ జెడ్పీ హైస్కూల్‌, ఆదర్శ స్కూల్‌ మైదానం, నరవ హైస్కూల్‌, నాతయ్యపాలెం జెడ్పీ హైస్కూల్‌, గంగవరం, శివశివానీ స్కూల్‌, లిటిల్‌ ఏంజిల్‌ స్కూల్‌, తిక్కవానిపాలెం, వాడపేట, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, పెందుర్తి జెడ్పీ హైస్కూల్‌, ఎన్‌ఆర్‌ఐ కాలేజీ, చినముషిడివాడ, వేపగుంట జెడ్పీ హైస్కూల్‌, సాయిబాబా దేవాలయం, శంకర్‌ ఫౌండేషన్‌ దరి ఆర్‌జీకే కల్యాణ మండపం, సాంకేతిక ఇంజనీరింగ్‌ కళాశాల

Updated Date - 2021-05-05T05:14:20+05:30 IST