అలంకారప్రాయం

ABN , First Publish Date - 2021-01-24T05:30:00+05:30 IST

రైతులను సంఘటితం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

అలంకారప్రాయం

  • నిరుపయోగంగా రైతువేదికలు 
  • నిర్మించారు.. నిర్వహణ మరిచారు
  • మరికొన్నిచోట్ల నిర్మాణాల్లో జాప్యం
  • రైతుల అవసరాలకు అందుబాటులోకి వచ్చేదెప్పుడో ?


రైతులను సంఘటితం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కానీ అవి అలంకారప్రాయంగా మారాయి. కొన్నిప్రాంతాల్లో రైతువేదికలు ప్రారంభమైనా ఇప్పటివరకు రైతులకు అందుబాటులోకి తీసుకురాలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినప్పటికీ వీటి నిర్వహణ విధి విధానాల గురించి ప్రభుత్వం వెల్లడించలేదు. ఇప్పటికైనా రైతువేదికలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌)

వ్యవసాయంలో ఆధునిక పోకడలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రైతు వేదికలు నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తయినా రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. గత ఏడాది దసరా నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా అదికాస్త నిర్లక్ష్యంగా మారింది. నవంబరు నుంచే రైతులు రబీకి సన్నద్ధమయ్యారు. గోధుమలు, సజ్జలు, చిరుధాన్యాలు, శనగలు, ఉలవలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పశుగ్రాసంతోపాటు ఇతర పంటలు సాగు చేశారు. ఇప్పటికే వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రైతులు పంట చేనుల్లో కలుపు తీస్తున్నారు. సగం పంట దశకు వచ్చేసింది. సాగుకు ముందుగానే రైతువేదికల ద్వారా రైతులను సంఘటిత పరచి వివిధ పంటల సాగుపై అవగాహన, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉన్నప్పటికి అలా జరగలేదు. రైతు వేదికలు నిర్మించినా ఫలితం లేకుండాపోయింది.


ఏటేటా తప్పని నష్టం

వ్యవసాయంలో రైతులకు సరైన అవగాహన లేక ప్రతిఏటా నష్టాలను చవిచూస్తున్నారు. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల ఊబిలోకి నెట్టుకుపోతున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి పంట సాగు చేసినా చివరకు మద్దతు ధర లభించడం లేదు. ఇలా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అన్నిరకాలుగా అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన రైతువేదికలు ఉన్నా లేనట్టుగానే మారాయి. 


సమస్యల నివృత్తిలో విఫలం

వ్యవసాయ రంగంలో ఏ సీజన్‌లో ఎలాంటి పంటలు వేయాలి.. లాభదాయక దిగుబడి పొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సబ్సిడీలు.. ఇతర రాష్ర్టాలు, దేశాల్లో అమలు జరుగుతున్న విధానాలను వివరించేందుకు ఈ వేదికలు ఉపయోగపడతాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అనుసరించేందుకు అవసరయ్యే పరిజ్ఞానం అందించాల్సి ఉంటుంది. ఇవేమీ రైతులు తెలుసుకోలేకపోతున్నారు.


ప్రారంభించినా ప్రయోజనం శూన్యం

ఇప్పటికే ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో 47రైతువేదికలు ప్రారంభించారు. కానీ.. వాటి ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. రంగారెడ్డిజిల్లాలో ఇప్పటివరకు మహేశ్వరంలో 3, ఇబ్రహీంపట్నం 2, శంకర్‌పల్లిలో 2 చొప్పున రైతువేదికలను ప్రారంభించారు. హయత్‌నగర్‌, మాడ్గుల, నందిగామ క్లస్టర్‌లో ఒకటి చొప్పున ప్రారంభించారు. 83 రైతువేదికలకుగాను 10 వేదికలను ప్రారంభించగా ఇంకా 73 రైతువేదికలు సిద్ధమయ్యాయి. ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయి? రైతులకు అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 

మేడ్చల్‌ జిల్లాలో 9 వేదికలకుగాను అన్ని నిర్మాణాలు కంప్లీటయ్యాయి. ఇప్పటివరకు 7వేదికలను ప్రారంభించారు. మిగతా 2 వేదికలు ప్రారంభించాల్సి ఉంది. వికారాబాద్‌ జిల్లాలో 97 రైతువేదికలు మంజూరయ్యాయి. అందులో 92నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా ఐదు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటివరకు 30 వరకు రైతు వేదికలను ప్రారంభించారు. ఇంకా 62వేదికలు ప్రారంభించాల్సి ఉంది. 


ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షలు

రైతువేదికల నిర్మాణాలకు క్లష్టర్ల వారీగా అవసరమైన నిధులను ఉపాధిహామీ పథకం కింద విడుదలయ్యాయి. ఒక్కో రైతు వేదిక నిర్మాణం 20 గుంటల్లో నిర్మించేందుకు రూ.22 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. ఈ లెక్కన రంగారెడ్డి జిల్లాలో 83 రైతువేదికల నిర్మాణాలకు రూ.18.26 కోట్లు ఖర్చు పెడుతోంది. వికారాబాద్‌ జిల్లాలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో కొన్ని క్లస్టర్లలో నిర్మాణాలు వేగం మందగించింది. 2020 అక్టోబరు 15వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొన్నిచోట్ల పనులు నత్తనడకన సాగటంతో నిర్మాణాల్లో తీవ్రం జాప్యం నెలకొంది. 


ఉమ్మడి జిల్లాలో 184 రైతు వేదికలు పూర్తి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 189 రైతు వేదికలు మంజూరయ్యాయి. అందులో 184 వేదికలు పూర్తి కాగా, ఇప్పటివరకు 47 వేదికలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఇంకా 137 రైతువేదికలు ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 83 క్లస్టర్లలో ఈ రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణాలు పూర్తయ్యాయి. పైనల్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.


ఖరారు కాని విధి విధానాలు

మోమిన్‌పేట : ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన రైతువేదికపై మండల, గ్రామ రైతు సమన్వయ సమితి కమిటీలకు ఎలాంటి అధికారాలు, విధులు ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ కమిటీలను కీలకం చేస్తానని సీఎం కే సీఆర్‌ ప్రకటించినా ఇంకా కార్యరూపం దాల్చడంలేదు. రైతువేదికలో రైతులకు అవసరమైన టీవీలు, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ అవసరం ఉంటుంది. నిర్మాణాలు పూర్తయినా వీటికి సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయలేదు. క్లస్టర్ల పరిధిలోని రైతు సమన్వయ సమితిలు ఏఈవోలు, సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి గ్రామంలోని దాతల సహకారంతో ఫర్నిచర్‌ తదితర వస్తువులు సమకూర్చుకోవాలని తెలిపారు. 


ఆధునిక సాగుపై అవగాహన కల్పిస్తాం

ఆధునిక సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. జిల్లాలో అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 10 వేదికలను ప్రజాప్రతినిధులు ప్రారంభిం చడం జరిగింది. మిగతావి ప్రారంభించాక రైతు వేదికలను రైతుల అందుబాటులోకి తీసుకువస్తాం. ఇంకా ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్‌ రావాల్సి ఉంది. 

- ఎస్‌.గీతారెడ్డి, రంగారెడ్డిజిల్లా వ్యవసాయాధికారి


సాగులో మెలకువలు తెలియవు

తెలంగాణ సర్కార్‌ లక్షలు ఖర్చుపెట్టి రైతు వేదికలు నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయింది. యాసంగి సాగు చేశాము. ఏ పంట వేయాలి... ఎలాంటి విత్తనాలు, పురుగుల మందులు వాడాలో తెలియదు. రబీ సాగులో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించలేక పోయారు. సాగులో మెళకువలు తెలియడం లేదు.

- తలారి నరేందర్‌రెడ్డి, రైతు, కేరెల్లి 


అవగాహన కల్పించలేదు

రైతు వేదికలు నిర్మించారు. ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. రైతు వేదికల ద్వారా మాకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. ఇంకా కొన్ని క్లస్టర్లలో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు పంటించుకోవడం లేదు. రబీ సాగులో ఆధునికత కరువైంది. 

- కొత్తపల్లి దయాకర్‌రెడ్డి, రైతు


ఉమ్మడిజిల్లాలోని రైతు వేదికల వివరాలు

        రంగారెడ్డి వికారాబాద్‌ మేడ్చల్‌ మొత్తం

మంజూరైన రైతు వేదికలు 83         97         09         189

నిర్మాణం పూర్తయినవి 83         92         09         184

ప్రారంభించినవి 10         30         07         47

ఇంకా ప్రారంభించాల్సినవి 73         62         02         137

Updated Date - 2021-01-24T05:30:00+05:30 IST