మళ్లీ పెంచేశారు

ABN , First Publish Date - 2022-04-08T06:04:36+05:30 IST

ఇప్పటికే విత్తనాలు, ఎరువుల ధరలు భారీగా పెంచేశారు. అది చాలదన్నట్లు తాజాగా క్రిమి సంహారక మందుల ధరలూ పెంచేశారు.

మళ్లీ పెంచేశారు

  1. పిచికారీ మందుల ధరలు 8 నుంచి 10 శాతం పెంపు 
  2. జిల్లా రైతులపై రూ.100 కోట్ల భారం 

    ఇప్పటికే విత్తనాలు, ఎరువుల ధరలు భారీగా పెంచేశారు. అది చాలదన్నట్లు తాజాగా క్రిమి సంహారక మందుల ధరలూ పెంచేశారు. తెగుళ్లు, పురుగల నివారణకు వీటిని వాడతారు. ఇప్పుడు వీటి ధర 8 నుంచి 10 శాతం పెంచారు. ఇలా పదే పదే ధరలు పెంచితే ఎలా వ్యవసాయం చేయాలని రైతులు అంటున్నారు. ఈ పెరుగుదల వల్ల జిల్లా రైతులపై అదనంగా దాదాపు రూ.100 కోట్ల భారం పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. 

కర్నూలు(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 7: పైర్లను ఆశించే పురుగులు, తెగుళ్లను నివారించే మందుల ధరలు, కలుపు మందుల ధరలు నాలుగు నెలల క్రితం 5-10 పెంచారు. ఇప్పుడు 8 నుంచి 11 శాతం వరకు పెంచారు. ఆ మేరకు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం కలిపి సగటున 15 నుంచి 20 శాతం వరకు క్రిమి సంహారక మందుల ధరలు పెరిగాయి. దీంతో వ్యవసాయంలో రైతుల పెట్టుబడి ఖర్చు మరింత పెరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులు దాదాపు 200 టన్నుల పైగా రసాయ మందులు వాడతారు. ఇంత మొత్తం మీద ధరల పెరుగుదల ప్రకారం జిల్లా రైతులు అదనంగా మరో రూ.100 కోట్ల దాకా భరించాలి. 


ఏ మందయినా రూ.500 పైమాటే..

ఉమ్మడి జిల్లాలో దాదాపు ఆరు లక్షల మంది రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్లలో సాగు చేసే కూరగాయలు, వాణిజ్య, ఆహార పంటలపై ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీగా తెగుళ్లు, పురుగులు దాడి చేస్తున్నాయి. వీటి నివారణకు రైతులు ఎక్కువగా వాడే రసాయన మందుల ధరలు తాజాగా భారీగా పెరిగాయి. ఏడాదిన్నర కిందట కిలో రూ.400 నుంచి 500 వరకు మధ్య ఉండే ఓ పురుగు మందు ఇప్పుడు రూ.600 నుంచి 700కు పెరిగింది. మరో మందు 11-12 శాతం పెరిగింది. ఇంకో మందు లీటరుకు రూ.50 పెంచేశారు. ఏమందు కొనాలన్నా లీటరు రూ.500లోపు దొరకడం లేదు. త్వరలో ఖరీఫ్‌ మొదలవుతుంది. జూన్‌ నెల నుంచే ఈ క్రిమి సంహారక మందులపై కంపెనీలు పెంచిన ధరలను రైతులు భరించాల్సి వస్తుంది. దీన్ని తలుచుకొని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 


పెరుగుతున్న పెట్టుబడులు

మిరప రైతులు పురుగు, తెగుళ్ల నివాణకు ఎక్కువగా మందులు వాడుతుంటారు. పత్తిలో గులాబి రంగు పురుగు, వరిలో కాండం తొలిచే పురుగు, అగ్గితెగులు ఈ మధ్య ఎక్కువయ్యాయి. గత ఖరీఫ్‌, రబీ సీజన్లలో తామర పురుగు వ్యాపించి మిర్చి పంట భారీగా దెబ్బతినింది. ఈ పురుగు నివారణకు డీలర్లు, వ్యవసాయాధికారులు చెప్పిన మందులను రైతులు భారీగా పిచికారి చేస్తున్నారు. పెట్టుబడి పెరుగుతున్నా మందులు వాడక తప్పడం లేదు. అయితే ఈ క్రిమిసంహారక మందుల ప్రభావం రానురానూ పెద్దగా ప్రభావం చూపడం లేదు. గులాబి రంగు పురుగు ఉధృతితో గత ఖరీఫ్‌లో పత్తి పంట 60 శాతంపైగా దిగుబడి తగ్గిపోయింది. రబీలో వరిని కాపాడుకోడానికి పలు దఫాలుగా పిచికారి చేయాల్సి వస్తోంది. కంది, శనగ, కూరగాయలు, పండ్ల తోటల్లోనూ రసాయనిక మందుల్ని ఎక్కువగా వాడుతున్నారు. ఏయేటి కాయేడు రసాయన మందుల వినియోగం ఎక్కువైపోతోంది. ప్రభుత్వం ఇలా వాటి ధరలు మీద మీద పెంచుతూపోతే వ్యవసాయం ఎలా చేయాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. 


రైతులు పురుగు మందులను తగ్గించాలి: శాలురెడ్డి, ఏడీఏ, కర్నూలు

రైతులు ఈ మధ్య పురుగు మందుల వాడకం పెంచారు. దీని వల్ల భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ పురుగు మందులను ఎక్కువగా వాడవద్దని, సేంద్రియ ఎరువులు వాడమని, ప్రకృతి వ్యవసాయాన్ని పాటించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డీలర్లు, దళారులు చెప్పారని తెగుళ్లు, పురుగుల నివారణకు ఏ మందులు పడితే ఆ మందులు వాడరాదు. వ్యవసాయాధికారుల సలహా ప్రకారం తగిన మోతాదులో వాడితే మేలు జరుగుతుంది. 

Updated Date - 2022-04-08T06:04:36+05:30 IST