చిన్నారులకు ‘ఇంద్రధనుష్‌’

ABN , First Publish Date - 2022-05-02T04:43:07+05:30 IST

టీకాలు.. వ్యాధి నిరోధకాలు. ముక్కు పచ్చలారని చిన్నారుల

చిన్నారులకు ‘ఇంద్రధనుష్‌’

  • 0-2 సంవత్సరాల పిల్లలు, గర్భిణులకు టీకాలు 
  • నేటి నుంచి 9వ తేది వరకు కార్యక్రమం
  • జిల్లాలో 2,836 పిల్లలు, 1,015 గర్భిణులకు వేయాలని లక్ష్యం


టీకాలు.. వ్యాధి నిరోధకాలు. ముక్కు పచ్చలారని చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి భవిష్యత్‌కు భరోసా నిచ్చేందుకు ప్రభుత్వం ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ (ప్రత్యేక జాతీయ వ్యాధి నిరోధక టీకాలు) కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. తద్వారా బాల్యంలో వచ్చే ఏడు రకాల వ్యాధులు రాకుండా 0-2 సంవత్సరాల్లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ఈనెల 9వ తేది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


రంగారెడ్డి అర్బన్‌, మే 1 :  జిల్లాలో 482 టీంల ద్వారా 2,836 మంది పిల్లలు, 1,015 పిల్లలకు టీకాలు వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అప్పుడే పుట్టిన పసిపాప మొదలుకుని రెండేళ్లలోపు పిల్లలకు 7 రకాల వ్యాక్సినేషన్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవల కాలంలో పిల్లలకు టీకాలు వేయించడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. పుట్టిన తర్వాత ఒకటి, రెండు టీకాలు వేయించుకుని మధ్యలో మానేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా పిల్లలకు 50 శాతానికి పైగా టీకాలు వేయించలేదని అధికారుల అంచనా. మధ్యలో వేయించని పిల్లలే లక్ష్యంగా చేసుకుని ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ కార్యక్రమాన్ని తీసుకుంది. దీనిని జిల్లాలో నేటి నుంచి ప్రారంభించనున్నారు. 


ఏడు రకాల వ్యాధుల నుంచి రక్షణ

మిషన్‌ ఇంద్రధనుష్‌ ద్వారా క్షయ, పోలియో, కంఠ థెరపీ, కోరింతదగ్గు, ధనుర్వాతం, జాండీస్‌, న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా గ్రామాల్లో టీకాలు వేయనున్నారు. రెండు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ మిషన్‌ ఇంద్రధనుష్‌ వ్యాక్సినేషన్‌తో ఏడు రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందనున్నారు. 


వలస కుటుంబాలే లక్ష్యంగా..

ముఖ్యంగా నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, ఇటుక బట్టీలు, క్యారీలు ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్న వలస కుటుంబాల పిల్లలే అధికంగా ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో గ్రామాల్లో, తండాల్లో ఉండే ప్రజలతోపాటు వలస కూలీల పిల్లలే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నారు. 


మిషన్‌ ఇంద్రధనుష్‌ విజయవంతం చేయాలి

జిల్లాలో ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. చిన్నారులకు, గర్భిణులకు పూర్తి వ్యాధి నిరోధక టీకాలు అందజేయడంలో ప్రతిఒక్కరూ సహకరించాలి. జిల్లాలో రెండేళ్లలోపు పిల్లలు, గర్భిణులు ఇప్పటివరకు టీకాలు తీసుకోకుండా ఉన్నటువంటివారు, అసంపూర్తిగా టీకాలు తీసుకున్న చిన్నారులు, గర్భిణులను ఆశ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి గుర్తించారు. వారందరికీ టీకాలు వేయనున్నాము. ప్రధానంగా వలస వచ్చిన, మురికి వాడల్లో నివసించే ప్రజలు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుకబట్టీల్లో పనిచేసే చోట పిల్లలకు, గర్భిణులకు టీకాలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. 

- డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యాధికారి


మిషన్‌ ఇంద్రధనుష్‌లో పిల్లలు, గర్భిణులకు ఇచ్చే వ్యాక్సినేషన్‌ వివరాలు

తేది రౌండ్‌ లక్ష్యం ఇచ్చిన టీకాలు

2022 మార్చి-7 ఫస్ట్‌ 14,685 16,713

2022 ఏప్రిల్‌ 4-7 వరకు సెకండ్‌ 4,579 4,437

2022 మే-2-9 వరకు థర్డ్‌ 3,851 - - 

Updated Date - 2022-05-02T04:43:07+05:30 IST