వదలని వాన

ABN , First Publish Date - 2022-08-09T04:23:13+05:30 IST

వాన వదలడం లేదు. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కుండపోతగా వర్షపాతం నమోదవుతోంది.

వదలని వాన
అలుగుపోస్తున్న బేతుపల్లి చెరువు

ఖమ్మం, సత్తుపల్లి, వైరా పరిధిలో కుండపోత

చెరువులకు అలుగులు

వరి, పత్తి చేలు నీటమునక

పలు చోట్ల రాకపోకలకు అంతరాయం

సత్తుపల్లి/ వైరా/ ఏన్కూరు/ పెనుబల్లి/ కొణిజర్ల/ తల్లాడ/ ఖమ్మం కార్పొరేషన్‌, ఆగస్టు 8: వాన వదలడం లేదు. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కుండపోతగా వర్షపాతం నమోదవుతోంది. ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఆదివారం రాత్రి వాన దంచి కొట్టింది. సోమవారం తెల్లవారు జాము దాకా వర్షం కురుస్తూనే ఉంది. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో 48.4 ఎంఎం, పెనుబల్లిలో 49.2 ఎంఎం, సత్తుపల్లిలో 79.8ఎంఎం, వేంసూరు మండలంలో 64.8, తల్లాడ మండలంలో 43.4 ఎంఎం వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు ఎగవ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి చెరువుకు భారీ స్థాయిలో నీరు చేరుతోంది. దీంతో బేతుపల్లి పెద్ద చెరువు సామర్థ్యం 16 అడుగులు కాగా 18 అడుగుల నీరు చేరటంతో అలుగుపై రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. అలుగు ద్వారా 12,213 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి పారుతోంది. మిగులు నీరు ప్రత్యామ్నాయ కాలువ ద్వారా తమ్మిలేరులోకి చేరుతోంది. పెనుబల్లి మండలంలో లంకాసాగర్‌ 16 అడుగుల సామర్థ్యం కాగా 17అడుగుల మేర నీరు చేరి అలుగు పారుతోంది. భారీ వర్షం కారణంగా సింగరేణి ఓపెన్‌ కాస్టు బొగ్గుగనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వైరాకు భారీగా వరదనీరు

వైరా రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. దాంతో నీటిమట్టం 20అడుగులకు చేరింది. మరోరెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్‌కు వరదనీరు మరింత పెరిగితే నది లోతట్టులోని ముసలిమడుగు, స్నానాల లక్ష్మీపురం సహా వైరా 2,3వార్డుల ప్రాంతంలోని ఇళ్లు నీటమునిగే ప్రమాదముంది. గరికపాడు, దాచాపురం పంటపొలాలకు కూడా నష్టం వాటిల్లనుంది. సోమవరం నల్లచెరువు కూడా భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో అలుగుల నుంచి నీటిపరవళ్లు తొక్కుతున్నాయి. నల్లచెరువు వాగు పక్కనున్న వరిపైర్లన్నీ రెండురోజులుగా నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి.

వాగులకు పోటెత్తిన వరద

తల్లాడ మండలంలోని వాగుల్లో వరద ఉధృతి పెరిగింది. సోమవారం తల్లాడ మండలంలో 43.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ఉధృతికి బిల్లుపాడు-రామచంద్రాపురం, బిల్లుపాడు-కొత్తవెంకటగిరి మధ్యనున్న మాచవరం వాగు, గొల్లగూడెం-మంగాపురం మధ్యనున్న జూబంధం వాగు, పినపాక-వెంకటాపురం మధ్యనున్న కట్టలేరు వాగులు ఉధృతం గా ప్రవహిస్తున్నాయి. వాగుల సమీపంలో ఉన్న వరి, పత్తి పైర్లు నీటమునిగాయి.

వదలని వర్షం

కొణిజర్ల మండలం తనికెళ్ల దగ్గర గల సవిట్రేగు, తుమ్మలపల్లి వద్ద వాగు, మల్లుపల్లి-కొణిజర్ల మధ్యనున్న వాగు, తీగల బంజర దగ్గర పగిడేరు, అంజనాపురం వద్ద పెద్దఏరు ఉధృతంగా పవహిస్తున్నాయి. పల్లిపాడులో వాననీరు ఇళ్ల మధ్య నిలిచింది. పల్లిపాడు వైరా మునిసిపాలిటీ పరిధిలో ఉంది. అయినప్పటికీ సంబంధింత అధికారులు పట్టించుకో వడం లేదు. తుమ్మలపల్లి, మల్లుపల్లి వద్ద వరినారు కొట్టుకపోయింది. కొన్ని చోట్ల పత్తి చేలల్లో వాననీరు చేరింది.

పెనుబల్లి మండలంలోని కోండ్రుపాడు, వేంసూరు మండలం అడసర్లపాడు మధ్యనున్న కట్టలేరు వాగు పొంగడంతో రెండు మండలాల మధ్య ప్రజల రాకపోకలు నిలిచాయి. పెనుబల్లి-గంగదేవిపాడు మధ్య కూడా రాథోని అలుగు వాగు పొంగి రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. మధ్యతరహా ప్రాజెక్టు అయిన లంకాసాగర్‌ అడుగు కుపైగా నీరు పారుతుండటంతో ప్రాజెక్టును తిలకించేందుకు యువత తండోపతండాలుగా చేరుకున్నారు. బయ్యన్న గూడెం, కుప్పెనకుంట్ల, కోండ్రుపాడు, మర్లకుంటలో వాగులు పొంగడంతో పంటపొలాలు నీటమునిగాయి.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఏన్కూరు మండలంలో జన్నారం ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏన్కూరు నుంచి పల్లిపాడు రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూతక్కలింగన్నపేట చెరువుకు అలుగు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు పలు చోట్ల వరి, పత్తి చేలు నీటమునిగాయి.

లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు

ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షానికి ఖమ్మం నగరంలోని 41వ డివిజన్‌ పరిధిలోని చెరువుబజార్‌లో 12 ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి. ఈ డివిజన్‌లో ప్రధాన డ్రైయినేజీ ఉండటంతో 12 డివిజన్ల నుండి వచ్చే మురుగునీరు దీని మీదుగానే ప్రవహిస్తుంది భారీవర్షం కురవటంతో డ్రైయినేజీ కాలువ పొంగి, వరదనీరు ఇళ్లల్లోకి ప్రవేశించింది. ఇళ్లలోని వస్తువులు, మంచాలు మునిగిపోయాయి. దీంతో వారంతా బంధువుల ఇంటికి వెళ్లారు. సమాచా రం తెలుసుకున్న కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణ సోమవారం డ్రైయినేజీ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను పారిశుధ్య సిబ్బంది ద్వారా తొలగించారు.

కొత్తగూడెం వెళ్లే రహదారి చప్టాపై వరదనీరు

నగరంలోని సంభానినగర్‌ నుంచి కొత్తగూడెం వెళ్లే రహదారిలో గంగమ్మ గుడి వద్ద చప్టాపై వరదనీరు ప్రవహించటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని జిల్లాకోర్టు, చెరువుబజార్‌ ప్రాంతాలనుండి వచ్చే మురుగునీరు కాలువద్వారా చెప్టా మీదకు చేరుతుంది. డ్రైయినేజీలు పొంగినప్పుడు వచ్చిన మురుగు, వర్షపు వరదనీరు చెప్టాపై ప్రవహించి, రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

కొత్తగూడెం చెరువునీరు కలుషితం: సీపీఐ

గంగమ్మ గుడివద్ద చెప్టాపై ప్రవహిస్తున్న మురుగునీరు కొత్తగూడెం చెరువులో వెళుతుందని, దీనివల్ల చెరువునీరు కలుషితం అవుతున్నదని సీపీఐ నగర సహాయ కార్యదర్శి పగడాల మల్లేష్‌ పేర్కొన్నారు. సోమవారం 19వ డివిజన్‌ కా ర్పొరేటర్‌ చేమకూరి వెంకటనారాయణ, 14,15 డివిజన్ల సీపీఐ కార్యదర్శులు రావుల హన్మంతరావు, జొన్నలగడ్డ వేంకటేశ్వర్లు, ప్రతానపు రామనాధం, మడుగుల నాగేశ్వరరావు, శీలం నాగేశ్వరరావుతో కలిసి వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించారు. 


Updated Date - 2022-08-09T04:23:13+05:30 IST