వెన్నులో ‘వాన’కు పుట్టించింది

ABN , First Publish Date - 2022-08-08T05:12:03+05:30 IST

వాన దంచికొట్టింది. అది కూడా గంటల పాటు.. దీంతో వాగులు పొంగాయి, వంకలు ప్రవహించాయి.

వెన్నులో ‘వాన’కు పుట్టించింది
గొల్లగూడెం-మంగాపురం మధ్య ప్రవహిస్తున్న జూబంధం వాగు

సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో దంచికొట్టిన వాన

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు

గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

నీటమునిగిన పత్తి, వరి చేలు

తల్లాడ/ వైరా/ కొణిజర్ల/ మధిర రూరల్‌/ పెనుబల్లి, ఆగస్టు 7: వాన దంచికొట్టింది. అది కూడా గంటల పాటు.. దీంతో వాగులు పొంగాయి, వంకలు ప్రవహించాయి. చెరువులు మత్తళ్లు దుంకాయి. పత్తి చేలు, వరి పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వాగుల ఉధృత ప్రవాహానికి రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ముఖ్యంగా సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల పరిధిలో విస్తారంగా వర్షం కురవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది.

తల్లాడ మండలంలో 81.2మిల్లీమీటర్ల వర్షపాతం

తల్లాడ మండలంలో శనివారం రాత్రి 81.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాచవరం, జూబంధం వాగులు ఉధృతంగా ప్రవహించటంతో బిల్లుపాడు నుంచి కొత్తవెంకటగిరి, బిల్లుపాడు నుంచి రామచంద్రాపురం, గొల్లగూడెం నుం చి మంగాపురం మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారుల్లో రాకపోకలు నిల్చిపోయాయి. బిల్లుపాడు, మంగాపురం, కలకొడిమ తదితర గ్రామాల్లో వరిపైర్లు నీటమునిగాయి. మల్లవరంలో పూరిల్లు గోడ కూలిపోయింది.

19.8 అడుగులకు వైరా నీటిమట్టం

రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వైరా రిజర్వాయర్‌లోకి భారీ వరదనీరు వచ్చిచేరింది. దీంతో ఆదివారం రిజర్వాయర్‌ పరవళ్లు తొక్కుతుంది. 44మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా రిజర్వాయర్‌ నీటిమట్టం 19.8 అడుగులకు పైగా చేరింది. సిరిపురం-లక్ష్మీపురం గ్రామాల మధ్యనున్న కాజ్‌వే మునిగింది. సోమవరం నల్లచెరువు అలుగులు పొంగి ప్రవహిస్తూ పంటపొలాలు నీటమునిగాయి.

కొణిజర్ల మండలంలో..

కొణిజర్ల మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షానికి మండలంలో పల్లుపల్లి దగ్గర, తీగలబంజర దగ్గర, తనికెళ్ళ దగ్గర పగిడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారి తీగలబంజర వద్ద పగిడేరు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పల్లిపాడు దగ్గర పొలీస్‌లు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. తుమ్మలపల్లిలోని వాగు పై వంతెన నిర్మించకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వాగుపై వంతెన నిర్మించాలని కోరినా ఉపయోగం లేకుండా పోతోంది.

నిలిచిన రాకపోకలు 

పెనుబల్లి-గంగదేవిపాడు మధ్యనున్న రాతోని అలుగు వాగు పొంగడంతో నాలుగురోజులుగా ఈ రహదారిలోని పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వారంరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ అలుగులు పారుతుండటంతో రాతోని అలుగు వాగు కూడా పొంగింది. పెనుబల్లి నుంచి గంగదేవిపాడు, తాళ్లపెంటకు వెళ్లే రహదారిలో వాగు పొంగడంతో పెనుబల్లి రైతులు కూడా పొలాలకు ఎరువు బస్తాలు తీసుకువెళ్లే అవకాశం లేకుండాపోయిందని వాపోతున్నారు. గత ఏడాది ఈ వాగు పొంగడంతో పెనుబల్లికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తహసీల్దార్‌ రమాదేవి ఆదేశాల మేరకు సర్పంచ్‌ తావూనాయక్‌ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు తీసుకున్నారుు. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లే రైతులతోపాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాగుపై వంతెనను వెంటనే నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-08T05:12:03+05:30 IST