చినుకు పడితే చీకటే!

ABN , First Publish Date - 2021-06-14T06:03:20+05:30 IST

చినుకు పడితే చీకటే!

చినుకు పడితే చీకటే!

చిన్నపాటి గాలికే గంటల కొద్దీ విద్యుత్‌ నిలిపివేత

నిత్యం అనధికారిక కోతలతో సతమతమవుతున్న ప్రజలు

అనేకచోట్ల అపరిష్కృతంగా ‘లైన్‌’ సమస్యలు

రూ.లక్షలు వెచ్చించినా తీరని కరెంటు కష్టాలు

ఖమ్మం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): అనధికారిక విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోరోజు ఒక్కోలా కోత విధిస్తున్నారు. మరికొన్నిసార్లు గంటలకొద్దీవిద్యుత్‌ రాకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు రోజుకి కనీసం మూడు నాలుగుసార్లు విద్యుత్‌ తీస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలో అధికారికంగా విద్యుత్‌ కోతల ముచ్చటే లేధని విధ్యుత్‌ అధికారులు చెబుతున్నా.. గంటలకొద్దీ ఈ కోతులు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  

రూ.లక్షలు వెచ్చించినా తీరని కరెంటు కష్టాలు 

పట్టణ ప్రగతి పేరిట సమస్యలు తొలగించాలన్న ఉద్దే శ్యంతో ప్రభుత్వం రూ.లక్షల వెచ్చించి సమస్యలు మాత్రం పునరావృతమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు కిందకు వేలాడటం, మరికొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలకు ఆనుకుని ఉండ టం.. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు ఆనుకుని ఉండటం వంటి సమస్యలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పెద్ద లైన్లు మార్చినప్పటికీ ఇళ్ల మధ్యలో ఉండే విద్యుత్‌ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అధికారులు నాసి రకంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరో పణలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం వర్షాకాలం కావ డంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోననీ ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విద్యుత్‌ సమస్యలను పరిష్కారం పేరుతో నిత్యం విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. అయితే కోత ఎంతసేపు అనే విషయంపై ప్రజలకు స్పష్టత నివ్వక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారు. కొందరు అధికారులు ఆయా కోతల సమయాలను ప్రకటిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే చాలామంది అధికారులు అసలు దాన్ని పట్టించు కోకుండా ఇష్టారీతిన (ఎల్‌సీ) లైన్‌ క్లియరెన్స్‌లు తీసు కుంటూ విద్యుత్‌ కోతలు విధిస్తున్నారన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. పల్లె ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు కోకొలల్లుగా ఉండటంతో ప్రజలనుంచి ఆ శాఖపై బోలెడన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

చిన్నపాటి గాలికి గంటల కొద్దీ సరఫరా నిలిపివేత 

ఖమ్మం జయనగర్‌ కాలనీలోని 17వ లైనులో విద్యుత్‌ తీగలు కిందకు ఉండటంతో మూడు నెలల క్రితం ఆ ప్రాంతంలో ఓ వాహనం తగిలి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దాంతో ఆ చుట్టుపక్కల ఇళ్లలోని గృహోపకరణాలు కాలి పోయి నష్టం జరిగింది. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అక్కడ విద్యుత్‌ స్తంబం వేయాలని నిర్ణయించారు. కానీ నెలలు గడిచినా నేటి వరకు అక్కడ విద్యుత్‌ స్తంబం వేయలేదు. కాగా ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తుండడంతో ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని ప్రజలు భయ పడుతున్నారు. ఖమ్మం నగరంలోని ఎన్నెస్టీ రోడ్డులోని నరసింహస్వామి దేవాలయ మెట్లు సమీపంలోని రోడ్డు పక్కనే ఓ ఐరన్‌ స్తంబం.. దానికి దగ్గరలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న పెద్ద చెట్టు ఉన్నాయి. గత కొద్ది నెలలుగా ఆ చుట్టుపక్కల ఇళ్లవారు విద్యుత్‌ శాఖ అధికారుల వద్దకు తిరిగినప్పటికీ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే ఇలా ఖమ్మం నగరంతోపాటుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వందల కొద్దీ సమస్యలు ఉన్నాయి. ఆయా సమస్యలు అలా వదిలేసిన కారణంగానే ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో విద్యుత్‌ అధి కారులు ఏదైనా చిన్నపాటి గాలిదుమ్ము, వర్షం వస్తే గంటల కొద్దీ విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి పరిస్థితులు జిల్లాలో పునరావృత మవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్‌ కోతల విషయంపై ప్రజలకు సమాచారం అందించాలని కోరుతున్నారు. 



Updated Date - 2021-06-14T06:03:20+05:30 IST