రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2022-09-29T05:35:42+05:30 IST

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుచేయడంతో పాటు వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీ నాయకులు బుధవారం ఆందోళనలు నిర్వహించారు. ప్రతిసారి రైల్వేజోన్‌ ఏర్పాటు పరిశీలనలో ఉందని, ఫీజుబులిటీ చూస్తున్నామని కేంద్రం చెబుతోందని, అటువంటి మాటలకు స్వస్తి చెప్పి తక్షణమే జోన్‌ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి రైల్వే జోన్‌పై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.

రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందే
రైల్వేస్టేషన్‌ వద్ద జోన్‌ కోసం డిమాండ్‌ చేస్తున్న వామపక్షాలు

వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాల్సిందే

వామపక్షాల డిమాండ్‌

సీపీఎం, సీపీఐ వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలి


విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుచేయడంతో పాటు వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీ నాయకులు బుధవారం ఆందోళనలు నిర్వహించారు. ప్రతిసారి రైల్వేజోన్‌ ఏర్పాటు పరిశీలనలో ఉందని, ఫీజుబులిటీ చూస్తున్నామని కేంద్రం చెబుతోందని, అటువంటి మాటలకు స్వస్తి చెప్పి తక్షణమే జోన్‌ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి రైల్వే జోన్‌పై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. జగదాంబ సెంటర్‌లో బుధవారం ఉదయం రైల్వే జోన్‌ కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు లోకనాథం మాట్లాడుతూ రైల్వే జోన్‌ ఏర్పాటుచేస్తామని గత ఎన్నికల ముందు బీజేపీ నేతలు ప్రకటన చేశారని, అందుకోసం విశాఖలో ఓఎస్‌డీని కూడా నియమించారని, అయితే ఇంకా పరిశీలనలో వుందని చెప్పడం సరికాదన్నారు. దేశంలో అత్యధిక ఆదాయం సాధిస్తున్న డివిజన్లలో వాల్తేరు కూడా ఒకటని, ఇప్పుడు దీనిని రద్దు చేసి ఒడిశాలోని రాయగడ డివిజన్‌లో కలిపేయడం అన్యాయమన్నారు. వాల్తేరు డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ, విశాఖ రైల్వేజోన్‌ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని, బీజేపీ మోసం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కొత్తజోన్‌ ఇవ్వడంతో పాటు వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలన్నారు.

వైసీపీ ఎందుకు ఒత్తిడి తీసుకురాదు: సీపీఐ

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటుచేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సాధ్యం కాదనడం తగదని సీపీఐ నాయకులు ఖండించారు. జోన్‌ కోరుతూ విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ ఆవరణలో బుధవారం సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పైడిరాజు మాట్లాడుతూ, కేసుల గురించి భయంతో జగన్‌ రైల్వేజోన్‌పై మాట్లాడడం లేదని ఆరోపించారు. జోన్‌ ఏర్పాటు చేసేంత వరకు రైల్వే జోన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. 


అతి త్వరలోనే విశాఖకు రైల్వే జోన్‌

పీవీఎన్‌ మాధవ్‌, ఎమ్మెల్సీ, బీజేపీ

విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్‌ ఏర్పాటవుతుందని, బీజేపీ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో ఎటువంటి అపోహలు తగవన్నారు. కొత్త రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని, ఇన్‌ ప్రిన్సిపుల్‌ పని కూడా జరుగుతోందన్నారు.  


ద్రోహానికి పరాకాష్ట

అజ శర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

విశాఖలో కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రైల్వే బోర్డు చెప్పడాన్ని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తీవ్రంగా ఖండిస్తున్నదని సంస్థ ప్రధాన కార్యదర్శి అజ శర్మ పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న ద్రోహానికి పరాకాష్టగా అభివర్ణించారు. మెట్రో రైలు ఊసే లేకుండా చేశారని, పెట్రో, గిరిజన యూనివర్సిటీల నిర్మాణం ఇంకా ప్రారంభించలేదని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రహసనంలా మార్చేశారన్నారు. ఉత్తరాంధ్రలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్నారని, అభివృద్ధికి మార్గాలు మూసేస్తున్నారన్నారు. 


Updated Date - 2022-09-29T05:35:42+05:30 IST