రణమా.. మౌనమా?

ABN , First Publish Date - 2021-09-29T06:20:16+05:30 IST

సామాన్యులకు రైలు బండి దూరమవుతోంది.

రణమా.. మౌనమా?

ప్రైవేటీకరణపై ఎంపీలు గళం విప్పుతారా?

సామాన్యుల పక్షాన నిలచి ప్రశ్నిస్తారా?

రేపు విజయవాడలో ఎంపీలతో రైల్వే జీఎం భేటీ 

రాయితీలు లేకుండానే రైల్వే ప్రయాణాలు 

సామాన్యులు ఆదరించే పాసింజర్‌ రైళ్లకు మంగళం 

నడుపుతున్న రైళ్లలోనూ ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు 

జనరల్‌ తెరిచినా, స్పెషల్‌ పేరుతో తత్కాల్‌ బాదుడు 

ఈ నిర్ణయాలపై నిలదీస్తేనే ప్రజలకు న్యాయం


సామాన్యులకు రైలు బండి దూరమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విచ్చలవిడి ప్రైవేటీకరణ విధానాలు రైల్వే భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రైవేటీకరణ విధానాలను మన ఎంపీలు ప్రశ్నిస్తారా? ఈ విధానాలు సామాన్యులకు ఎలా నష్టం కలిగిస్తాయో అర్థమయ్యేలా చెబుతారా? వారిని నమ్మి, చట్ట సభలకు తమ ప్రతినిధులుగా గెలిపించి పంపిన ప్రజల పక్షాన గళం విప్పుతారా? కొవిడ్‌ పేరుతో రైల్వేలో రాయితీలకు కోత పెట్టారు. స్పెషల్‌ రైళ్ల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌లు కావాలంటూ పాసింజర్లను రద్దు చేశారు. ఈ సమస్యపై గళం వినిపించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉంది. గురువారం విజయవాడలో పార్లమెంట్‌ సభ్యులతో రైల్వే జీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో ప్రజల పక్షాన మన ఎంపీలు గళం విప్పుతారో లేదో వేచి చూడాల్సిందే.


ఆంధ్రజ్యోతి, విజయవాడ : రైల్వేలో మితిమీరిన ప్రైవేటీకరణ విధానాలు ఉద్యోగుల్లో సహజంగానే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విధానాల ఫలితం పరోక్షంగా ప్రయాణికులపై పడుతోంది. ఇది తమ సమస్యగా ప్రజలు కూడా భావిస్తున్నారు. ప్రజలకు ప్రతినిధులుగా పార్లమెంట్‌కు వెళ్లిన ఎంపీలు ఈ విచ్చలవిడి ప్రైవేటీకరణ విధానాలపై గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ వేదికగా నాల్గోసారి గురువారం ఎంపీలతో రైల్వే సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వారు ప్రైవేటీకరణపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


రైల్వే ఫర్‌ సేల్‌

రైల్వేను లీజు ముసుగులో అనధికారికంగా విక్రయించేలా మానిటైజేషన్‌ స్కీమ్‌ను తీసుకు వచ్చారు. దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడలో ఏ1 రైల్వేస్టేషన్‌ను మానిటైజేషన్‌ జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో పెట్టడం వల్ల ఏదో ఒక ప్రైవేటు సంస్థ దీని బాధ్యతలను చేపడుతుంది. ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధరలు మొదలుకుని అన్నీ పెరిగిపోతాయి. ఎవరి ధనంతో రైల్వే ఇంత అభివృద్ధి సాధించిందో ఆ ప్రజలకే దూరమయ్యే దుస్థితి ముంచుకొస్తోంది. రైల్వేస్టేషన్లను అమ్మకానికి పెడితే, సామాన్య ప్రయాణికులకు దక్కే ప్రయోజనాలు ఏమిటి? ప్రశ్నించేందుకు ఇదే సరైన సమయం. మొత్తం ప్రైవేటుకు అప్పగించేశాక నోరు తెరిచినా ప్రయోజనం ఉండదని అందరూ గుర్తించాలి. 


రాయితీలు కట్‌  

రైల్వే ప్రయాణికులకు ఏడాదిన్నరగా రాయితీలు వర్తించటం లేదు. సాధారణ రైళ్ల స్థానంలో స్పెషల్‌ రైళ్లను తీసుకు వచ్చారు. ఇపుడు జనరల్‌ రైళ్లను తీసుకువచ్చినా రాయితీలు వర్తింపచేయటం లేదు. పైగా పండగలకు కొన్ని నెలల ముందుగానే స్పెషల్‌ రైళ్లను నడుపుతూ, తత్కాల్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. 


ప్రైవేటు రైళ్లు సామాన్యులకు అందుబాటులో ఉంటాయా? 

డివిజన్‌ పరిధిలో ఇంతకు ముందు ప్రైవేటు రైళ్లకు టెండర్లు పిలిచారు. టెండర్లకు స్పందన రాకపోవటంతో మానిటైజేషన్‌ పేరుతో రైళ్లను ప్రైవేటుపరం చేయటానికి తాపత్రయ పడుతున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ప్రైవేటువారికి రైళ్లను అప్పగించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకున్నారు. అందులో భాగంగా రైళ్లు గంటకు 130 - 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ట్రాక్‌లను బలోపేతం చేశారు. పాత వంతెనలను తొలగించి, కొత్తవి నిర్మించారు. నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు చేపట్టారు. పైకి అభివృద్ధి ముసుగు వేసినా.. అంతర్గతంగా ఇవన్నీ ప్రైవేటీకరణ కోసమేనని ఆ తర్వాత కానీ తెలియలేదు. రైళ్లను ప్రైవేటుకు అప్పజెపితే సామాన్యులకు తక్కువ ధరలో ప్రయాణం కల్పించటం సాఽధ్యమేనా? దీనిపై ఎంపీలు రైల్వే జీఎంను నిగ్గదీయగలిగితే చాలు. 


సామాన్యులకు రైల్వే దూరం  

రైల్వే సామాన్యుడికి దూరమవుతోంది. సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవి పాసింజర్‌ రైళ్లే. వీటిని దశల వారీగా కుదించేశారు. వీటి స్థానంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తీసుకువచ్చారు. జనరల్‌ రైళ్లను తీసుకు వచ్చిన తరువాత కూడా పాసింజర్లను రద్దు చేశారు. కొన్నింటిని నడుపుతున్నా, వాటిలో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలను వసూలు చేస్తున్నారు. అదేమంటే పాసింజర్లు కూడా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లతో సమానంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు చెప్పుకొస్తున్నారు. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ను తప్పనిసరి చేయటం వల్ల చదువురాని వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 


పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుపై నిలదీయాలి 

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలపై ఎంపీలు రైల్వే జీఎంను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం ప్రకారం విశాఖకు రైల్వే జోన్‌ ప్రకటించినా ఏర్పాటు చేయలేదు. విజయవాడ డివిజన్‌ భవనాలు ముస్తాబైనా.. జోన్‌ ఊసు లేదు. అమరావతి నూతన రైల్వే మార్గం ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. ఇది కూడా చట్టంలో ఉన్నదే. నూతన క్యాపిటల్‌ సిటీకి రైలు మార్గం వేయటం రైల్వేశాఖ బాధ్యత. అమరావతికి నూతన రైల్వే మార్గం నిర్మిస్తే.. దీనికి అనుసంధానంగా దక్కన్‌ కారిడార్‌ ఏర్పాటు కూడా ఈ చట్టంలోనే ఉంది. అమరావతి నుంచి రాయలసీమకు కనెక్టివిటీ ఇచ్చేదే దక్కన్‌ కారిడార్‌. ఇప్పటి వరకూ ఈ కారిడార్‌ ఊసే లేదు. 

Updated Date - 2021-09-29T06:20:16+05:30 IST