ఆదరణ ఉన్నా.. ఆగని రైలు

ABN , First Publish Date - 2021-07-23T05:33:48+05:30 IST

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌కు ముందు..

ఆదరణ ఉన్నా..  ఆగని రైలు

పలు రైల్వేస్టేషన్లలో నిలుపుదల ఎత్తివేత

తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 లాక్‌డౌన్‌కు ముందు ప్రయాణికుల ఆదరణ బాగా ఉన్న రైల్వేస్టేషన్లలో ఇప్పుడు నిలుపుదల సౌకర్యం తొలగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్‌లాక్‌లో భాగంగా ఈ నెల 19వ తేదీ నుంచి రైల్వేశాఖ పట్టాలెక్కించిన ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లను ఇంచుమించు ఎక్స్‌ప్రెస్‌లుగా లాగానే నడుపుతోంది. దీంతో సాధారణ ప్రయాణికులకు ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యంగా మాచర్ల - నడికుడి మధ్యన రెంటచింతల, గురజాల స్టేషన్లలో ఉదయం నడిచే మెమూ రైలుకు నిలుపుదల ఎత్తివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఇదేవిధంగా గుంటూరు - పిడుగురాళ్ల మధ్యన శిరిపురం, తుమ్మలచెరువు, తెనాలి - రేపల్లె సెక్షన్‌లో భట్టిప్రోలు, పల్లెకోన, విజయవాడ వైపున పెదకాకానిలో నిలుపుదల సౌకర్యం తొలగించడంపై పరిసర ప్రాంతాల ప్రజలకు రైలు సౌకర్యం అనేది లేకుండా పోయింది. ఇది కూడా ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లకు జనాదరణ లేకపోవడానికి  ఒక కారణంగా మారింది. 


భట్టిప్రోలు రైల్వేస్టేషన్‌కు ఏటా రూ.84 లక్షలు, పల్లెకోన నుంచి రూ.34 లక్షలు ఆదాయం రైల్వేకి సమకూరుతుంది. వేమూరు నుంచి రూ.56 లక్షలు వస్తుంది. అయినప్పటికీ భట్టిప్రోలు, పల్లెకోన రైల్వేస్టేషన్లలో నిలుపుదల సౌకర్యం తొలగించారు. భట్టిప్రోలులో బౌద్ధస్థూపం ఉండటంతో ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తుంటారు. వీటన్నింటికి కంటే ఆదాయం తక్కువగా ఉండే చినరావూరులో నిలుపుదల సౌకర్యాన్ని అలానే కొనసాగిస్తున్నారు. కాగా పెదకాకాని రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే కాకాని మల్లేశ్వరస్వామి దేవాలయం, దర్గా, కాకాని స్వస్థిశాల ఉన్నాయి. ఈ స్టేషన్‌లో గతంలో హాల్టింగ్‌ సౌకర్యం ఉండేది. తద్వారా రూ.36 లక్షల ఆదాయం వచ్చేది. నంబూరు రైల్వేస్టేషన్‌ ద్వారా రూ.28 లక్షల ఆదాయం మాత్రమే వస్తున్నప్పటికీ పెదకాకాని హాల్ట్‌ని తొలగించి నంబూరుని కొనసాగిస్తున్నారు. 


గురజాల రైల్వేస్టేషన్‌ ద్వారా రూ.26 లక్షలు, రెంటచింతల నుంచి రూ.19 లక్షలు ఆదాయం సమకూరేది. ఉదయం నడిచే మాచర్ల - విజయవాడ ప్రత్యేక ప్యాసింజర్‌ని ఈ రెండు స్టేషన్లలో నిలుపుదల ఎత్తివేయడం వలన ప్రయాణికులు ఉదయం వేళ గుంటూరు వైపునకు రావడానికి బస్సులనే ఆశ్రయించాల్సి వస్తోన్నది. కాగా మందపాడు స్టేషన్‌లో ఇటీవలే హైలెవల్‌ ప్లాట్‌ఫాం కూడా కట్టి తీరా ఇక్కడ ప్రయాణికుల ఆదరణ లేదని హాల్ట్‌ తొలగించారు. తుమ్మలచెరువు, శిరిపురం ఎప్పటినుంచో క్రాసింగ్‌ స్టేషన్లుగా ఉన్నాయి. ఇక్కడ రైల్వే సిబ్బంది కూడా ఉంటారు. అయినప్పటికీ ఈ రెండింటిలోనూ నిలుపుదల తొలగించారు. ప్యాసింజర్‌ రైళ్లు వచ్చి కూడా తమకు ఉపయోగం ఉండటం లేదని పలువరు వాపోతున్నారు. 

Updated Date - 2021-07-23T05:33:48+05:30 IST