రాహుల్ వేసిన మంత్రం చిత్తైంది!

ABN , First Publish Date - 2021-05-02T21:37:04+05:30 IST

కేరళ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వేసిన పాచిక చిత్తైంది. ‘యువ’ మంత్రాన్ని బాగా జపిస్తూ, యువతను

రాహుల్ వేసిన మంత్రం చిత్తైంది!

న్యూఢిల్లీ : కేరళ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వేసిన పాచిక చిత్తైంది. ‘యువ’ మంత్రాన్ని బాగా జపిస్తూ, యువతను ఆకర్షించడానికి కొన్ని స్థానాల్లో యువకులను రంగంలోకి దింపారు. ఆ యువ మంత్రాన్ని కేరళ ఓటర్లు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కేరళ రాజకీయాలను బాగా ఔపోసన పట్టిన సీనియర్లు రాహుల్ వ్యూహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే.. రాహుల్ ‘యువత’ అన్న పాచికతోనే రంగంలోకి దిగాలని ఆదేశించారు. దీంతో రాహుల్ అభ్యర్థన మేరకు 50 మంది కొత్త మొహాలను రంగంలోకి దింపారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్, శశి థరూర్ నేతృత్వంలోని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్  వంటి సంస్థల నుంచి డజనుకు పైగా కొత్త మొహాలను వెతికి మరీ రంగంలోకి దింపారు. ప్రస్తుత ట్రెండ్స్‌ను చూస్తే మాత్రం రాహుల్ పాచిక అట్టర్ ప్లాఫ్ అయ్యిందనే చెప్పాల్సి ఉంటుంది. వామపక్షాల అభ్యర్థుల చేతల్లో 10,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు వెనకబడి ఉన్నారు. రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షఫీ పెరంబిల్, శబరినాథన్ కూడా వెనుకబడే ఉన్నారు. 


కాంగ్రెస్ జాబితాలోనే అత్యంత పిన్న వయస్కుడైన అరితా బాబు (27) కూడా వెనుకంజలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌లో ఆందోళన అధికమైంది. ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. ఈ సర్వే వచ్చిన తర్వాత కూడా రాహుల్ ఏమాత్రం తన వైఖరి మార్చుకోలేదు. క్షేత్ర స్థాయిలో వచ్చే మార్పులను ఏమాత్రం ఆకళింపు చేసుకోకుండా 50 సీట్లను యువతకు కేటాయించి, పార్టీని వైఫల్యంలోకి నెట్టేశారని సీనియర్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్‌కు తీవ్రమైన ఇక్కట్లు తప్పేలా లేవని సీనియర్లు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-02T21:37:04+05:30 IST