53వ పడిలోకి రాహుల్... వేడుకలు వద్దని విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-06-19T20:13:44+05:30 IST

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారంనాడు 53వ సంవత్సరంలోకి..

53వ పడిలోకి రాహుల్... వేడుకలు వద్దని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారంనాడు 53వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఒక సందేశంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపరాదని పార్టీ నేతలు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. దేశయువత ఆవేదనతో ఉన్నారని, రోడ్డపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని, వారికి, వారి కుటుంబాలకు బాసటగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిలబడాలని దిశానిర్దేశం చేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో కోట్లాది మంది యువత ఆవేదనతో ఉన్నారని అన్నారు. వారి బాధను పంచుకోవాలన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని పార్టీ కార్యకర్తలు, శ్రేయాభిలాషులను ఆనయ కోరారు. రాహుల్ సందేశాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


సత్యాగ్రహ నిరసన...

మరోవైపు, కాంగ్రెస్ ఎంపీలు, నేతలు న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ఆదివారంనాడు సత్యాగ్రహ నిరసనలో పాల్గొన్నారు. సాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న యువతకు సంఘీభావంగా ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన సత్యాగ్రహ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-19T20:13:44+05:30 IST