NIA Raids PFI : పీఎఫ్ఐపై ఎన్ఐఏ దాడులపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-09-23T00:03:59+05:30 IST

మతతత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారు

NIA Raids PFI : పీఎఫ్ఐపై ఎన్ఐఏ దాడులపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే...

తిరువనంతపురం : మతతత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ  (NIA) దేశవ్యాప్తంగా గురువారం నిర్వహించిన దాడుల్లో దాదాపు 100 మంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 


జాతీయ దర్యాప్తు సంస్థ (Natioinal Investigation Agency) బుధవారం-గురువారం మధ్య రాత్రి దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ 106 మందిని అరెస్టు చేసింది. కేరళలో 22 మందిని, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 20 మంది చొప్పున, ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదుగురిని, అస్సాంలో తొమ్మిది మందిని, ఢిల్లీలో ముగ్గుర్ని, మధ్య ప్రదేశ్‌లో నలుగుర్ని, పుదుచ్చేరిలో ముగ్గుర్ని, తమిళనాడులో 10 మందిని, ఉత్తర ప్రదేశ్‌లో ఎనిమిది మందిని, రాజస్థాన్‌లో ఇద్దరిని అరెస్టు చేసింది. ఇది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ప్రక్రియల్లో అతి పెద్దదని తెలుస్తోంది. 


అరెస్టయినవారు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను సేకరిస్తున్నారని, శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారని, యువతను రాడికలైజ్ చేస్తున్నారని ఎన్ఐఏ ఆరోపించింది. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. 


ఈ దాడులపై పీఎఫ్ఐ స్పందిస్తూ, తమ సంస్థ జాతీయ, రాష్ట్ర, స్థానిక నేతలపై దాడులు జరిగినట్లు తెలిపింది. అసమ్మతి గళాలను అణచివేసేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్న ఫాసిస్ట్ ప్రభుత్వ చర్యలను గట్టిగా నిరసిస్తున్నట్లు తెలిపింది. 


‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలో పాదయాత్ర చేస్తున్నారు. పీఎఫ్ఐపై దర్యాప్తు సంస్థల దాడులపై ఆయన స్పందిస్తూ, మతతత్వం, హింస ఎక్కడి నుంచి వచ్చినా ఒకటేనన్నారు. అన్ని రూపాల్లోని మతతత్వం, హింసలపై పోరాడాలన్నారు. వాటిని ఎంత మాత్రం సహించరాదని చెప్పారు.  


అమిత్ షా అత్యవసర సమావేశం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు వెల్లడైన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)  గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval), ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 10 రాష్ట్రాల్లో సుమారు 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. 


Updated Date - 2022-09-23T00:03:59+05:30 IST