బ్లాక్ ఫంగస్ నిరోధానికి మోదీ చేయబోతున్నదేమిటో చెప్పిన రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2021-05-22T20:03:51+05:30 IST
బ్లాక్ ఫంగస్ (మ్యుకోర్‌మైకోసిస్) కేసులు పెరుగుతుండటంపై
న్యూఢిల్లీ : బ్లాక్ ఫంగస్ (మ్యుకోర్‌మైకోసిస్) కేసులు పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సత్వరమే స్పందించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది చప్పట్లు కొట్టించినట్లుగానే ఈ ఏడాది కూడా చేస్తారేమోనని మండిపడ్డారు.
కోవిడ్-19 వ్యాధిగ్రస్థుల్లో మ్యుకోర్‌మైకోసిస్ కేసులు పెరుగుతుండటంపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ల కొరత వేధిస్తోందని, అదే సమయంలో బ్లాక్ ఫంగస్ వ్యాధికి చికిత్స చేయడానికి అవసరమైన ఔషధాల కొరత కూడా తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, మోదీ సిస్టమ్ అసమర్థత వల్ల కోవిడ్-19 మహమ్మారితోపాటు బ్లాక్ ఫంగస్ మహమ్మారి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మహమ్మారి కేవలం భారత దేశంలోనే ఉందన్నారు. వ్యాక్సిన్ల కొరతతోపాటు మందుల కొరత కూడా వేధిస్తోందన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి చప్పట్లు కొట్టాలని, పళ్లేలు మోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చెబుతారని దుయ్యబట్టారు.
బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా చాలా రాష్ట్రాలు ప్రకటించాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణా, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధిని అంటువ్యాధిగా ప్రకటించాయి. బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా కోవిడ్-19 రోగుల్లో కనిపిస్తున్నాయి. కంటి చూపు తగ్గడం లేదా, డబుల్ విజన్, ఛాతీ నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు ఈ వ్యాధి లక్షణాలు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం, మే 21నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుజరాత్‌లో 2,281 కేసులు; మహారాష్ట్రలో 2,000 కేసులు, ఆంధ్ర ప్రదేశ్‌లో 910 కేసులు నమోదయ్యాయి.