ప్రధాని మోదీ రైతులతో మాట్లాడటం ఎప్పుడైనా చూశారా? రాహుల్

ABN , First Publish Date - 2021-01-24T02:03:57+05:30 IST

ప్రధాని మోదీ టార్గెట్‌గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన సాగింది. తిరుప్పూర్‌లో రైతులతో ఆయన సంభాషించారు.

ప్రధాని మోదీ రైతులతో మాట్లాడటం ఎప్పుడైనా చూశారా? రాహుల్

చెన్నై : ప్రధాని మోదీ టార్గెట్‌గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన సాగింది. తిరుప్పూర్‌లో రైతులతో ఆయన సంభాషించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ప్రధాని మోదీ రైతులతో ఎప్పుడూ మాట్లాడరని, కేవలం ఐదుగురు పారిశ్రామిక వేత్తలతో మాత్రమే ఎప్పుడూ సంభాషిస్తారని విమర్శించారు. ‘‘నేను మీతో మాట్లాడుతున్నాను. మీ ప్రశ్నలకు సమాధానమిస్తున్నాను. ప్రధాని మోదీ ఇలా చేయడం ఎప్పుడైనా చూశారా? నేను మీతో మాట్లాడుతున్నట్లుగా ఆయన ఎప్పుడైనా మాట్లాడారా? ఓ గదిలో ఐదుగురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. వారితో సంభాషిస్తారు. రైతులతో ఎప్పుడూ మాట్లాడరు. రైతులు, కార్మికుల గురించి ఆయన అసలు ఆలోచించరు’’ అని రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన చట్టాలు రైతుల పాలిట నోట్లరద్దు లాంటిదని అభివర్ణించారు.


ఢిల్లీ వేదికగా  రైతులు నిరసన తెలుపుతూ, నూతన చట్టాలు అమలు కాకుండా ఆపుతున్నారని, వారందరినీ చూస్తే చాలా గర్వంగా ఉందని రాహుల్ పేర్కొన్నారు. రైతులు, పేదలు, కార్మికుల శక్తి ఏమిటో మోదీ ప్రభుత్వానికి తెలియదని, ఆ రుచి ఒకసారి మోదీ ప్రభుత్వానికి చూపించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. దేశంలో రైతుల మీద, కార్మికుల మీద ఓ పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని, ఇవి విధానాల తప్పిదాలు ఏమాత్రం కాదని నొక్కి చెప్పారు. చిన్న, మధ్యతరహా, కార్మికులు, రైతుల నడ్డి విరచడానికే కేంద్రం ఇలా ప్రవర్తిస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. 

Updated Date - 2021-01-24T02:03:57+05:30 IST