ఆక్రమణలపై ప్రశ్నించిన గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-03-08T05:16:58+05:30 IST

గ్రంథాలయం ఆక్రమణపై పలువురు గ్రామస్థులు స్పందించారు. 100 మంది వరకు ప్రజలు సదరు స్థలం వద్దకు వచ్చి ఆక్రమణదారుడిని ప్రశ్నించారు.

ఆక్రమణలపై ప్రశ్నించిన గ్రామస్థులు
స్థలం వివరాలు తెలుసుకుంటున్న సీఐ

గ్రంథాలయం స్థలం వద్ద స్వల్ప ఘర్షణ

ఆక్రమణదారుడితో గ్రామస్థుల వాగ్వాదం

హద్దులు ఏర్పాటు చేస్తామన్న అధికారులు

లింగసముద్రం, మార్చి 7 : గ్రంథాలయం ఆక్రమణపై పలువురు గ్రామస్థులు స్పందించారు. 100 మంది వరకు ప్రజలు సదరు స్థలం వద్దకు వచ్చి ఆక్రమణదారుడిని ప్రశ్నించారు. అయితే తాము ఆ స్థలాన్ని దాతల వద్ద కొనుగోలు చేశామని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు చెప్పిందని పొలిమేర యానాదిరెడ్డి, ఆయన కుమారుడు మహేంద్ర పేర్కొన్నారు. అయితే అవి నకిలీ పత్రాలని మాజీ ఎంపీపీ పి బాలకోటయ్య, షేక్‌ షఫి, షేక్‌ అల్లాఉద్దీన్‌, పెన్నా రమణయ్య, అడపా నర్సయ్య, బి రాఘవ తదితరులు ఆరోపించారు. దీంతో యానాదిరెడ్డి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దాతలు ఇచ్చిన ఆయుర్వేద వైద్యశాల భవనంతో పాటు, ఉత్తరం వైపున ఉన్న 10 గదుల స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థులు  డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా బాలకోటయ్య, షఫి తదితరులు 2003లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ బలరామయ్య ఒకసారి దానం చేసిన ఆస్తులను తిరిగి తీసుకొనే హక్కు లేదని అది ప్రభుత్వ ఆస్తి అని తీర్పు ఇచ్చారని సదరు కాపీలను అధికారులకు అందజేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు  కోరారు.

లింగసముద్రంలో ఆక్రమణకు గురైన గ్రంథాలయం స్థలాన్ని పామూరు సీఐ వి.శ్రీనివాసరావు, ఎంపీడీవో కె మాలకొండయ్య, ఎస్సై సైదుబాబులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాలకొండయ్య 1969లో ఇప్పటి గ్రంథాలయం స్థలంలో దాత ఒకరు ప్రసూతి గదిని నిర్మించి ఉలవపాడు సమితికి దానం ఇచ్చారని చెప్పారు. ఈ గదిని ఆయుర్వేద వైద్యశాలకు దక్షిణ భాగంలో నిర్మించి ఇచ్చారని చెప్పారు. ఇక్కడ ఆయుర్వేద వైద్యశాల లేకపోవడంతో, అక్కడ కూడా గ్రంథాలయం నడిచిందన్నారు. ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్పారు. ప్రస్తుతం ఆక్రమణకు గురైన ఈ స్థలంలో నాలుగు వైపులా సచివాలయం సర్వేయర్‌ ద్వారా హద్దులు ఏర్పాటు చేయించారు.  సదరు సర్టిఫైడ్‌ కాపీని ఎంపీడీవో ద్వారా తనకు ఇస్తే తగు రక్షణ కల్పిస్తానని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.


Updated Date - 2021-03-08T05:16:58+05:30 IST