భారత్ వ్యాక్సిన్లకు మరో ఘన విజయం

ABN , First Publish Date - 2021-03-10T21:36:49+05:30 IST

భారత దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి అగ్ర దేశాల మద్దతు

భారత్ వ్యాక్సిన్లకు మరో ఘన విజయం

న్యూఢిల్లీ : భారత దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి అగ్ర దేశాల మద్దతు లభించబోతోంది. దాదాపు 50 దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్న భారత్‌కు అండదండలు అందించేందుకు క్వాడ్ దేశాలు ముందుకు వస్తున్నాయి. శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగే క్వాడ్ దేశాల సమావేశంలో దీనికి సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయని విశ్వసనీయ సమాచారం. ఈ ఒప్పందాలు ఆచరణలోకి వస్తే చైనాకు భారత్ నుంచి గట్టి దెబ్బ తగిలినట్లే.


భారత దేశం, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా కలిసి క్వాడ్ గ్రూపుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగే ఆన్‌లైన్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొంటారని వైట్ హౌస్ మంగళవారం ప్రకటించింది. ఈ సమావేశంలో కోవిడ్, ఆర్థిక సహకారం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై చర్చిస్తారని తెలిపింది. 


ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో సీనియర్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ, భారత దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు నిధులను సమకూర్చడానికి సంబంధించిన ఒప్పందాలను క్వాడ్ గ్రూప్ సమావేశంలో ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. అమెరికా, జపాన్, తదితర దేశాల మధ్య ఈ ఒప్పందాలు ఉంటాయన్నారు. అమెరికన్ ఔషధ కంపెనీలు నోవావాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్‌లకు వ్యాక్సిన్లను తయారు చేసే భారతీయ కంపెనీలు, సంస్థలపై ప్రధాన దృష్టితో ఈ ఒప్పందాలను ప్రకటించబోతున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ తయారీ భారాన్ని తగ్గించుకోవడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, కరోనా వైరస్ మ్యుటేషన్లను దెబ్బతీయడం లక్ష్యంగా ఈ ఒప్పందాలను ప్రకటిస్తారన్నారు. భారత దేశంలో అదనంగా పెరిగే వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ఆగ్నేయాసియా దేశాల కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు. 


చైనాకు చెక్

వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పెట్టుబడి పెట్టాలని క్వాడ్ దేశాలను భారత్ ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. చైనా వ్యాక్సిన్ దౌత్యాన్ని తిప్పికొట్టేందుకు కలిసికట్టుగా ముందడుగు వేయాలని భారత్ పిలుపునిచ్చింది. 


Updated Date - 2021-03-10T21:36:49+05:30 IST