ఖాద్రీశుడి బ్రహ్మోత్సవం

ABN , First Publish Date - 2022-03-13T06:04:43+05:30 IST

ఖాద్రీ నృసింహుడి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి యాగశాలలో శాసో్త్రక్తంగా అంకురార్పణ చేశారు.

ఖాద్రీశుడి బ్రహ్మోత్సవం
అంకురార్పణలో దర్శనమిస్తున్న శ్రీవారు..

శాసో్త్రక్తంగా అంకురార్పణ

ముక్కోటి దేవతలకు ఆహ్వానం

కదిరి, మార్చి 12: ఖాద్రీ నృసింహుడి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి యాగశాలలో శాసో్త్రక్తంగా అంకురార్పణ చేశారు. పక్షం రోజులపాటు సాగే ఈ ఉత్సవాలు విజయవంతంగా సాగేలా చూడాలని అష్టదిక్పాలకులను వేడుకున్నారు. ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. యాగశాలలో పుణ్యాహవచనం నిర్వహించి, శ్రీవారి ఆలయంలో స్వామి వారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనున్ని  సర్వాంగ సుందరంగా  ఆలంకరించారు. విశేష సమర్పణ చేసి అనంతరం మండపంలోకి తోడ్కొని వచ్చి, ఆలయ మర్యాదలతో ఈశాన్యం వైపునకు చేర్చారు. ఉత్సవాలకు ప్రారంభ సూచికగా విశ్వక్సేనుల సమక్షంలో ప్రధానాచార్యులు భూమాత అనుగ్రహం కోసం విశేష ఆరాధన చేశారు. మంత్రయుక్తంగా మట్టిని సేకరించి యాగశాల చేరుకున్నారు. ప్రధానాచార్యులు బ్రహ్మ స్థానంలో ఉండి విశేష ఆరాధనలు చేశారు. యాగశాలలో నిత్యాగ్ని హోత్రాన్ని వెలిగించారు. ఉత్సవాలు ముగిసే వరకు ఈ హోత్రం వెలుగుతూనే ఉంటుంది. కల్యాణోత్సవం ముగిసిన నాటి నుంచి ఉత్సవాలు ముగిసే వరకు శ్రీవారు యాగ శాలలోనే కొలువుంటారు. పుట్టమన్ను సేకరించి, యాగశాలలో నవధాన్యాలను మొలక పోశారు. ఇందులో మొలక ఏ దిక్కున ఎక్కువగా వస్తుందో ఆ దిక్కున పంటలు ఎక్కువగా పండుతాయని భక్తులు విశ్వసిస్తారు. ‘అంకురార్పణ అనగా ప్రకృతి ఆరాధన. ప్రకృతి అనగా భూదేవి. అంటే ఏ పనిని ప్రారంభించాలన్నా మొదట స్త్రీలను పూజించి, వారిని ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం’ అని ఆలయ ప్రధాన అర్చకుడు నరసింహాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన గోపాలకృష్ణ, ఈఓ గురుప్రసాద్‌, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. 


నేడు కల్యాణోత్సవం

కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవం ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కనులపండువగా జరగనుంది. అంతకు ముందు ఉదయం ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఉత్సవాలకు అధిపతి అయిన గరుడాళ్వార్‌ను ధ్వజారోహణం చేస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు ఉంచి, తీర్థవాది రోజున అవరోహణం చేస్తారు. ఈ వేడుకను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. యాగశాల నుండి శ్రీవారిని, అమ్మవార్లను వేర్వేరుగా పల్లకిలో కల్యాణ మండపానికి తోడ్కొని వస్తారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి ప్రతిరూపమైన కంకణ భట్టాచార్యుల వారు అమ్మవార్లకు మాంగల్యధారణ చేస్తారు. నారసింహుని కల్యాణంలో తలంబ్రాలు పోసుకోవడం, అతిథులు వధూవరులకు చదివింపులు సమర్పించడం అనాదిగా వస్తోంది. శ్రీదేవీ, భూదేవీ సమేత నారసింహుడి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి ముక్కోటి దేవతలు విచ్చేస్తారని భక్తుల నమ్మకం. కల్యాణ వేడుకల కోసం ఆలయ ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఈఓ పట్టెం గురుప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2022-03-13T06:04:43+05:30 IST