మనోడే పనిలో పెట్టేయ్‌..!

ABN , First Publish Date - 2022-07-13T05:12:32+05:30 IST

మనోడే పనిలో పెట్టేయ్‌..!

మనోడే పనిలో పెట్టేయ్‌..!

నగరపాలక సంస్థలో ఇష్టారీతిన నియామకాలు

ఉన్నతాధికారుల దృష్టికి రాకుండా జాగ్రత్తలు

ఖమ్మం కార్పొరేషన, జూలై 12: ఖమ్మం నగరపాలక సంస్థలో ఎవరికీ తెలియని రీతిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొని, ఉద్యోగాల్లో ఇరికిస్తున్నారు. ఒక ఉద్యోగి వ్యక్తిగత కారణాలతో విధులను మానేస్తే వెంటనే తమ వాళ్లతో ఆ ఖాళీని భర్తీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల వివరాలు పైస్థాయి అధికారులకు తెలియకపోవటంతో, ఒక పోస్టు ఖాళీ కాగానే మనోడే పనిలో పెట్టేయ్‌...అంటూ సదరు ఉద్యోగి స్థానంలో తమవాడిని చేరుస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా సొమ్ములు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నయాబజార్‌ కళాశాల వద్ద నీటిట్యాంక్‌ శుభ్రపరుస్తూ ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి చనిపోగా.. ఈపోస్టును రూ.2లక్షలు చెల్లించి తీసుకున్నామని, మృతుడి తల్లి చెప్పటం గమనార్హం.


ప్రణాళిక ప్రకారం..

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రణాళిక ప్రకారం అత్యవసరమంటూ వివిధ విభాగాల్లో నియమిస్తున్నారు. ఎవరైనా ఉద్యోగం మానేస్తే వెంటనే నగరపాలకసంస్థలో పనిచేసే ఉద్యోగులకు సమాచారం అందుతుంది. ఆ వెంటనే రంగం సిద్ధమై కొందరి సహకారంతో తమ వాళ్లను తీసుకువస్తారు. ఉద్యోగం మానేసిన వారి స్థానంలో తమవారి పేరు ఎక్కించేలా చేస్తారు. ఇలా ఇటీవలే పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించినట్టు తెలుస్తోంది. విలీనపంచాయితీకి చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉద్యోగం మానేస్తానని చెప్పారు. ఇంకేం,  వెంటనే పారిశుధ్య విభాగానికి చెందిన ఒకరి కుటుంబసభ్యురాలి పేరు అతడి స్థానంలో చేర్చారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఎవరు ఉద్యోగం మానేసినా, అందులో పనిచేసేవారు తమ కుటుంబసభ్యులను నియమించేలా చేసుకోవటంతో విషయం బయటకు పొక్కటంలేదు.


ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

ఎవరు నియమిస్తున్నారో తెలియదు కానీ నగరపాలకసంస్థలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నారు. కొత్త నియామకాలు పెరిగిపోతున్నాయి. మెప్మా సంస్థ ద్వారా కొందరు, నగరపాలక సంస్థ ద్వారా మరికొందరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు పొందుతున్నారు. ఒక పర్యాయం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలపై అనుమానం వచ్చిన కమిషనర్‌ వారి వేతనాల బిల్లులపై సంతకం చేయకుండా విచారణ చేశారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తీసుకోవటం నగరపాలక సంస్థలో చర్చాంశనీయంగా మారింది. కమిషనర్‌, మేయర్‌ ఈ విషయాలపై విచారణ చేస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.

Updated Date - 2022-07-13T05:12:32+05:30 IST