పుష్పల రహదారి

ABN , First Publish Date - 2022-04-06T06:30:44+05:30 IST

ఎర్రచందనం అక్రమ రవాణాకు జిల్లాలో 44వ జాతీయ రహదారి రాచబాటగా మారింది. ఇటీవల జిల్లా సరిహద్దులో కొడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు వరుసగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఘటనలే ఇందుకు నిదర్శనం.

పుష్పల రహదారి

ఎనహెచ్ 44 మీదుగా యథేచ్ఛగా ఎర్రచందనం రవాణా


చెక్‌పోస్టులున్నా సరిహద్దు దాటేస్తున్న వైనం


పోలీసులకు పట్టుబడేది కొంతే..


ఎర్రచందనం ముఠాలకు 44వ జాతీయ రహదారి రాచబాటగా మారింది. చెక్‌పోస్టులున్నా.. యథేచ్ఛగా తరలిస్తున్నారు. కోట్ల విలువైన దుంగలను సరిహద్దు దాటిస్తున్నారు. ఇటీవల వరుసగా దుంగలు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. సరుకు భారీగా రవాణా అవుతున్నా.. పోలీసులకు పట్టుబడుతున్నది కొంతే..!


పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి

ఎర్రచందనం అక్రమ రవాణాకు జిల్లాలో 44వ జాతీయ రహదారి రాచబాటగా మారింది. ఇటీవల జిల్లా సరిహద్దులో కొడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు వరుసగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఘటనలే ఇందుకు నిదర్శనం. గతనెలలో రాజంపేట, తాడిపత్రి ప్రాంతాల నుంచి తరలిస్తున్న రూ.80 లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలతోపాటు అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు పట్టుబడిన వైనం చూస్తే అక్రమ రవాణా ఏస్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. కడప జిల్లా అటవీ ప్రాంతాల్లోని ఎర్రచందనం చెట్లు కొట్టి, ఎర్రముఠాలు రెండు జిల్లాలను సునాయాసంగా దాటేస్తూ కర్ణాటక అటు నుంచి తమిళనాడుకు తరలిస్తూ రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నాయి. కడప, కర్ణాటక సరిహద్దుల్లో ఎన్నో చెక్‌పోస్టులున్నా ఎలా దాటిస్తున్నారనేది చర్చనీయాంశమైంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై పక్కా సమాచారం ఉన్నవాటిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారు. లేదంటే ఎర్రదొంగలు సరిహద్దు దాటేస్తున్నారు. దీనివెనుక కొందరు పెద్దలతోపాటు ఇంటి దొంగల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ రవాణా వెనుక బెంగుళూరు, తమిళనాడు అంతర్రాష్ట్ర ఎర్రచందనం ముఠాలు ఉన్నాయంటూ పోలీసు వర్గాలు చెబుతున్నా.. ఆ పెద్దల పేర్లు మాత్రం ఏ ఒక్కటీ బయటకు చెప్పలేని పరిస్థితి. ఈనేపథ్యంలో పోలీసులకు పట్టుబడుతున్నది కొంతే అనీ, కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనం జిల్లా సరిహద్దు దాటుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రపుష్పల సమాచారం ఉన్నా.. ఎక్కడికక్కడ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు.


కడప టు కర్ణాటక

కడప జిల్లాలోని బద్వేల్‌, కోడూరు, రాజంపేట తదితర అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లపై ఎర్ర ముఠాలు కన్నేశాయి. తమిళనాడు నుంచి కూలీలను తరలించి, స్థానికంగా ఉన్న ఎర్రచందనం దొంగల సహకారంతో కడప జిల్లా నుంచి నేరుగా కార్లు ఆటోలు, గూడ్స్‌ లారీలతోపాటు పలు మార్గాల్లో ఎర్రచందనం తరలిస్తున్నాయి. ఇటీవల వరుసగా 44వ నెంబరు జాతీయ రహదారిపై చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడిన ఎర్రచందనాన్ని కడప జిల్లా అటవీ ప్రాంతాల నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. కడప నుంచి జిల్లా సరిహద్దు వరకు పోలీసు నిఘా ఉన్నా.. ఎర్రదొంగల అక్రమ రవాణా మాత్రం ఆగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో చెక్‌పోస్టులు దాటి జిల్లా సరిహద్దు పోలీసులకు చిక్కడమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలోకి వచ్చే గ్రామీణ రోడ్లుసహా ప్రధాన రహదారుల్లోని సరిహద్దు సెబ్‌ చెక్‌పోస్టుల్లో కర్ణాటక నుంచి వచ్చే అనుమానిత వాహనాలను మాత్రమే తనిఖీ చేస్తున్నారు. జిల్లా నుంచి సరిహద్దు దాటే వాటిని తనిఖీ చేయకపోవడం ఎర్రముఠాలకు బాగా కలిసివస్తోంది. ఈనేపథ్యంలో ఎర్రచందనం తరలింపులో రూటు మార్చి పోలీసులు, అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి ఎర్రముఠాలు సరిహద్దు దాటేస్తున్నాయి. కడప నుంచి చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడుకు ఎర్రచందనం తరలించాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో చెక్‌పోస్టులు, నిఘా ఎక్కువగా ఉండడంతో ఎర్రచందనం ముఠాలు రూటు మార్చాయి. కడప నుంచి వివిధ మార్గాల్లో శ్రీసత్యసాయి జిల్లాలోకి ప్రవేశించి, 44వ జాతీయ రహదారి మీదుగా బెంగుళూరుకు ఎర్రచందనం తరలిస్తున్నాయి. అక్కడి నుంచి తమిళనాడుకు రవాణా చేస్తూ రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నాయి. ఇటీవల సెబ్‌ పోలీసులే కాపుకాసి ఎర్రచందనాన్ని పట్టుకుంటున్న నేపథ్యంలో అటవీ శాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడు నెలల్లో అక్రమంగా జిల్లా సరిహద్దు దాటుతున్న 8395 ఎర్రచందనం దుంగలతోపాటు 15 వాహనాలను హిందూపురం రూరల్‌, చిలమత్తూరు పోలీసులు పట్టుకున్నారంటే జిల్లా మీదుగా పలు రహదారుల్లో ఏమేరకు ఎర్రచందనం సరిహద్దు దాటిపోతోందో అర్థం చేసుకోవచ్చు.



ఇటీవల జిల్లా సరిహద్దులో పట్టుబడిన ఎర్రచందనం వివరాలు

గతేడాది జూలై 31న కడప జిల్లా అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ఎర్రచందనం ముఠాను అరెస్టు చేసి, రూ.21 లక్షల విలువచేసే ఎర్ర చందనం దుంగలను చిలమత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. ఇందులోని నిందితులు జూలై 18న కారులో అక్రమంగా బెంగళూరుకు ఎర్రచందనం దుంగలను తరలిస్తూ కొడికొండ చెక్‌పోస్టులో తనిఖీల్లో పట్టుబడ్డారు. వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోగా.. అందులో రూ.9 లక్షల విలువచేసే 13 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.


గతేడాది నవంబరు 26న తమిళనాడు నుంచి భక్తుల వేషాల్లో కడపకు వెళుతున్న 40 మంది ఎర్రచందనం కూలీలను కొడికొండ చెక్‌పోస్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఎర్రచందనం చెట్లను నరికే యంత్రాలు, ఇతర సామగ్రిని చిలమత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ ఏడాది ఫిబ్రవరి 11న చిలమత్తూరు మండలం యగ్నిశెట్టిపల్లి సమీపాన ఎర్రచందనం దుంగల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.20 లక్షల విలువచేసే 25 దుంగలను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు. 


మార్చి 10వ తేదీన కడప జిల్లా నుంచి బెంగుళూరుకు తరలిస్తున్న రూ.80 లక్షల వివలువచేసే 1380 కిలోల ఎర్రచంద నం దుంగలను  కొడికొండ చెక్‌పోస్టులో పోలీసులు పట్టుకు న్నారు. ఈ వ్యవహారంలో 9 మందిని అరెస్టు చేశారు.




అంతర్రాష్ట్ర ఎర్రముఠాల పనేనా..?

ఎర్రచందనం జిల్లా మీదుగా అక్రమ రవాణా వ్యవహా రంలో పోలీసులకు చిత్తూరు, కడప, తమిళనాడు, బెంగుళూరు ప్రాంతాల్లోని అంతర్రాష్ట్ర ఎర్రచందనం ముఠాలే పట్టుబడుతున్నాయి. వారితోపాటు కూలీలను అరెస్టు చేసినా.. వారి నుంచి అక్రమ రవాణా వెనుక పెద్దలు ఎవరున్నారనేది మాత్రం పోలీసులు వెల్లడించలేకపోతున్నారు. ఇటీవల పట్టుబడిన కూలీలు, దొంగల సమాచారంతో సరిహద్దు దాటిన ఎర్రదొంగల మూలాలను పట్టుకునేందుకు పోలీసులు కర్ణాటక, తమిళనాడు, కేరళకు వెళ్లి ఎర్రచందనం స్వాధీనం చేసుకుని, అది జిల్లా సరిహద్దులో పట్టుబడినట్లు చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎర్రముఠాలను పట్టుకోవడానికి వెళ్లిన జిల్లా పోలీసు బృందాలకు ఎర్రదొంగల నుంచి పలు సవాళ్లు ఎదురైనట్లు తెలుస్తోంది. ఎర్రముఠాల వెనుక ఉన్న పెద్దల నుంచి కూడా ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాలకు తెగించి ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు ఎదురు నిలబడుతున్నామని ఇటీవల సెబ్‌ ఏఎస్పీ అన్న మాటలను బట్టి చూస్తే ఒత్తిడి, బెదిరింపులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతర్రాష్ట్ర ఎర్రముఠాల వెనుక కడప జిల్లాకు చెందిన కొందరు పెద్దలతోపాటు ఇంటి దొంగల హస్తం ఉండొచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల పట్టుబడిన ఎర్రచందనం ముఠా సభ్యుల సెల్‌ఫోనలో పెనుకొండ సబ్‌ డివిజనలోని సరిహద్దులో పనిచేస్తున్న ఓ సీఐ ఫొటో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సీఐ కంటపడకుండా సరిహద్దు దాటాలని ఎర్రచందనం రవాణా చేసే దొంగలకు ఎర్రముఠాలు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఎర్రచందనం సరిహద్దులో పట్టుబడుతున్నా.. ఇటీవల వరుస ఘటనలను బట్టి చూస్తే అక్రమ రవాణా భారీగా పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-04-06T06:30:44+05:30 IST