ఊపందుకున్న పురపోరు

ABN , First Publish Date - 2021-02-27T05:23:14+05:30 IST

జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలకు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీల ఎన్నికలకు లైన్‌క్లియర్‌ అయింది. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూల్‌కనుగుణంగా కోర్టు తీర్పు ఇవ్వటంతో కొత్త నామినేషన్ల దాఖలుకి అవకాశం లేకుండాపోయింది. వచ్చేనెల 2,3 తేదీలలో నామినేషన్ల ఉపసంహరణ, 10వ తేదీ పోలింగ్‌కి రంగం సిద్ధమైంది. తాజా కోర్టు నిర్ణయం కలిసొస్తుందని వైసీపీ భావిస్తుండగా, ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో సత్తా చాటాలని తెలుగుదేశం భావిస్తోంది.

ఊపందుకున్న పురపోరు
ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం (ఫైల్‌)

హైకోర్టు నిర్ణయంతో డీలాపడ్డ ఆశావహులు 

కలిసొస్తుందంటున్న వైసీపీ

తడాఖా చూపిస్తామంటున్న టీడీపీ 

చీరాలపై సీఎం జగన్‌తో బాలినేని భేటీ 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలకు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీల ఎన్నికలకు లైన్‌క్లియర్‌ అయింది. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూల్‌కనుగుణంగా కోర్టు తీర్పు ఇవ్వటంతో కొత్త నామినేషన్ల దాఖలుకి అవకాశం లేకుండాపోయింది. వచ్చేనెల 2,3 తేదీలలో నామినేషన్ల ఉపసంహరణ, 10వ తేదీ పోలింగ్‌కి రంగం సిద్ధమైంది. తాజా కోర్టు నిర్ణయం కలిసొస్తుందని వైసీపీ భావిస్తుండగా, ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో సత్తా చాటాలని తెలుగుదేశం భావిస్తోంది. ఈ ఎన్నికలలో అవకాశం ఉన్న అన్ని స్థానాలకు పోటీచేసి ఫలితాలను చవిచూడాలని జనసేన ఉవ్విళ్లూరుతోంది. బీజేపీతో పాటు అవకాశం ఉన్నచోట టీడీపీతో ఒప్పందానికి వారు చర్చలు ప్రారంభించారు. బీజేపీతో కలిసి జనసేన ముందుకు రావటంతో టీడీపీతో జతకట్టేందుకు వామపక్షాలు వెనుకంజ వేస్తున్నాయి. అధికారపార్టీకి ఛైర్మన్‌ అభ్యర్థుల వ్యవహారం దాదాపు అన్నిచోట్ల వివాదాస్పదమైంది. చీరాలలో నేతల మధ్య ఆధిపత్యపోరు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. 


ఒంగోలు కార్పోరేషన్‌లో..

ఒంగోలు కార్పోరేషన్‌లో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్య నెలకొనగా జనసేన, వామపక్షాలతో కూడా టీడీపీ నేతలు చర్చలు ప్రారంభించారు. మంత్రి బాలినేని గంగాడ సుజాతను మేయరు అభ్యర్థిగా దాదాపుగా ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉండటంతో పాటు వేరే వారికోసం ప్రయత్నిస్తున్న కొందరు ఆ విషయాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి  మంగళవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా ముఖ్యనేతలతో అనవసరమైన సమస్యలు సృష్టిస్తే ఇబ్బందిపడతారంటూ హెచ్చరిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకుగాను 40చోట్ల దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశారు. మేయరు అభ్యర్థిగా భావిస్తున్న సుజాత వెంగముక్కపాలెం ప్రాంత డివిజన్‌లో పోటీకి దించాలని నిర్ణయించినట్లు తెలిసింది. టీడీపీ బలంగా ఉండే ప్రాంతాలను వార్డుల పునర్విభజన పేరుతో వివిధ డివిజన్లలోకి చీల్చటం ద్వారా ముందుగానే ఒక వ్యూహాన్ని రూపొందించుకున్న మంత్రి  ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న అనైక్యతలను, అసంతృప్తులను సొమ్ముచేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. నాలుగు డివిజన్లలో టీడీపీ ప్రధాన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అది వివాదాస్పదంగా మారింది. టీడీపీ పక్షాన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ రంగంలోకి రావటంతో ఆ పార్టీ తరఫున నామినేషన్లు వేసిన వారంతా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అయితే 28, 35, 24, 38 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు చెల్లలేదు. అక్కడ స్వంతంత్రులు లేక జనసేన అభ్యర్థులకు మద్దతిచ్చే ప్రయత్నంలో టీడీపీ ఉంది. కాగా 10 డివిజన్లలో ఆ పార్టీకి స్థానికంగా కూడా ప్రజా సంబంధాలు ఉండి అన్ని హంగులు సమకూర్చుకోగల అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగి ప్రచారంలో ముందున్నారు. ఈ నేపథ్యంలో అటు జనసేన, ఇటు వామపక్షాలతో పొత్తుకి టీడీపీ ప్రయత్నించింది. జనసేన నాయకులు తమకిచ్చే 16 డివిజన్లలో 4 డివిజన్లు తమ మిత్రపక్షమైన బీజేపీకి ఇవ్వాలని షరతు విధించింది. దీంతో వామపక్షాలు వెనక్కి పోగా తెలుగుదేశంతో జనసేన సఖ్యత కోసం మంత్రి శ్రీనివాసరావు విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు చెల్లని నాలుగు డివిజన్లలో జనసేన అభ్యర్థులకు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. కాగా 38వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి వైసీపీకి సవాల్‌ విసురుతున్నారు. 


చీరాలపై కఠిన నిర్ణయం ..

చీరాలలో ఎమ్మెల్యే బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి మధ్య ఆధిపత్యపోరుకి సంబంధించి పార్టీ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పర్చూరు ఇన్‌ఛార్జ్‌తో పాటు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఆమంచికి హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుత పదవుల్లో ఆయనకు స్థానం దక్కలేదు. పర్చూరు వెళ్లేందుకు సిద్ధమైనప్పటికీ చీరాలలో నామినేషన్‌ వేసిన అనుచరుల కోసం ఆయన పట్టుబడుతున్నారు. ఈ దశలో మంత్రి శుక్రవారం మధ్యాహ్నం సీఎంని కలిసి ఈ విషయంపై చర్చించారు. తాజా పరిస్థితిని వివరించారు. సమస్య పరిష్కారం, అలాగే చీరాలని పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకోవటమే లక్ష్యంగా ఒక్క వ్యూహాన్ని ఆయన జగన్‌ ముందు పెట్టగా కొద్దిపాటి మార్పులతో సీఎం దానిని ఆమోదించినట్లు తెలిసింది. అంతేగాక పార్టీ చెప్పే విధానం నూటికి నూరుశాతం అమలు కావాలి, అందుకు ఎవరు అతిక్రమించినా క్షమించాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని వారికి తెలియజేసి మొత్తం వ్యవహారాన్ని మీరే పర్యవేక్షించండంటూ బాలినేనికి సీఎం సూచించినట్లు విస్ర్తుతంగా ప్రచారం జరుగుతోంది. కాగా సీఎం చీరాలపై ఏం నిర్ణయం తీసుకున్నారనే విషయంపై సమాచారం కోసం శుక్రవారం సాయంత్రం నుంచి మంత్రిని పలువురు కలిసినప్పటికీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం, ముఖ్య నాయకులకు చెబుతాం, చెప్పినట్లు చేయండంటూ ఖరాఖండిగా చెప్తున్నారే తప్ప అసలు విషయాన్ని వెల్లడించటం లేదు. టీడీపీ పక్షాన ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబే చీరాలపై దృష్టిపెట్టి ఉన్నందున వైసీపీలో చోటుచేసుకునే పరిణామాలను సొమ్ము చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆ పార్టీ స్థానిక నాయకులు కాచుక్కూర్చున్నారు.


Updated Date - 2021-02-27T05:23:14+05:30 IST