ఉడ్‌తా పంజాబ్‌ కాదు.. బఢ్‌తా పంజాబ్‌!

ABN , First Publish Date - 2022-03-17T08:16:14+05:30 IST

పంజాబ్‌ చరిత్రలో స్వర్ణయుగం ఆరంభమైందని ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ (48) అన్నారు.....

ఉడ్‌తా పంజాబ్‌ కాదు.. బఢ్‌తా పంజాబ్‌!

  కొత్త సీఎం భగవంత్‌ మాన్‌ వ్యాఖ్య

   భగత్‌సింగ్‌ స్వగ్రామంలో..

 ముఖ్యమంత్రిగా ప్రమాణం


షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌, మార్చి 16: పంజాబ్‌ చరిత్రలో స్వర్ణయుగం ఆరంభమైందని ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ (48) అన్నారు. ‘ఉడ్‌తా పంజాబ్‌ కాదు.. బఢ్‌తా (ఎదిగే) పంజాబ్‌’ను ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఆ రాష్ట్రంలో డ్రగ్స్‌ మహమ్మారి పెరగడంతో ‘ఉడ్‌తా పంజాబ్‌’ అనే పేరుతో సినిమా తీశారు. దానిని దృష్టిలో ఉంచుకుని మాన్‌ పై వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్‌, అకాలీదళ్‌లను మట్టికరిపించి.. 117 స్థానాల అసెంబ్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 92 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ సీఎం అభ్యర్థి అయిన మాన్‌ బుధవారం రాష్ట్ర నూతన సీఎంగా పదవీప్రమాణం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్‌ భగత్‌సింగ్‌ స్వగ్రామం ఖట్కర్‌ కలాన్‌లో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. మాన్‌ ఆకాంక్ష మేరకు ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్‌, పార్టీ పంజాబ్‌ ఇన్‌చార్జి జర్నైల్‌సింగ్‌, సహ ఇన్‌చార్జి రాఘవ్‌ చద్దా, కొత్తగా ఎన్నికైన ఆప్‌ ఎమ్మెల్యేలు పసుపు తలపాగాలతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. పురుషులంతా పసుపు తలపాగాలు ధరించగా.. మహిళలు పసుపు రంగు దుపట్టాలతో వచ్చారు. కాగా.. మాన్‌ ఒక్కరే బుధవారం ప్రమాణం చేశారు. కేబినెట్‌ కూర్పుపై కసరత్తు పూర్తయ్యాక మిగతా మంత్రులు ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం మాన్‌ క్లుప్తంగా ప్రసంగించారు. అనంతరం పంజాబ్‌ సివిల్‌ సెక్రటేరియట్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి నవజోత్‌సింగ్‌ సిద్ధూ రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలతో తన రాజీనామాను పంపించానని బుధవారం వెల్లడించారు. 

Updated Date - 2022-03-17T08:16:14+05:30 IST