Advertisement
Advertisement
Abn logo
Advertisement

పునీత్‌ హఠాన్మరణంతో యువతలో పెరుగుతున్న ఆందోళన

                           - వారంలోనే వేలాది మందికి పరీక్షలు


బెంగళూరు(Karnataka): పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తూ హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన అనంతరం యువతలో రానురాను ఆందోళన పెరిగిపోతోంది. తమ గుండె భద్రంగా ఉందోలేదో పరీక్షించుకొనేందుకు యువత ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు దీస్తున్నారు. గత వారం రోజుల అవధిలోనే సుమారు 4 వేల మంది యువకులు బెంగళూరు జయదేవ ఆస్పత్రిలో హృద్రోగ పరీక్షలు జరుపుకోవడమే ఇందుకు తార్కాణం. జయదేవ ఆస్పత్రి హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ మంజునాథ్‌ స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. 35 సంవత్సరాలు దాటిన పురుషులు, 45 సంవత్సరాల వయస్సు దాటిన మహిళలు అడపాదడపా తమ గుండె పనితీరును పరీక్షించుకొంటే చాలా మంచిదన్నారు. ప్రారంభంలోనే హృద్రోగ సమస్యలను గుర్తించగలిగితే వీటిని నివారించుకోవడం చాలా సులభమన్నారు. ప్రత్యేకించి భారం అధికంగా మోసే పనులు చేసేవారు, అత్యధిక సమయం పనులు నిర్వహించేవారు, ధూమపాన వ్యసనం ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిదికాదన్నారు. ఈ కేటగిరీకి చెందినవారికి గుండె జబ్బులు ఉంటాయన్నది దీని అర్థం కాదని అయితే ఇలాంటి వారిలో సమస్యలు అధికంగా ఉంటున్న కారణంగా పరీక్షలు నిర్వహించుకొంటే మంచిదన్నారు. బెంగళూరు నగరంలో కేవలం ఒక వారంలోనే వేలాది మంది హృద్రోగ పరీక్షలు జరుపుకునేందుకు ముందుకు వస్తుండడం హర్షదాయకమన్నారు. భయం, ఆందోళనలతో పాటు తమ ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ ఇందుకు కారణమన్నారు. భారతదేశంలో రకరకాల కారణాలతో చాలా మంది గుండెపోట్లకు గురై మృతిచెందుతున్నట్లు చెప్పారు. కనీస అప్రమత్తత పాటిస్తే ఈ మరణాలను తగ్గించుకోవడం సాధ్యమన్నారు. మారుతున్న జీవనశైలి, పౌష్టిక ఆహార లోపం వంటివి కూడా ఇటీవలి కాలంలో హృద్రోగ సమస్యలకు దారితీస్తోందన్నారు. రోజుకు 30 నుంచి 40 నిమిషాల అవధి వరకే వ్యాయామం చేయడం మంచిదన్నారు. జిమ్‌లలో వర్క్‌అవుట్‌లు చేసేవారు నిపుణుల సమక్షంలోనే వీటిని కొనసాగించాలన్నారు. చాతినొప్పి వస్తే సొంత వైద్యం జోలికి పోరాదని ఒక్కసారి పరీక్ష చేయించుకొని వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement