ప్యాలెస్‌లో పునీత్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-11-10T18:06:35+05:30 IST

చందనసీమ పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కు చలనచిత్ర వాణిజ్యమండలి మంగళవారం ఘనంగా నివాళి అర్పించింది. ప్రభుత్వ అనుమతితో ప్యాలెస్‌ మైదానంలో అభిమానుల కోసం ప్రత్యేకంగా వైకుంఠ

ప్యాలెస్‌లో పునీత్‌కు ఘన నివాళి

బెంగళూరు(Bengaluru): చందనసీమ పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కు చలనచిత్ర వాణిజ్యమండలి మంగళవారం ఘనంగా నివాళి అర్పించింది. ప్రభుత్వ అనుమతితో ప్యాలెస్‌ మైదానంలో అభిమానుల కోసం ప్రత్యేకంగా వైకుంఠ సమారాధన నిర్వహించారు. పునీత్‌ ఇష్టపడి తినే అనేక వెరైటీ రుచుల ఆహార పదార్థాలను అభిమానులకు కొసరి కొ సరి వడ్డించారు. మధ్యాహ్నం తర్వాత ప్యాలెస్‌లోకి అభిమానులు వేలసంఖ్యలో తరలివచ్చారు. మూడు వేల మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. 750 మందికి పైగా వంట సిబ్బంది వడ్డనలో పాల్గొన్నారు. పునీత్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పునీత్‌ అన్నలైన శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ స్వయంగా అభిమానులకు అన్నదానం చేశారు. ఇదే సందర్భంగా రక్తదానం చేశారు. తమ సోదరుడిని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్‌రాజ్‌కుమార్‌ భూమితల్లి ఒడిలోకి చేరుకుని అభిమానుల్లో వేదన ఏమాత్రం తగ్గలేదనడానికి మంగళవారం నాటి దృశ్యాలు సాక్షాత్కారంగా నిలిచాయి. తమ అభిమాన నటుడిని తలచుకుంటూ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. డీసీపీ అనుచేత్‌ ప్యాలెస్‌ వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు చాలామంది సదాశివనగర్‌లోని పునీత్‌ నివాసానికి తరలివెళ్లడంతో అక్కడ కూడా భద్రతను ఏర్పాటు చేశారు. పునీత్‌కు వైద్యం అందించిన డాక్టర్‌ రమణారావు ని వాసం వద్ద కూడా ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు వేలసంఖ్యలో తరలిరావడంతో మేఖ్రీ సర్కిల్‌, సదాశివనగర్‌, హెబ్బాళ్‌ తదితర ప్రాంతాలలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పునీత్‌కు సన్నిహితులైన కొంతమంది నటులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ సమాధి వద్ద ఆయన సతీమణి అశ్విని, తదితరులు వైకుంఠ సమారాధన పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానులను లోపలికి అనుమతించారు. 



Updated Date - 2021-11-10T18:06:35+05:30 IST