ఆగేట్లు లేవు..!

ABN , First Publish Date - 2022-08-13T06:06:19+05:30 IST

ఆగేట్లు లేవు..!

ఆగేట్లు లేవు..!
పులిచింతల ప్రాజెక్టు

పులిచింతల ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు   

భారీ వరదకు గేట్ల పనితీరు అంతంతమాత్రమే..

గత ఏడాది కొట్టుకుపోయిన గేటు

తాత్కాలిక గేటుతో సరి..

తాజాగా 12వ నెంబరు గేటుపైనా అనుమానాలు

సాగర్‌ నుంచి భారీగా చేరుతున్న వరదతో ఇబ్బందులే..


పులిచింతల ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం ప్రాజెక్టుకు వస్తున్న భారీ వరద ఉధృతిని తట్టుకునే సామర్థ్యం ప్రాజెక్టుకు ఉందా? అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. గత ఏడాది వరద ధాటికి కొట్టుకుపోయిన 16వ నెంబరు గేటుకు శాశ్వత మరమ్మతులు చేయకపోగా, తాజాగా 12వ నెంబరు గేటు కూడా రిపేర్లకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. 


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : కృష్ణానదికి భారీగా నీరు వస్తున్న తరుణంలో పులిచింతల ప్రాజెక్టుల గేట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన ఏడాది జరిగిన ఘటనతో ఈ అనుమానాలకు ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు ఉన్న 16వ నెంబర్‌ గేటు కొట్టుకుపోయి ఏడాది పూర్తయింది. 2021, ఆగస్టు 5వ తేదీన వరద ప్రవాహ ఉధృతికి గేటు కొట్టుకుపోయింది. దీనికి మరమ్మతులు చేయడానికి నిండుకుండలా ఉన్న ప్రాజెక్టును ఖాళీ చేయాల్సి వచ్చింది. మూడు రోజుల పాటు రేయింబవళ్లు పనిచేసి కొట్టుకుపోయిన గేటు స్థానంలో మరో గేటును తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ భారీగా ఎగువ నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో ఈ గేటుతో పాటు మరో గేటు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని తెలుస్తోంది.

వేసవిలో చేయాల్సిన పనులే..

సాధారణంగా ప్రాజెక్టుల గేట్లకు వేసవిలో మరమ్మతులు చేస్తారు. వర్షాలు కురవకపోవడం, ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు దిగువకు వచ్చే అవకాశం ఏమాత్రం ఉండకపోవడంతో ప్రతి ప్రాజెక్టు గేట్ల నిర్వహణను వేసవిలో చేస్తారు. పులిచింతల ప్రాజెక్టుకు ఉన్న 16వ నెంబరు గేటు గడిచిన ఏడాది ఆగస్టు 5వ తేదీన కొట్టుకుపోయింది. ఈ గేటు ద్వారా దిగువకు వస్తున్న నీటిని నిలువరించడానికి స్టాప్‌ లాక్‌ సిస్టంలో ఇనుప పట్టీలను ఒకదానిపై ఒకటి అమర్చి తాత్కాలికంగా గేటును ఏర్పాటు చేశారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త దానిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ఇక్కడ తాత్కాలిక గేటును తొలగించి శాశ్వత గేటును ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కానీ, జలవనరుల శాఖలోని ఉన్నతాధికారులు ఈ గేటు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. తాత్కాలిక గేటు ఏర్పాటుచేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ గేటుతో పాటు 12వ నెంబరు గేటునూ ఉపయోగించడం లేదు. సాంకేతిక లోపాలను గుర్తించిన అధికారులు దీనినీ ఉపయోగించడం మానేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌ నుంచి వస్తున్న నీటిని ఈ రెండూ మినహా మిగిలిన గేట్ల ద్వారా వదులుతున్నారు.

ఎంతవరకు భద్రం..?

పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 గేట్లు ఉన్నాయి. వాటిలో 16వ నెంబరు గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఉండగా, 12వ నెంబరు గేటును ఎత్తడానికి అధికారులు సాహసించడం లేదు. నాగార్జున సాగర్‌ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరకు నీరు వస్తుందని అంచనా వేశారు. పరిస్థితులను బట్టి ఇది 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు గేట్ల స్థితిగతులు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ప్రవాహ ఉధృతి పెరిగి గేట్లకు ముప్పు కలిగితే ప్రత్యామ్నాయ పరిస్థితి ఏమిటన్నది అధికార వర్గాలు చెప్పలేకపోతున్నాయి. పైగా ఏడాదైనా కొట్టుకుపోయిన గేటు స్థానంలో శాశ్వత గేటును ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారన్న ప్రశ్న నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. జలవనరుల శాఖలోని ఉన్నతాధికారులు కొందరు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించలేదని తెలుస్తోంది. అసలు కొత్త గేటు అమరికకు సంబంధించిన ప్రతిపాదనలు తయారయ్యాయా లేదా అనే విషయాన్ని జలవనరుల శాఖ వర్గాలు చెప్పలేకపోతున్నాయి. ఈ విషయంలో ప్రాజెక్టు నిర్వహణ అధికారులు సైతం మౌనం వహిస్తున్నారు. భారీగా వస్తున్న వరదను చూసైనా అధికారుల్లో కదలిక వస్తుందా, రాదా చూడాలి.




Updated Date - 2022-08-13T06:06:19+05:30 IST