పుడమి తల్లికి గర్భశోకం...

ABN , First Publish Date - 2022-04-18T05:08:27+05:30 IST

మానవాళి మనుగడకే ఆధారమైన నేల తల్లి రైతులు వాడుతున్న మల్చింగ్‌ పేపర్‌, రసాయనిక ఎరువుల వాడకంతో సహజత్వాన్ని కోల్పోతోంది.

పుడమి తల్లికి గర్భశోకం...
నేలలో కలిసిపోతున్న మల్చింగ్‌ పేపర్‌

మల్చింగ్‌ పేపర్‌తో ప్లాస్టిక్‌ మయమైన భూమి

సహజ సారవంతాన్ని కోల్పోతున్న నేల తల్లి

అధిక దిగుబడే లక్ష్యంగా అన్నదాతల ఆరాటం

అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వాడకం


రామసముద్రం ఏప్రిల్‌ 17: మానవాళి మనుగడకే ఆధారమైన నేల తల్లి రైతులు వాడుతున్న మల్చింగ్‌ పేపర్‌, రసాయనిక ఎరువుల వాడకంతో సహజత్వాన్ని కోల్పోతోంది. అధిక దిగుబడుల కోసం రైతులు వినూత్న పద్ధతులను పాటిస్తూ రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వాడుతుండటంతో భూమిలోని లవణ, ఖనిజాలు కరిగిపోతున్నాయి. భూమిలో ప్రతి మొక్క ఎదుగుదలకు తనలోని సహజ లవణాలను అందిస్తోంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు ఎడాపెడా రసాయనికి ఎరువులు, పురుగు మందుల వాడకంతో భూమి సహజత్వాన్ని, సారవంతాన్ని కోల్పోతోంది. వాతావరణంలో మార్పులు, వర్షాభావ పరిస్థితులు రైతుల పాలిట శాపాలుగా మారాయి. రైతులకు జీవనాధామైన సేద్యం సాహసోపేతంగా మారింది. సేద్యంలో అధిక దిగుబడులను సాధించడానికి డ్రిప్‌, ప్లాస్టిక్‌, మల్చింగ్‌ పేపర్‌, రసాయనికి ఎరువులు, పురుగు మందులను రైతులు వాడాల్సి వస్తోంది. సేద్యంలో పదేళ్లుగా మల్చింగ్‌ పేపర్‌ను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇందులో నాసిరకం మల్చింగ్‌ పేపర్‌ వాడకంతో పంటకాలం ముగిసిన తరువాత పేపర్‌ చినిగిపోయి భూమిలో ఉండిపోతోంది.

అధిక దిగుబడులే ధ్యేయంగా పంటల సాగు

రైతులకు పంట దిగుబడిపై ఉన్న శ్రద్ధ భూమిలో సహజ లవణాలను కాపాడుకోవడంలో లేదు. విపరీతంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతూ తక్కువ నీరు, తక్కువ ఖర్చు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అధునాతన పద్ధతులు డ్రిప్‌, మల్చింగ్‌, స్ర్పింక్లర్లు, రెయిన్‌గన్స్‌ తదితర పద్ధతుల ద్వారా సాగు చేస్తూ చీడపీడల నివారణకు రసాయన ఎరువులు వాడుతూ కన్నతల్లి లాంటి  భూమాత సహజత్వాన్ని దెబ్బతీస్తున్నారు. 

ఆర్గానిక్‌ మల్చింగ్‌

వరిగడ్డి, గోధుమగడ్డి, వరిపొట్టు, రంపపు పొట్టు, ఎండిన ఆకులు, కంపోస్టు, న్యూస్‌ పేపర్లు, పచ్చిరొట్ట ఎరువులు పంట సాల్ల మధ్య మల్చింగ్‌గా వాడి పంట పూర్తయిన తరువాత నీళ్లతో కలియ దున్నడం వలన నేల సారం పెరగడంతో పాటు భూమిలో పోషకాలు పెరుగుతాయి. నీటిని పట్టి వుంచే గుణం భూమికి పెరుగుతుంది. కంపోస్టు 3 నుంచి 4 ఇంచీల మందం, ఎండిన ఆకులు ఆరు ఇంచీల మందం, పచ్చి రొట్ట ఎరువు 3 ఇంచీల మందం, వరిగడ్డి 2 నుంచి 3 ఇంచీల మందంతో టమోటా పంటలో సాల్ల మధ్య వేసుకోవడం వలన భూమికి ఎలాంటి హాని జరగకుండా భూమికి పోషకాలు లభిస్తాయి.


మానవ మనుగడకే ప్రమాదం

- ఉమాదేవి, ఉద్యాన అధికారి

తక్కువ మైక్రాన్‌ మల్చింగ్‌ పేపర్‌ వాడకం వల్ల నేలలో సహజ లవణాలు తగ్గిపోయి కాలుష్యం బారిన పడుతుంది. నేల తల్లిని నిర్లక్ష్యం చేస్తే మానవ మనుగడకే ప్రమాదం సంభవిస్తుంది. భూమాతను ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలంటే సేంద్రియ వ్యవసాయం చేయాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో నేలలో వర్షపు నీటిని పట్టి ఉంచే సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుంది. పశువుల ఎరువు తగినంత లభ్యం కాని తరుణంలో పచ్చిరొట్ట ఎరువులతో నేలకు సేంద్రియ పదార్థాన్ని అందించటం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం. రైతులు 40 శాతం ఆర్గానిక్‌ మల్చింగ్‌ పేపర్‌ వాడకం వల్ల భూమి కాలుష్యం కాకుండా నివారించవచ్చు.

Updated Date - 2022-04-18T05:08:27+05:30 IST