పట్నంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు

ABN , First Publish Date - 2022-06-25T04:36:37+05:30 IST

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చాలాకాలంగా ఎప్పుడెప్పుడా

పట్నంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు
ఇబ్రహీంపట్నంలో నిర్మాణం పూర్తి కావచ్చిన ఆర్డీవో కార్యాలయం

  • సర్కార్‌ నిధులు, దాతల సహకారంతో నిర్మాణాలు
  • సహకరిస్తున్న రామోజీ ఫౌండేషన్‌ 
  • ప్రభుత్వ నిధులనూ కేటాయిస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి


ఇబ్రహీంపట్నం, జూన్‌ 24: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చాలాకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పలు ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. అద్దెభవనంలో కొనసాగుతున్న అబ్ధుల్లాపూర్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌.. నూతన భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌అలీ బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. రామోజీ ఫౌండేషన్‌ రూ.3కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఈ భవనాన్ని నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం తుర్కయంజాల్‌లో అద్దెభవనంలో కొనసాగుతోంది. కాగా ఇబ్రహీంపట్నంలోని ఎమెల్యే క్యాంపు కార్యాలయం పక్కన రెండు కోట్ల రూపాయల వ్యయంతో రామోజీ ఫౌండేషన్‌ ఆర్డీవో కార్యాలయ నూతన భవనాన్ని నిర్మిస్తోంది. మరో నెల రోజుల్లో ఈ భవనం పనులు పూర్తికానున్నాయి. అలాగే నైజాం కాలంలో నిర్మించిన ఇబ్రహీంపట్నం తహసీల్దారు కార్యాలయం పూర్తి శిథిలమై కూలే దశలో ఉండగా... దాని స్థానంలో రూ.1.25 కోట్లతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి జిల్లా మినరల్‌ ఫండ్‌ను ఖర్చు చేస్తున్నారు. అంతేగాక ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీ ఆవరణలో 24 వేల ఎస్‌ఎ్‌ఫటీతో రూ.4 కోట్ల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో 30 పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు రామోజీ ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి డ్రాయింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. పనులు ప్రారంభించాల్సి ఉంది. 


త్వరలో అందుబాటులోకి డిగ్రీ కళాశాల భవనం

నిధుల లేమితో పనులు నిలిచిపోయిన ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల భవనం మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. 2016 డిసెంబరు 28న ఈ భవనానికి పునాది రాయి వేశారు. ఇంతకాలానికి భవన నిర్మాణం పూర్తికావొస్తుంది. కానీ మౌలిక వసతుల కల్పన ఇతరత్రా రూ.40లక్షలు అవసరమయ్యాయి. నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జూనియర్‌ కళాశాల భవనంలో డిగ్రీ తరగతుల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, ల్యాబ్‌లు ఇతర వసతులకు విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నందున త్వరితగతిన ఈ భవనాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయానికి వచ్చారు.


ప్రభుత్వ నిధులతోపాటు దాతల సహకారంతో..

ప్రభుత్వ నిధులతోపాటు దాతల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించుకుంటున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా అన్ని హంగులతో ఈ భవనాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా రామోజీ ఫౌండేషన్‌ సహకారం మరువలేనిది. ఇప్పటికే నాగన్‌పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ నిర్మించి ఇవ్వడమేగాక ఎన్నో పనులు చేపట్టారు. ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఆర్డీవో కార్యాలయం, ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ఇస్తున్నారు. వారి సహకారంతోనే రూ.3 కోట్లతో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీ్‌సస్టేసన్‌ భవనం నిర్మించుకున్నాం.

- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే 


పాలనను ప్రజల ముంగిటకు చేర్చడమే..

అన్ని హంగులతో ప్రభుత్వ కార్యాలయాలు రూపుదిద్దుకోవడమనేది మంచి పరిణామం. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవడంతోనే దాతలు కూడా ముందుకు వస్తున్నారు. పనులపై వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడమనేది పాలనలో భాగమే. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నంకు మౌలిక వసతులు కూడా అంతే అవసరమనేది గుర్తించాలి.

- బూడిద రాంరెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు



Updated Date - 2022-06-25T04:36:37+05:30 IST