ప్రజారోగ్య పనులను పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-05-24T06:48:12+05:30 IST

జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో ప్రజారోగ్య పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు.

ప్రజారోగ్య పనులను పూర్తిచేయాలి
కిశోర బాలికలు తయారు చేసిన పూసల దండలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

 అమృత్‌ 2.0 పథకం కింద  గ్రామాల్లో అదనపు ట్యాంకుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి 

 మునిసిపల్‌ అధికారుల సమావేశంలో కలెక్టర్‌ పమేలాసత్పథి 

భువనగిరి రూరల్‌, మే 23: జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో ప్రజారోగ్య పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, మునిసిపల్‌ కమిషనర్లు, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్లతో ప్రజారోగ్య పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమృత్‌ 2.0 కింద వాటర్‌ పైపులైన్‌ పనులను పూర్తిచేయాలని, అదనపు వాటర్‌ ట్యాంకుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ, డీఈలు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, డీఈ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి  

ప్రజావాణిలో స్వీకరించిన సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి 30 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. అందులో 23 ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మునిసిపాలిటీలు, జిల్లా పంచాయతీకి సంబంధించినవి రెండేసి ఫిర్యాదులు, పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు, మైనింగ్‌, భూసేకరణ శాఖలకు సంబంధించి ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, కలెక్టరేట్‌ ఏవో ఎం.నాగేశ్వరచారి తదితరులు పాల్గొన్నారు. 


కిశోర బాలికలు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి 

కిశోర బాలికలు చదువుతోపాటు చిన్నతనంనుంచే వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని స్వశక్తితో ఎదగాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. చౌటుప్పల్‌ మండలం పెద్దకొండూరులో ఇటుక బట్టీలలో వలస కార్మికుల కుటుంబానికి చెందిన కిశోర బాలికలకు బాస్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేతి వృత్తులపై నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఆ కిశోర బాలికలు తయారుచేసిన పూసల దండలు, గాజులు, ఫినాయిల్‌ తదితర వస్తువులతో సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను సందర్శించిన కలెక్టర్‌ పమేలాసత్పథి కిశోర బాలికల నైపుణ్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ కృష్ణవేణి, డీసీపీవో సైదులు, బాస్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సత్యహవేరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T06:48:12+05:30 IST