ఆదాయం పెంపుపై పీటీడీ దృష్టి

ABN , First Publish Date - 2020-07-05T09:50:41+05:30 IST

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) నర్సీపట్నం డిపో ఆవరణలో భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కరోనా కారణంగా బస్సుల

ఆదాయం పెంపుపై పీటీడీ దృష్టి

నర్సీపట్నం డిపో స్థలంలో భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌

ఆసక్తి గల వ్యాపారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

10న ఉన్నత స్థాయి సమావేశం


నర్సీపట్నం, జూలై 4: ప్రజా రవాణా శాఖ (పీటీడీ) నర్సీపట్నం డిపో ఆవరణలో భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కరోనా కారణంగా బస్సుల రాకపోకలు నెలలకు నెలలు నిలిచిపోవడంతో భారీ నష్టాల్లో వున్న పీటీడీ...ఆదాయం పెంపునకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. 


గత ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం కాంప్లెక్స్‌ ఆవరణలో గల 1.56 ఎకరాల ఖాళీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ ప్రతిపాదనలను అప్పటి నర్సీపట్నం ఎమ్మెల్యే, మంత్రి అయ్యన్నపాత్రుడు అడ్డుకోవడంతో  మల్లీప్లెక్స్‌ థియేటర్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీ (పీటీడీ) ఆధీనంలో గల ఖాళీ స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా నర్సీపట్నం కాంప్లెక్స్‌ ఆవరణలో ఖాళీగా వున్న స్థలాన్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.


గతంలో ఆర్టీసీ స్థలాల్లో దుకాణాలను బీఓటీ (బిల్డ్‌...ఆపరేట్‌...ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులే నిర్మించుకుని నిర్ణీత కాల వ్యవధి వరకు వాటిని వినియోగించుకుని తదుపరి సంస్థకు అప్పగించే విధానం అమల్లో ఉండేది. తాజాగా ఆర్టీసీ స్థలాల్లో సంస్థ యాజమాన్యమే షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయా స్థలాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తే వ్యాపారులు ముందుకువస్తారో తెలుసుకునేందుకు ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం చేపట్టింది. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో గల స్థలంలో ఏ విధమైన వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు?, షాపులు ఏ విధంగా నిర్మించాలి?, అద్దె నెలవారీ ఎంత చెల్లించాలనుకుంటున్నారు?...తదితర అంశాలపై వ్యాపారుల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. ఇందుకు ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఇచ్చింది.


10న విశాఖలో ఉన్నత స్థాయి సమావేశం

జిల్లాలో కేవలం నర్సీపట్నం కాంప్లెక్స్‌లో మాత్రమే ఖాళీ స్థలం వుందని, దీన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే విషయమై ఇంతవరకూ 70 మంది వరకు తమ ప్రతిపాదనలు, సూచనలు పంపారని ఆర్టీసీ నిర్మాణ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పీవీ నరసింహరావు తెలిపారు. శనివారం ఇక్కడ ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ వరకు ప్రతిపాదనలు స్వీకరిస్తామని, అనంతరం పదో తేదీన విశాఖలో జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో తమకు అందిన ప్రతిపాదనలను పరిశీలించి చర్చించిన అనంతరం తుది ప్రణాళికను ఖరారు చేసి ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-07-05T09:50:41+05:30 IST