రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

ABN , First Publish Date - 2022-05-20T05:17:11+05:30 IST

జిల్లాలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. శ్రీకాకుళం నగర నడిబొడ్డున అందరూ చూస్తుండగానే ఓ మహిళ మెడలోని బంగారు ఆభరణాలను తెంపుకుని బైక్‌పై పరారయ్యారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇచ్ఛాపురంలోనూ ఇదే తరహా చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి.. మార్కెట్‌లో ఓ మహిళ మెడలో రెండు తులాల పుస్తెలతాడును తస్కరించారు. మెళియాపుట్టి మండలంలో బంగారం ఆభరణాలకు మెరుగు పేరిట మోసం వెలుగుచూసింది. జిల్లాలో ఒకేరోజు మూడుచోట్ల చైన్‌స్నాచర్లు చోరీకి పాల్పడడంతో ప్రజల్లో అలజడి రేగుతోంది.

రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
శ్రీకాకుళంలో చైన్‌ లాక్కెళ్తున్న దుండగులు (సీసీ పుటేజీ)... ఇన్‌సెట్‌లో బాధితులు లక్ష్మణరావు, రాధాకుమారి

- మహిళ మెడలోని బంగారు ఆభరణాలు తస్కరణ
- పట్టపగలే శ్రీకాకుళం నగర నడిబొడ్డున ఘటన
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 19:
జిల్లాలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. శ్రీకాకుళం నగర నడిబొడ్డున అందరూ చూస్తుండగానే ఓ మహిళ మెడలోని బంగారు ఆభరణాలను తెంపుకుని బైక్‌పై పరారయ్యారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇచ్ఛాపురంలోనూ ఇదే తరహా చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి.. మార్కెట్‌లో ఓ మహిళ మెడలో రెండు తులాల పుస్తెలతాడును తస్కరించారు. మెళియాపుట్టి మండలంలో బంగారం ఆభరణాలకు మెరుగు పేరిట మోసం వెలుగుచూసింది. జిల్లాలో ఒకేరోజు మూడుచోట్ల చైన్‌స్నాచర్లు చోరీకి పాల్పడడంతో ప్రజల్లో అలజడి రేగుతోంది.
......................
శ్రీకాకుళంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళలో మెడలో బంగారు ఆభరణాలను దొంగిలించి.. దుండగులు పరారయ్యారు. గురువారం మధ్యాహ్నం శ్రీకాకుళం కాకివీధికి చెందిన బోగి లక్ష్మణరావు తన భార్య రాధాకుమారితో కలిసి ద్విచక్ర వాహనంపై రామలక్ష్మణ జంక్షన్‌ వైపు  వెళ్తున్నాడు. లక్ష్మణరావు వాహనం నడుపుతుండగా.. రాధాకుమారి వెనుక కూర్చుంది. సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌(సూర్యమహల్‌ జంక్షన్‌ దగ్గర) సమీపంలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వీరిని వెంబడించారు. బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించగా.. వెనుక కూర్చున్న వ్యక్తి మాస్క్‌ పెట్టుకున్నాడు. బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కేకవేసి రాధాకుమారి మెడలోని బంగారు ఆభరణాలను తెంచుకుని పరారయ్యారు. ఆ సమయంలో వాహనాల రద్దీ, జనం రాకపోకలు అధికంగా ఉన్నా, వారు తప్పించుకొని వెళ్లిపోయారు. ఈ దృశ్యాలన్నీ సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌ వెలుపల ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  బాధితులు రోదిస్తూ శ్రీకాకుళం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన బంగారు నల్లపూసలు, పుస్తెలతాడు ఆరు తులాలు విలువ ఉంటుందని పోలీసులకు వివరించారు. దీనిపై సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టూటౌన్‌ పోలీసులు, సెంటర్‌ క్రైం స్టేషన్‌ పోలీసులు  చైన్‌స్నాచర్ల కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కొన్ని వివరాలు సేకరించారు.

ఇచ్ఛాపురంలో..
ఇచ్ఛాపురం : స్థానిక డైలీ మార్కెట్‌ జంక్షన్‌లో ఓ మహిళ మెడలోని రెండు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకొని పరారయ్యారు.  చీకటి బలరాంపురానికి చెందిన పైల సరస్వతి గురువారం ఉదయం మార్కెట్‌కు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఇంటి వెళ్లేందుకు బయటకు రాగా.. అక్కడే మాటువేసి ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడును అపహరించారు. ఆమె కేకలు వేసినా.. దుండగుల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సరస్వతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

మెరుగుపెడతామంటూ మోసం
మెళియాపుట్టి: బంగారం ఆభరణాలకు మెరుగుపెడతామంటూ జర్రిభద్ర గ్రామానికి చెందిన బెండి భాగ్యలక్ష్మిని గుర్తు తెలియని వ్యక్తులు నమ్మించారు. రెండు తులాల బంగారం ఆభరణాన్ని పట్టుకుని పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ అప్పన్న, బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ‘గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి బంగారం ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పారు. మెడలో బంగారం పుస్తెలతాడు తీసి చేతిలో పట్టుకునేలోపు దాన్ని లాక్కుని వాహనంపై టెక్కలిపట్నం వైపు పరారయ్యారు’ అని బాధితురాలు భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు చుట్టుపక్కలా వెదికినా వారు దొరకలేదని వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అప్పన్న తెలిపారు.

Updated Date - 2022-05-20T05:17:11+05:30 IST