ప్రజలందరికీ సాయం అందించండి

ABN , First Publish Date - 2020-04-03T11:14:20+05:30 IST

రేషన్‌ సరుకులు, పింఛన్లు, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ప్రజలందరికీ అందేలా చూసే బాధ్యత అధికారులదేనని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు.

ప్రజలందరికీ సాయం అందించండి


నిత్యావసరాల ధరలు నియంత్రించండి

ప్రజలకు అందుబాటులో ఉండండి

అధికారులకు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆదేశం


పార్వతీపురం, ఏప్రిల్‌ 2 : రేషన్‌ సరుకులు, పింఛన్లు, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ప్రజలందరికీ అందేలా చూసే బాధ్యత అధికారులదేనని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు.  గురువారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ ఏ కారణంగానైనా రేషన్‌, పింఛన్లు, ఆర్థిక సాయం అందలేదని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రెండు వారాలు కరోనా నియంత్రణకు కీలకమని గుర్తు చేశారు. లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలన్నారు. నిరాశ్రయుల కోసం తాత్కాలిక వసతిని ఏర్పాటు చేయాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ను ఆదేశించారు. జీసీసీ ద్వారా రేషన్‌ను పూర్తి స్థాయిలో అందించాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు సూచించారు.


అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలని...లోపాలు వెలుగుచూస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీల పరిధిలో పారిశుధ్యం మెరుగుకు దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం ఆదేశించిన రీతిలో ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రతిరోజూ అందుబాటులో ఉండాలని..పీహెచ్‌సీల్లో హాజరుకు సంబంధించిన రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యంత్రాంగం ఉత్తమ సేవలందిస్తోందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అభినందించారు.  జ్వరాలకు సంబంధించిన సర్వేలో 551 మంది శాంపిల్స్‌ను సేకరించగా, వాటిలో అనుమానాస్పదంగా ఉన్న 6 శాంపిల్స్‌ను జిల్లా కేంద్రానికి పంపామని వైద్యాధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఐటీడీఏ పీవో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, ఏఎస్పీ బిందుమాధవితో పాటు వైద్య ఆరోగ్య, పోలీసు, పంచాయతీ, ఐటీడీఏ, రెవెన్యూ, పౌరసరఫరాలు, విద్య, ఐసీడీఎస్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-03T11:14:20+05:30 IST